శాసన సభకు డుమ్మా.. శాసన మండలికి హాజరు

అసెంబ్లీ సమావేశాలకు వైఎస్‌ఆర్‌సీపీ డబుల్‌ స్టాండ్‌ తీసుకుంది. తక్కువ మంది ఉన్నచోట గైర్హాజరు.. ఎక్కువ మంది ఉన్నచోట హాజరు కావాలని నిర్ణయించుకుంది. ఎవరి బలం ఎంతంటే

Update: 2024-11-11 09:06 GMT

ఆంధ్రప్రదేశ్‌లో సోమవారం ఉభయ సభల సమావేశాలు మొదలయ్యాయి. ఈ అసెంబ్లీ సమావేశాలకు వైఎస్‌ఆర్‌సీపీ డబుల్‌ స్టాండ్‌ తీసుకుంది. తక్కువ మంది ఉన్నచోట గైర్హాజరు.. ఎక్కువ మంది ఉన్నచోట హాజరు కావాలని నిర్ణయించుకుంది. శాసన మండలికి సంబంధించి మొత్తం 55 మంది సభ్యుల ఉండగా, అందులో వైఎస్‌ర్‌సీపీకి అధిక బలం ఉంది. 39 మంది సభ్యులు ఉన్నారు. తెలుగుదేశం పార్టీకి 9 మంది సభ్యులు ఉన్నారు. జనసేనకు ఒకరు సభ్యులుగా ఉన్నారు. పీడీఎఫ్‌ ఎమ్మెల్సీలుగా ఇద్దరు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు 4 ఉన్నారు. నామినేటెడ్‌ ఎమ్మెల్సీలు 8 మంది వరకు ఉన్నారు. పీడీఎఫ్‌ ఎమ్మెల్సీలు కమ్యూనిస్టులను బలపరుస్తుండగా, నామినేటెడ్‌ ఎమ్మెల్సీలు వైఎస్‌ఆర్‌సీపీని బలపరుస్తున్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీలలో ముగ్గురు వైఎస్‌ఆర్‌సీపీని బలపరుస్తుండగా, ఒకరు కమ్యూనిస్టులను బలపరుస్తున్నారు. అంటే శాసన మండలిలో వైఎస్‌ఆర్‌సీపీకే అధిక బలం ఉంది. వైఎస్‌ఆర్‌సీపీకి సంఖ్యా బలం 42 మంది ఉన్నారు.

అయితే వీరిలో పోతుల సునీత టీడీపీలో చేరారు. కడప జిల్లాకు చెందిన సీ రామచంద్రయ్య కూడా టీడీపీలో చేరారు. విజనగరం ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు, కాకినాడ ఎమ్మెల్సీలు కర్రి పద్మశ్రీ, తోట త్రిమూర్తులు వైఎస్‌ఆర్‌సీపీకి దూరమయ్యారు. పద్మశ్రీ టీడీపీలో చేరినట్లు ప్రకటించారు. త్రిమూర్తులు జనసేనలో చేరేందుకు రెడీ అయ్యారు. రాజీనామా చేసి రావలసిందిగా జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ చెప్పడంతో వెనకడుగు వేశారు. రఘురాజును వైఎస్‌ఆర్‌సీపీ బహిష్కరించింది. అయితే ఆయన కోర్టును ఆశ్రయించి స్టే తెచ్చుకున్నారు. ఈ ముగ్గురు వైఎస్‌ఆర్‌సీపీని బలపరిచే చాన్స్‌ లేదు. అంటే వైఎస్‌ఆర్‌సీపీకి 37 మంది సభ్యుల బలం మాత్రమే ఉంది. మండలిలో ఏ బిల్లును ఆమోదించాలన్నా? తిరస్కరించాలన్నా? వైఎస్‌ఆర్‌సీపీకి ఉన్న బలం సరిపోతుంది. మండలి చైర్మన్‌ కూడా వైఎస్‌ఆర్‌సీపీకి చెందిన వారే. ఈ సమావేశాల్లో శాసన సభ ఆమోదించిన బిల్లులను శాసన మండలికి పంపుతారు. అక్కడ కూడా ఆమోదం పొందాల్సి ఉంటుంది. శాసన మండలికి వైఎస్‌ఆర్‌సీపీ సభ్యులు హాజరు కాగా శాసన సభకు మాత్రం హాజరు కాలేదు.

Tags:    

Similar News