జగన్ నాయకత్వం నచ్చే వైసీపీలో చేరా
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వంటి బలమైన నాయకత్వం ఏపీకి అవసరం. ఆయన నాయకత్వంలో పని చేసేందుకు వైఎస్‌ఆర్‌సీపీలో చేరినట్లు శైలజానాథ్ చెప్పారు.;
By : The Federal
Update: 2025-02-07 07:50 GMT
కేంద్ర, రాష్ట్రాల్లో ఎన్డీఏ ప్రభుత్వాలు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానల మీద పోరాటం చేయాలని నిర్ణయించుకున్నట్లు మాజీ మంత్రి శైలజానాథ్ తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమయంలో మాజీ మంత్రి, మాజీ ఏపీ కాంగ్రెస్ అధ్యక్షులు సాకే శైలజానాథ్, ఏఐసీపీ సభ్యులు, అనంతపురం డీసీసీ మాజీ అధ్యక్షుడు ప్రతాప్‌రెడ్డితో కలిసి వైఎస్‌ఆర్‌సీపీలో చేరారు. వారికి వైఎస్‌ఆర్‌సీపీ కండువా కప్పి పార్టీలోకి జగన్ ఆహ్వానించారు. అనంతరం శైలజానాథ్ మాట్లాడుతూ..
ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయడం లేదు. దీనిపైన పోరాటాలు చేస్తాం. గతంలో జగన్ ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాలకు వైద్య సేవలు అందించే కార్యక్రమాన్ని చేపట్టింది. అయితే కూటమి ప్రభుత్వం వాటిని లేకుండా చేస్తోంది. మెడికల్ సీట్ల విషయంలో కూడా గత జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం కృషి చేస్తే.. వాటిని వద్దంటూ కూటమి ప్రభుత్వం లేఖలు రాసింది. ఇది పేద విద్యార్థులకు చాలా నష్టం చేకూర్చే అంశం. వైద్య విద్యకు పేదలు దూరమయ్యే అవకాశం ఉంది. విద్యా రంగంలో కూడా గత ప్రభుత్వం విశేషమైన కృషి చేసింది. కానీ కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోంది. చివరకు రోడ్లు కూడా ప్రెయివేటు వాళ్ల చేతుల్లో పట్టి వారి జేబులు నింపేందుకు కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోంది. వీటిపైన ఉద్యమాలు చేస్తామని వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్‌లో కక్షపూరితమైన రాజకీయాలు చేస్తోంది కూటమి ప్రభుత్వం, ఇది రాష్ట్ర శ్రేయస్సుకు మంచిది కాదు. రాష్ట్రాభివృద్ధికి, రాష్ట్ర ప్రజల సంక్షేమానికి, రాష్ట్ర బలోపేతానికి కూటమి ప్రభుత్వం అన్యాయం చేస్తోంది. వీటన్నింటి మీద రానున్న రోజుల్లో పోరాటాలు సాగించాలని నిర్ణయించుకున్నట్లు శైలజనాథ్ తెలిపారు. అటు రాయలసీమ జిల్లాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా వీటి పైన ఉద్యమాలు చేపడుతామన్నారు. ప్రత్యేకించి రాయలసీమ ప్రజలు, రాయలసీమ రైతుల కష్టాల మీద పోరాటాలు సాగించాలని నిర్ణయించుకున్నాం. దీని కోసం తమ వంతు కార్యక్రమాలు చేపడుతామని తెలిపారు. రాజకీయాలనేవి వ్యాపారం కాదు. రాజకీయాల అంతిమ లక్ష్యం ప్రజా సేవ. ప్రజల సంక్షేమం. వీటి కోసం కూటమి ప్రభుత్వం పని చేయాలి. ఎన్డీఏ అని చెప్పుకుంటున్న సీఎం చంద్రబాబు రాష్ట్రానికి చేస్తున్నదేమీ లేదు. ఎన్డీఏ విధానాలు ఎప్పుడూ ప్రజా అనుకూల విధానాలు కాదని, ఎప్పుడూ ప్రజా వ్యతిరేక విధానాల కోసమే ఎన్డీఏ పని చేస్తుంది. అవి రాష్ట్రానికి అనుకూలంగా ఉండవు. ఆర్థిక విధానాన్ని దెబ్బతీసే విధంగా ఉంటాయి. వీటిపైన రానున్న రోజుల్లో వీటన్నింటిపైన పని చేస్తామన్నారు.
రాష్ట్రంలో ఒక బలమైన నాయకత్వం కావాలి. అది వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ద్వారా సాధ్యమవుతుందని, ఆయన నాయకత్వంలో పని చేసేందుకు తాను వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు వెల్లడించారు. జగన్‌మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో అనంతపురం జిల్లా కానీ, రాయలసీమ ప్రాంతాలు కానీ అభివృద్ధి సాధ్యమవుతుందని తాను బలంగా నమ్ముతున్నట్లు తెలిపారు. అధికారం కోసం తాము పని చేయడం లేదని, పని చేస్తున్న క్రమంలో అధికారం వస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చిందనే అంశంపై ఆయన మాట్లాడూతూ.. దీనికి పెద్ద కారణాలేమీ లేవని, రాజీనామా చేయాలనుకున్నాను.. ఆ ప్రకారమే రాజీనామా చేశానని తెలిపారు. కాంగ్రెస్ నుంచి చాలా మంది వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వస్తారని చాలా మంది అంటున్నారని.. ఆ విషయం తనకు తెలియదని అన్నారు.