ఏపీలో ఉచిత బస్సు ప్రయాణం.. షరతులు వర్తిస్తాయి

సూపర్ సిక్స్ హామాలను ప్రజల ముందుకు వచ్చిన టీడీపీ ఈ ఎన్నికల్లో సూపర్ డూపర్ విక్టరీని సొంతం చేసుకుంది. ఎవరూ ఊహించని విధంగా టీడీపీ కూటమి ప్రభంజనం సృష్టించింది.

Update: 2024-06-08 14:45 GMT

సూపర్ సిక్స్ హామాలను ప్రజల ముందుకు వచ్చిన టీడీపీ ఈ ఎన్నికల్లో సూపర్ డూపర్ విక్టరీని సొంతం చేసుకుంది. ఎవరూ ఊహించని విధంగా టీడీపీ పార్టీ ఒంటరిగా 134 స్థానాలు కౌవసం చేసుకుంది. మొత్తం కూటమి 164 స్థానాల్లో విజయ ఢంగా మోగించింది. వీటిలో జనసేన పోటీ చేసిన 21 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించి సరికొత్త చరిత్ర సృష్టించింది. ప్రజలపై టీడీపీ వాడిన ప్రధాన అస్త్రం సూపర్ సిక్స్. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రావడంతో సూపర్ సిక్స్ అమలు ఎప్పటి నుంచి షురూ అవుతుందనేది హాట్ టాపిక్‌గా మారింది. అంతేకాకుండా తన తొలి సంతకం మెగా డీఎస్‌సీ పైనే అన్న చంద్రబాబు మాటపై నిలబడతారా? అన్న అనుమానాలు కూడా రేకెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే సూపర్ సిక్స్‌లో ప్రధాన హామీ అయిన ఆర్‌టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం స్కీమ్‌కు సంబంధించి కీలక చర్చ నడుస్తోంది.

తెలంగాణ రూట్‌లోనేనా..

కర్ణాటక, తెలంగాణ, ఢిల్లీ రాష్ట్రాల్లో ఈ పథకం అధికారంలోకి రావడానికి గోల్డెన్ కార్డ్‌లో పనిచేసింది. ఇప్పుడు ఏపీలో కూడా అలానే జరిగింది. అయితే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత మొట్టమొదటగా అమలు చేసిన పథకం కూడా ఇదే. దీంతో ఇప్పడు ఏపీలో కూడా చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వం ఆర్‌టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం పథకాన్నే అమలు చేస్తారా? అన్న చర్చ వాడివేడిగా జరుగుతోంది. అయితే అది సాధ్యం కాదని కొందరు మేధావులు చెప్తున్నారు. తెలంగాణతో పోల్చుకుంటే మన దగ్గర ఆర్‌టీసీ బస్సులు తక్కువగా ఉన్నాయని, ఈ పథకాన్ని అమలు చేయాలంటే ముందుగా ఆర్‌టీసీ బస్సుల సంఖ్యను పెంచాలని విశ్లేషకులు చెప్తున్నారు. అంతేకాకుండా ఈ హామీ విషయంలో తెలంగాణతో పోలిస్తే మనకు కొన్ని పరిమితులు కూడా ఉండొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

4 లక్షల మంది మహిళలే ఉండొచ్చు

ఆంధ్రప్రదేశ్‌లో అన్ని రకాల ఆర్‌టీసీ పాస్‌లు కలిగిన వారు సుమారు 10 లక్షల మంది ఉంటే వారిలో 3 నుంచి 4 లక్షల మంది మహిళలే ఉండొచ్చని అంచనా వేస్తున్నారు నిపుణులు. ఈ క్రమంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీని అమలు చేస్తే రోజుకు రూ.6 కోట్ల రూపాయాల ఆదాయం తగ్గడంతో పాటు అంతకన్నా ఎక్కువే ఖర్చు కూడా ఉంటుందని వారు అంచనా వేస్తున్నారు. అదే విధంగా ఆంధ్రలో ఈ హామీని కొన్ని షరతులతో అమలు చేయొచ్చని అంటున్నారు. తెలంగాణలో ఈ హామీని అన్ని ఎక్స్‌ప్రెస్, పల్లెవెలుగు బస్సుల్లో అమలు చేస్తున్నారని, కానీ అలా ఆంధ్రలో సాధ్యం కాదని అంటున్నారు. ఆంధ్రలో ఈ పథకాన్ని అమలు చేయాలంటే అంతర్‌జిల్లాల్లో తిరిగే ఎక్స్‌ప్రెస్, ఆర్డినరీ బస్సుల్లో మాత్రమే అమలు చేస్తారని అభిప్రాయపడుతున్నారు.

అప్పుడే అధికారిక ప్రకటన

అయితే ఈ హామీ అమలుకు సంబంధించి ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. కానీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే చంద్రబాబు దీనిపై క్లారిటీ ఇవ్వొచ్చని, ప్రభుత్వం ఏర్పడిన తొలి వారంలోనే ఈ హామీకి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడొచ్చని చెప్తున్నారు. అంతేకాకుండా మంత్రిమండలి ఏర్పాటు పూర్తయిన వెంటనే అమలు చేసే హామీల జాబితాను కూడా ప్రకటిస్తారని, అది హామీల అమలు క్రమ సంఖ్యలో ఉంటుందని పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం.

Tags:    

Similar News