జగన్ కల నెరవేరుస్తున్న చంద్రబాబు! విశాఖకు మహర్దశ!!

విశాఖ.. జగన్‌కు అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్… చంద్రబాబుకు టెక్ క్యాపిటల్..

By :  A.Amaraiah
Update: 2025-10-15 02:27 GMT

దక్షిణాసియాలోనే అతి పెద్ద గూగుల్ డేటా సెంటర్- విశాఖపట్నం- గడప తొక్కనుంది. వన్ గిగావాట్‌- A.I.(కృత్రిమ మేథస్సు) హబ్ ను నౌకాకేంద్రమైన విశాఖలో ఏర్పాటు చేయనున్నట్టు గూగుల్ అధికారికంగా ప్రకటించింది. ఈమేరకు ఢిల్లీలో పలువురు కేంద్రమంత్రులు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి లోకశ్, గూగుల్ ఉన్నతాధికారుల సమక్షంలో ఒప్పందం కుదిరినట్టు గూగుల్ సీఇవో సుందర్ పిచాయ్ మంగళవారం ట్వీట్ చేశారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కృషితో వస్తున్న అతి పెద్ద డేటా సెంటర్ ఇది. భారతదేశంలోనే అతి పెద్దది. అమెరికా తర్వాత ఇంత స్థాయిలో గూగుల్‌ పెడుతున్న పెద్ద పెట్టుబడి కూడా ఇక్కడే. దేశవ్యాప్తంగా A.I. ఆధారిత మార్పును వేగవంతం చేయడం, దేశీయ క్లౌడ్‌–A.I. అవసరాలకు కంప్యూటింగ్‌ ను అందించడం దీని ఉద్దేశం. 2026 నుంచి వచ్చే 5 ఏళ్లలో సుమారు 1 లక్షా 33 వేల కోట్ల రూపాయల పెట్టుబడిని గూగుల్ పెడుతుంది.

అసలేమిటీ డేటా సెంటర్...

డేటా సెంటర్ అంటే కేవలం సర్వర్ల భవనం మాత్రమే కాదు, అదో సాంకేతిక నగరం (Tech City). సర్వర్లతో పాటు విద్యుత్‌, నీరు, కూలింగ్‌, సెక్యూరిటీ, AI–ఎనర్జీ–క్లౌడ్‌ వంటి వ్యవస్థలు కలసి పనిచేసే సాంకేతిక నగరమే డేటా సెంటర్.

విశాఖ డేటా సెంటర్ లో AI ఇన్‌ఫ్రా, భారీ కంప్యూటర్లు, సబ్‌సీ కేబుల్స్‌ వంటివి ఉంటాయి.

హై-పర్ఫార్మెన్స్ కంప్యూటింగ్‌, Low- Latency Services (అంటే మనం అడిగిన వెంటనే ఎటువంటి జాప్యం లేకుండా సమాచారం ఇవ్వడం), అంతర్జాతీయ సబ్‌సీ గేట్‌వే- విశాఖపట్నం డేటా సెంటర్ ప్రత్యేకత.

ఈ సెంటర్ నిర్వహణలో AdaniConneX, Airtel వంటి ఇన్‌ఫ్రా సంస్థలు భాగస్వామ్యపక్షాలుగా ఉంటాయి. బెంగళూరు–హైదరాబాద్–పుణే R&D కేంద్రాల అభివృద్ధికి ఈ హబ్‌ ఉపయోగపడుతుంది.

ఎందుకు విశాఖపట్నం కీలకం?

తూర్పు తీరంలో ప్రత్యామ్నాయ సబ్‌సీ ల్యాండింగ్‌ పాయింట్‌ విశాఖపట్నం. ముంబై–చెన్నైకి రూట్-డైవర్సిటీకి, లేటెన్సీ తగ్గింపుకి కీలక ప్రాంతం. డీప్-వాటర్ పోర్ట్, బలమైన ట్రాన్స్‌మిషన్‌ నెట్‌వర్క్‌, రీజనల్ ఫైబర్ హబ్‌గా ఎదగగల సామర్థ్యం ఉన్న కేంద్రం విశాఖ. తుఫానులు, వాతావరణ రిస్క్ ఉన్నా, మల్టీ-సైట్ రిడండెన్సీ, అధునాతన డిజైన్‌తో నిర్వహణ సాధ్యం అవుతుందని విశాఖను ఎంచుకున్నట్టు తెలుస్తోంది. ఆంధ్ర–తెలంగాణ–ఒడిశా–తమిళనాడు నుంచి ఇంజనీరింగ్ టాలెంట్‌కు అనుసంధానమైన తూర్పు రీజన్‌ కూడా.

అమరావతి నత్తనడక—విశాఖకు బూస్ట్‌ ఇచ్చిందా?

అమరావతి రాష్ట్ర రాజధాని ప్రాజెక్ట్‌ నత్తనడకన సాగుతోంది. పరిపాలనా ఫోకస్ పూర్తిగా రాజధానిపై కేంద్రీకృతం కాలేదు. ఇదే సమయంలో విశాఖ “బిజినెస్-ఫస్ట్ కారిడార్”గా అభివృద్ధి చెందుతోంది. పాలసీ నిర్ధారణలు, ఇండస్ట్రీ టచ్‌పాయింట్లు, పోర్ట్–పవర్–ఫైబర్ వంటివి అదనంగా కలిసివస్తున్న అంశాలు. ఇలా అనేక సానుకూలతలు డిజిటల్–మెగా-ప్రాజెక్ట్‌కు గమ్యస్థానమైంది.

రాజకీయంగా కూడా విశాఖపట్నంపై అటు అధికార టీడీపీ కూటమి ఇటు ప్రతిపక్ష వైసీపీ సానుకూలత ఉంది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తన 3 రాజధానుల ప్రతిపాదనల్లో ఏకంగా విశాఖను అడ్మినిస్ట్రేటివ్ రాజధానిగా కూడా ప్రకటించారు. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం విశాఖను రాజధాని నగరంగా ప్రటించకపోయినా అంతకుమించిన ప్రాధాన్యత ఇస్తోంది. ఇప్పటికే సాఫ్ట్ వేర్ రంగానికి విశాఖను కేంద్రంగా మారుస్తోంది. పలు అంతర్జాతీయ సంస్థలకు శంకుస్థాపనలు చేసింది. జగన్మోహన్ రెడ్డి విశాఖ ను రాజధానిగా డెవలప్ చేయాలనుకుంటే చంద్రబాబు పారిశ్రామిక హబ్ గా డెవలప్ చేస్తున్నారు. రాజధాని అమరావతి నిర్మాణ ఆలస్యం విశాఖ డిజిటల్ క్యాపిటల్ గా మారడానికి పనికి వచ్చింది.

గత ప్రభుత్వ హయాంలో పరిపాలనా ప్రాధాన్యతలు వేరే దిశలో కేంద్రీకృతం కాగా ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం ప్రైవేట్ మెగా-టెక్ పెట్టుబడులను ఆకర్షించడంలో ముందంజలో ఉంది.

ఈ ఇద్దరి నాయకుల మధ్య ఉన్న ఏకైక సారూప్యత- విశాఖపట్న అభివృద్ధి- కావడంతో మెగా ప్రాజెక్టులు ముందుకు వస్తున్నాయని పరిశీలకులు భావిస్తున్నారు.

భారత్ AI మిషన్ లో AP పాత్ర...

కేంద్రం తలపెట్టిన భారత్ ఏఐ మిషన్ లో చంద్రబాబు ప్రభుత్వం కీలకంగా మారింది. AI మిషన్, డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రా, సబ్‌సీ కేబుల్ పాలసీ, క్లియరెన్సులు, భూమి కేటాయింపులు, గ్రీన్ ఎనర్జీ టై-ఇన్స్, ఇండస్ట్రియల్ టారిఫ్‌లు, ప్లగ్-అండ్-ప్లే ఇన్‌ఫ్రా వంటి మౌలిక సదుపాయాలు కల్పించేందకు ఏపీ ప్రభుత్వం ముందుకు రావడంతో $15 బిలియన్ డాలర్లు అంటే భారతీయ కరెన్సీలో (సుమారు 1.33 లక్షల కోట్లు) ప్రాజెక్ట్ కుదిరింది.

ఇది 5 ఏళ్లలో పూర్తి అయ్యే ప్రాజెక్టు. గూగుల్ ఈ 5 ఏళ్లలో ఈ పెట్టుబడులు పెడుతుంది. వన్ గిగావాట్ డేటా సెంటర్‌కు బేస్-లోడ్ క్లీన్ ఎనర్జీ మిక్స్ అవసరం. కొత్త ట్రాన్స్‌మిషన్ లైన్లు, స్టోరేజ్, దీర్ఘకాల PPAs కీలకం. ఎనర్జీ ఎఫిషియెంట్ డిజైన్స్ ఉన్నప్పటికీ, హీట్‌వేవ్/ఆర్ద్రతకు ఇంజినీరింగ్ సొల్యూషన్లు అవసరం. భారీ కంప్యూటర్లను నిరంతరం చల్లబరిచేందుకు చాలా ఎక్కువ విద్యుత్ అవసరం అవుతుంది. ఇంత విద్యుత్ మనకు ఉంటుందా ఉండదా అనేది కీలకం అవుతుంది. సబ్‌సీ కేబుల్స్, పోర్ట్ వర్క్స్, పర్యావరణ క్లియరెన్సులు వంటివి ఇంటర్-ఏజెన్సీ కోఆర్డినేషన్‌పై ఆధారపడి ఉంటాయి.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుమారు 480 ఎకరాల భూమిని గూగుల్ కి ఇవ్వనుంది. ట్రాన్స్‌ఫార్మర్లు, కూలింగ్ చిల్లర్స్, హై-డెన్సిటీ సర్వర్ ర్యాక్స్ వంటివి నిర్మించాలంటే ముందస్తుగా భూమిని గూగుల్ కి ఇవ్వాల్సి ఉంటుంది.

ఈ ప్రాజెక్ట్ పూర్తి అయితే 2028–32 కాలంలో ఏపీ GSDPకి ఏటా ₹10,518 కోట్ల వరకు కాంట్రిబ్యూషన్ వస్తుందని అంచనా.

ఇక ఉద్యోగాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం 1 లక్ష 88 వేల 220 ఉద్యోగాలు వస్తాయని చెబుతున్నా అంత ఉంటుందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

ఇప్పుడున్న తాత్కాలిక అంచనా ప్రకారం..

డేటా సెంటర్ నిర్మాణ దశలో 8,000–10,000 మందికి తాత్కాలిక ఉపాధి, ఆపరేషన్ దశలో 1,500–2,000 శాశ్వత/లాంగ్-టెర్మ్ టెక్నికల్ ఉద్యోగాలు వస్తాయని అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకు ఉన్న గూగుల్ డేటా సెంటర్లలో ఎక్కడా 4 వేల మందికి మించి లేరని తెలుస్తోంది. అయితే పరోక్ష ఉపాధి ఎక్కువగా ఉంటుందని భావిస్తున్నారు. విశాఖపట్నం గూగుల్ సెంటర్ వస్తే 15,000–20,000 మందికి పరోక్ష ఉపాధి దొరకవచ్చు. స్టార్టప్స్ & MSMEs రావొచ్చు. లోకల్ క్లౌడ్–AI అడాప్షన్ వేగవంతం అవుతుంది.

సర్వీస్-పార్ట్నర్స్, హార్డ్వేర్–మెయింటెనెన్స్, ఫుడ్–లాజిస్టిక్స్ వంటివి అంచలంచెలుగా వచ్చే అవకాశం ఉంటుంది.


గూగుల్ కి ఇస్తున్న రాయితీలలో SGST రీయింబర్స్‌మెంట్ (క్యాపిటల్ గూడ్స్) లేదా 10% క్యాపిటల్ సబ్సిడీ ఉంది. వంద శాత స్టాంప్ డ్యూటీ మినహాయింపు (ఫస్ట్ సేల్) ఉంది. బిల్డింగ్ నిర్మాణ నిబంధనల్లో మినహాయింపులు ఉన్నాయి. మెగా ప్రాజెక్ట్ అయినందున ల్యాండ్ కాస్ట్ డిస్కౌంట్ నుండి డ్యూయల్-గ్రిడ్ వరకు అనేక రాయితీలు లభిస్తాయి. ప్రత్యేక విద్యుత్‌ రాయితీ వంటివి ఎంతకాలం అనేది ఫైనల్ అగ్రిమెంటులో మాత్రమే బయటపడే అవకాశం ఉంది. ఏవైతేనేం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే రాయితీల విలువ సుమారు 24 వేల కోట్లకు పైబడి ఉండే అవకాశం ఉన్నట్టు అనధికార వర్గాల అంచనా. విశాఖను తూర్పు తీర డిజిటల్ గేట్‌వేగా, ఆంధ్రప్రదేశ్‌ను AI లో నోడల్ స్టేట్‌గా ఆవిర్భవించేందుకు లభించిన అవకాశంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు చెబుతున్నారు.

Tags:    

Similar News