ఆంధ్ర భద్రాద్రిలో… " హరిధ్రా ఘటనం"

ఆంధ్ర భద్రాద్రి ఒంటిమిట్ట కోదండ రామాలయం. శ్రీరామనవమి కళ్యాణోత్సవానికి " హరిధ్రా ఘటనం"తో టీటీడీ నాంది పలికింది.

Update: 2024-04-13 12:12 GMT
ఒంటిమిట్ట రామాలయం

(ఎస్.ఎస్.వి. భాస్కర్. రావ్)

తిరుపతి: ఆంధ్ర భద్రాద్రి ఒంటిమిట్టలోని ఏకశిలా నగరంలో శ్రీరామనవమి ఉత్సవాలకు నాంది పలికారు. టీటీడీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. పట్టాభి రాముల వారి కళ్యాణోత్సవ మహోత్సవాలు శనివారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ ఆలయంలో టిటిడి మొదటిసారి " హరిద్రా ఘటనం" ప్రవేశపెట్టింది.

 

చరిత్రలో కాస్త వెనక్కి వెళితే..

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో భద్రాచలం రామాలయంలో శ్రీరామనవమి ఉత్సవాలు వైభవంగా జరిగేవి. శ్రీరాముల వారి పట్టాభిషేకం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించడం, ముత్యాలు అందించడం ఆనవాయితీగా పాటించేవారు. రాష్ట్ర విభజన తరువాత ఏర్పడిన పరిణామాల నేపథ్యంలో.. నవ్యాంధ్ర ప్రభుత్వం నుంచి పట్టు వస్త్రాలు అందించే అవకాశం సీఎంలకు లేకుండా పోయింది. దీనిపై సమాలోచనలు సాగించారు. ఆంధ్రలో చిత్తూరు జిల్లా వాల్మీకిపురంలోని పట్టాభి రాముల వారి ఆలయాన్ని రెండో భద్రాద్రిగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ప్రదర్శనలు కూడా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని విషయాలు సమీక్షించిన తర్వాత తీసుకున్న నిర్ణయంతో.. కడప జిల్లా ఒంటిమిట్ట వద్ద ఉన్న శ్రీ కోదండరామస్వామి దేవాలయాన్ని రెండో భద్రాద్రిగా ప్రకటించారు.

చారిత్రక నేపథ్యం

కడప నగరానికి 25 కిలోమీటర్ల దూరంలో చెన్నై జాతీయ రహదారికి పక్కనే ఉన్న ఒంటిమిట్ట కోదండ రామస్వామి వారి ఆలయాన్ని 16వ శతాబ్దంలో చోళ, విజయనగర రాజుల కాలంలో నిర్మించారు. ఒంటిమిట్టలో నివసించిన బమ్మెర పోతన మహా భాగవతాన్ని తెలుగు భాషలో రచించి రాములవారికి అంకితం ఇచ్చారు. "ఆంధ్ర వాల్మీకి అని పిలవబడే వావిలికొలను సుబ్బారావు ఈ రాముడిని పూజిస్తూ కాలం సాగించారు. ఆయన వాల్మీకి రామాయణాన్ని (రాముని కథను వివరించే హిందూ ఇతిహాసం) తెలుగులోకి అనువదించారు. అందుకే ఆయనను ఆంధ్ర వాల్మీకి అని పిలుస్తారు. 1652లో ఈ ఆలయాన్ని సందర్శించిన ఫ్రెంచ్ యాత్రికుడు జీన్- బాప్టిస్ట్ టావెర్నియర్ ఆలయ నిర్మాణ శైలిని చూసి ఆశ్చర్యపోవడమే కాకుండా మెచ్చుకున్నారు అనేది చారిత్రక కథనం. అద్భుతమైన శిలా సంపదకు నిలవైన ఒంటిమిట్ట రామాలయం అనేక ప్రత్యేకతలు కలిగి ఉంది. రామలక్ష్మణుల శిల్పాలు స్తంభాలపై ప్రత్యేకత సంతరించుకున్నాయి. ఆలయానికి ప్రతి మూల ఉన్న స్తంభాలపై అప్సరసలు, దేవతల చిత్రాలతో చెక్కబడిన మూడు పురాణం కలిగి ఉంటాయి.

 

ఇది ఏకశిలా నగరం..

ఒంటిమిట్ట ప్రాంతాన్ని ఏకశిలా నగరంగా కూడా చరిత్రలో నిలిచింది.. ఇక్కడ నిర్మించిన శ్రీ కోదండరా స్వామి ఆలయం ఒక కారణమైతే.. ఆ ఆలయంలో కొలువైన సీత, రామలక్ష్మణులు ఒకే శిలపై కొలువై ఉంటారు. అదే ఈ ఆలయం ప్రత్యేకత. ఆలయ నిర్మాణం మొత్తం శాస్త్రబద్ధంగా జరిగింది. శిల్పకళానైపుణ్యం ఉట్టిపడే ఈ ఆలయంలో మరో ప్రత్యేక దృశ్యం కనిపిస్తుంది. ఆలయంలోకి వెళ్లడానికి గాలిగోపురంలోకి ప్రవేశించిన తర్వాత ఎడమవైపు గోడకు ఆవు ఏనుగు కలిసి ఉన్న ఒక చిన్నపాటి శిల్పం ఉంటుంది. అరచేతితో ఒక దృశ్యాన్ని మూసివేసి చూస్తే కనిపించే దృశ్యం అపురూపంగా ఉంటుంది. వీటన్నిటిని నేపథ్యంలో...

ఏకశిలా నగరమే ఆంధ్ర భద్రాద్రి...

ఒంటిమిట్ట కోదండ రామస్వామి ఆలయంలోని ప్రత్యేకతలను అన్ని పరిశీలించిన మీదట ఈ ఏకశిలా నగరాన్ని రాష్ట్ర ప్రభుత్వం 2015 లో ఒంటిమిట్ట ఏకశిలా నగరాన్ని ఆంధ్ర భద్రాద్రిగా ప్రకటించింది. ఈ ఆలయం కేంద్ర పురావస్తు శాఖ పర్యవేక్షణలో ఉంది. అప్పటి ఏపీ సీఎం ఎన్ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో.. పూజాదికాలు శాస్త్రోక్తంగా నిర్వహించడానికి వీలుగా ఒంటిమిట్ట కోదండ రామాలయం టీటీడీ ఆధీనంలోకి తీసుకుంది. ఇందుకోసం ప్రతి ఒక్క ఆలయ వ్యవస్థను సిద్ధం చేయడంతో పాటు తిరుమల తరహాలోనే ఇక్కడ అన్ని రకాల పూజాదికాలు ఆగమ శాస్త్రానికి అనుగుణంగా నిర్వహించడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసింది. తిరుమల తరహాలో ఒంటిమిట్ట కోదండ రామ స్వామి ఆలయం వద్ద కూడా అన్నదాన పథకాన్ని విస్తరించింది. హైదరాబాద్ చెన్నై జాతీయ రహదారి పక్కనే ఉన్న ఈ ఆలయానికి యాత్రికుల తాకిడి కూడా ఎక్కువైంది. తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చే యాత్రికులు మార్గమధ్యంలోని కోదన రామస్వామి ఆలయాన్ని సందర్శిస్తుంటారు. దీంతో అక్కడ సామాన్య భక్తులకు కూడా అవసరమైన ఏర్పాట్లను టిటిడి కల్పించింది. ఈ నేపథ్యంలో...

 

శ్రీరామనవమికి ఏర్పాట్లు..

ఇంతటి చారిత్రక నేపథ్యం కలిగిన కోదండరామస్వామి ఆలయానికి ఆంధ్ర భద్రాద్రి గా మార్చింది. ఈనెల 28 వ తేదీన నిర్వహించే శ్రీరామ నవమి ఉత్సవాలకు ఏర్పాట్లు జోరందుకున్నాయి. టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి ఉన్నత స్థాయి అధికారులు సిబ్బందితో వెళ్లి ఒంటిమిట్టలో అన్ని విభాగాల శాఖల అధికారులను సమన్వయం చేస్తూ, సమీక్ష కూడా నిర్వహించారు. ఈ ఆలయంలో నిర్వహించే క్రతువుల్లో ఒకటి కొత్తగా ప్రవేశపెట్టారు..

" హరిద్రా ఘటనం" అంటే ఏమిటి..

దాదాపు తొమ్మిదేళ్ల కిందట ఒంటిమిట్ట కోదండ రామస్వామి ఆలయం టిటిడి పరిధిలోకి చేరింది. కోదండ రామస్వామి వారి కళ్యాణ్ ఉత్సవానికి టీటీడీ ఈ ఏడాది ఓ కొత్త కార్యక్రమానికి నాంది పలికింది. కళ్యాణోత్సవం నిర్వహించడానికి ముందు హరిద్రా ఘటనతో శనివారం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. హరిద్రా ఘటనం అంటే... హరిద్ర అంటే పసుపు. ఘటనం అంటే నూర్పిడి. ఈ కార్యక్రమంలో మూడు కిలోల పసుపు వేర్లు దంచడం. శనివారం ఉదయం మహిళా భక్తులు సుమారు మూడు కిలోల పసుపును పోసి జై శ్రీరామ్ నినాదాలు చేస్తూ సాంప్రదాయబద్దంగా రోలులో దంచారు.

 

అంతకుముందు గర్భాలయం లోపల పసుపు కొమ్ములు, రోకళ్ళు స్వామి పాదాల చెంత ఉంచి శాస్త్రబద్ధంగా అర్చక స్వాములు పూజ చేశారు. ఆ తర్వాత పసుపు దంచే కార్యక్రమానికి నాంది పలికారు. ఈ పసుపును శ్రీ సీతా రామ కళ్యాణం సందర్భంగా తలంబ్రాలలో వినియోగిస్తారు. భద్రాచలంలోని రామాలయంలో వినియోగించే అక్షింతల కోసం రాజమండ్రి సమీపంలోని భక్తులు ప్రత్యేకంగా వరి ధాన్యం పండించి చేతితో మాత్రమే పొట్టు కొలవడం అనేది ప్రత్యేకత. ఆ తరహాలోనే ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయంలో వినియోగించే తలంపాల కోసం పసుపు దంచే కార్యక్రమానికి హరిద్రా ఘటనంగా పేరు పెట్టింది.

ఈ కార్యక్రమాన్ని నిర్వహించడంపై ఒంటిమిట్ట కోదండ రామస్వామి ఆలయం అర్చకులు శరవణ స్వామి ఏమంటున్నారంటే.. " భగవత్ విజ్ఞాపనతో హరిద్రా ఘటనం కార్యక్రమం ప్రారంభం అయింది’’ అని తెలిపారు. తద్వారా శ్రీ సీతా రామ కల్యాణ మహోత్సవ ఏర్పాట్లకు నాంది పలికినట్లు అయిందన్నారు. ఈ కార్యక్రమం ప్రాధాన్యత వివరిస్తూ.. "ఇవాళ పసుపు దంచే కార్యక్రమంలో వచ్చిన పసుపును ఉత్సవరులకు కళ్యాణం నాడు నిర్వహించే స్నపనం, తలంబ్రాలు తయారీకి ఉపయోగిస్తారన్నారు.

ప్రధాన అర్చక స్వాములు శ్రాఘవాచార్యులు, ఒంటిమిట్ట ప్రత్యేక అధికారి ప్రశాంతి పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమం ఆద్యంతం భక్తిని రగిలించింది. అన్నమాచార్య కళాకారుల బృందం సందర్భానుసారంగా రామ భజనలను కీర్తించారు. ఆ ఆధ్యాత్మిక వాతావరణం భక్తుల భక్తుల రంజింప చేసింది... "జై శ్రీ రామ్... జై శ్రీ రామ్ అంటూ నినదిస్తూ ఈ సాంప్రదాయ పసుపు దంచే కార్యక్రమంలో మహిళా భక్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

Tags:    

Similar News