బ్లాక్ మెయిల్ చేసి కోట్లు గుంజుకున్నాడు
ఖరీదైన అపార్టుమెంటు, కారు, బైక్, భారీగా బంగారం కొనుగోలు చేశాడు.;
By : The Federal
Update: 2025-02-05 07:13 GMT
ఈజీ మనీ కోసం అర్రులు చాస్తున్నారు. లగ్జరీ లైఫ్‌లకు అలవాటు పడుతున్నారు. దీని కోసం బ్లాక్‌మెయిల్ విధానం ఎంచుకుంటున్నారు. అశ్లీల వీడియాలు, ఫొటోలు ఉన్నాయంటూ యువతులపై బెదిరింపులకు దిగుతున్నారు. యువతులను భయబ్రాంతులకు గురిచేసి కోట్లు గుంజేసుకుంటున్నారు. అలా సంపాదించిన అక్రమ సంపాదనతో ఖరీదైన అపార్టుమెంట్లు, కార్లు, బైక్‌లు కొనుగోలు చేసి లగ్జరీ లైఫ్‌లు లీడ్ చేస్తున్నారు. చివరికి కటకటాల పాలై జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఇలాంటి ఘటనే నిడదవోలులో ఇటీవల చోటు చేసుకుంది. అశ్లీల వీడియోలు, ఫొటోలు ఉన్నాయని, డబ్బులు ఇవ్వక పోతే ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేస్తానని బెదిరించి రెండు కోట్లకుపైగా గుంజుకున్నాడు. అపార్టుమెంటు, కారు, బైక్‌లను కొనుగోలు చేశారు. బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో అసలు కథ వెలుగులోకొచ్చింది.
నిడదవోలుకు చెందిన ఓ యువతి హైదరాబాద్‌లోని ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీ విప్రోలు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా జాబ్ చేస్తోంది. కూకట్‌పల్లిలోని గాయత్రీ ఉమెన్స్ హాస్టల్‌లో ఉంటూ జాబ్ చేస్తోంది. గుంటూరు జిల్లా ఓబులనాయుడుపాలెంకు చెందిన నీనావత్ దేవానాయక్ అలియాస్ మధుని పెళ్లి చేసుకున్న అనూషాదేవి కూడా అదే హాస్టల్‌ల్లో ఉంటోంది. ఇద్దరు ఒకే హాస్టల్‌లో ఉండటం వల్ల, ఇద్దరూ ఆంధ్ర ప్రాంతానికి చెందిన వారు కావడం వల్ల ఏర్పడిన పరిచయం ఇద్దరి మధ్య స్నేహానికి దారితీసింది. దీంతో అత్యంత సన్నిహింతంగా ఉండేవారు. అనూషాదేవికి ఆ యువతి తన కష్టాలు, బాధలు షేర్ చేసుకునేది. ఈ పరిస్థితుల్లో అనూషాదేవి తన భర్తను ఆ యువతికి పరిచయం చేసింది.
ఆ యువతి పరిచయాన్ని ఆసరాగా తీసుకొని బ్లాక్ మెయిల్ చేసి, డబ్బులు గుంజాలనుకున్నాడు. అందుకు తగ్గట్టుగా ప్లాన్ చేశాడు. ఆ యువతికి ఫోన్ చేసి వేరే వ్యక్తిలా దేవనాయక్ మాట్లాడటం మొదలెట్టాడు. న్యూడ్ వీడియోలు, ఫొటోలు ఉన్నాయని, వీటిని ఇంటర్నెట్‌లో అప్‌లోడ్ చేస్తానని బెదింపులకు పాల్పడేవాడు. అలా చేయకుండా ఉండాలంటే తనకు డబ్బులు ఇవ్వాలని బ్లాక్ మెయిల్ చేయడం చేసే వాడు. దీంతో భయపడిన ఆ యువతి డబ్బులు ఇచ్చేందుకు అంగీకరించింది. గూగుల్‌పే, ఫోన్‌పేల ద్వారా డబ్బులు వేయించుకునేవాడు. అలా విడతల వారీగా లక్షల రూపాయలను తన ఖాతాలో జమ చేయించుకునేవాడు.
అయితే ఓ సారి ధైర్యం చేసి ఈ విషయాన్ని అనూషాదేవికి ఆ యువతి చెప్పగా.. అనూషాదేవి తన భర్త దేవానాయక్ వద్దకు తీసుకెళ్లింది. ఎవరో తనను బ్లాక్‌మెయిల్ చేస్తున్నారని ఆ యువతి వాపోయింది. కొద్ది రోజుల తర్వాత తానే ఆ విషయాన్ని సెటిల్‌మెంట్ చేసినట్లు దేవానాయక్ ఆ యువతిని నమ్మించాడు. కొన్ని రోజుల తర్వాత మళ్లీ బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడ్డాడు. అప్పటికే పెద్ద మొత్తంలో మోసపోయిన ఆ యువతిని మరో రూ. 14 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు.
ఈ నేపథ్యంలో తన స్నేహితురాలు అనూషాదేవి, ఆమె భర్త దేవానాయక్‌ల మీద ఆ యువతికి అనుమానాలు వచ్చాయి. వీళ్లే తనను మోసం చేస్తున్నారని గుర్తించింది. హైదరాబాద్ నుంచి నిడదవోలుకు చేరుకుంది. తన తల్లిదండ్రులతో కలిసి నిడదవోలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకుని, రంగంలోకి దిగిన పోలీసులు అసలు గుట్టు రట్టు చేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. గుంజుకున్న డబ్బును పోలీసులు కక్కించారు. అతడి నుంచి రూ. 1,81,45000వేల విలువైన 938 గ్రామలు బంగారు, వెండి ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రూ. 75లక్షల నగదు, కారు, బుల్లెట్ స్వాధీనం చేసుకున్న పోలీసులు.. చిన్నకాకినిలో కొనుగోలు చేసిన అపార్ట్‌మెంట్‌ను స్థానిక రెవిన్యూ అధికారుల ద్వారా స్వాధీనం చేసుకున్నారు.
అనూషాదేవీ భర్త దేవానాయక్ ఆ యువతిని రూ. 2021 నుంచి 2025 వరకు బ్లాక్ మెయిలింగ్‌లు చేస్తూ వస్తున్నాడు. బాధితురాలి నుంచి రూ. 2,53,76000 దుండగుడు గుంజుకున్నాడు. ఆ యువతి నుంచి గుంజుకున్న డబ్బుతో చిన్నకాకానిలో ఓ అపార్ట్‌మెంట్‌ను కొనుగోలు చేశాడు. కారు, బుల్లెట్‌తో పాటు భారీ ఎత్తున బంగారు, వెండి ఆభరణాలను కొనుగోలు చేశాడు.