జాతీయ రహదారులపై ప్రమాదాల నివారణకు హైపవర్ కమిటీ
ఎస్ఓపీతో బస్సుల వేగానికి కళ్లెం వేస్తామంటున్న హోంమంత్రి
Byline : SSV Bhaskar Rao
Update: 2025-10-25 03:47 GMT
రోడ్డు ప్రమాదాల నివారణకుమూడు శాఖల సమన్వయంతో హైపవర్ కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత ప్రకటించారు. జాతీయ రహదారులపై ప్రయివేటు బస్సులకు కళ్లెం వేయడానికి ఎస్ఓపీ కూడా తయారు చేయనున్నట్లు ఆమె వెల్లడించారు. కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద కావేరీ ట్రావెల్స్ ప్రైవేటు బస్సు దగ్ధమైన ఘటనను శుక్రవారం మధ్యాహ్నం పరిశీలించారు. ఘటన జరిగిన తీరు, సహాయ చర్యలపై ఆమె అధికారులతో వాకబు చేశారు.
కర్నూలు పోలీసు కార్యాలయంలో డీజీపీ హరిష్ కుమార్ గుప్తా, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాదరెడ్డితో కలిసి హోంమంత్రి వంగలపూడి అనిత మీడియాతో మాట్లాడారు.
"కర్నూలు తరహా దుర్ఘటన భవిష్యత్తులో జరగకుండా సీఎం నారా చంద్రబాబుతో మాట్లాడి రవాణా, పోలీస్, రెవెన్యూ శాఖలతో కలిపి హైపవర్ కమిటీ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటాం" అని స్పష్టం చేశారు. హోంత్రి వంగలపూడి అనిత ఇంకా ఏమి చెప్పారంటే..
"జాతీయ రహదారుల్లో బస్సులు ఎంత వేగంతో ప్రయాణించాలి. ఎక్కడ నిలపాలి. అనే అంశాలపై ఎస్ఓపీ (Standard Operating Procedure SOP) కూడా తయారు చేస్తాం" అని హోంత్రి అనిత ప్రకటించారు. ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా వేగం నియంత్రించే విధానం రూపొందించి పకడ్బందీగా అమలు చేస్తామని ఆమె స్పష్టం చేశారు.
బస్సు ప్రమాదంపై హోంమంత్రి అనిత మాట్లాడుతూ,
"ప్రైవేట్ ట్రావెల్స్ కు చెందిన వేమూరి కావేరి ట్రావెల్స్ బస్ నెంబర్ DD 01N 9490 హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న సమయంలో తెల్లవారుజామున 3 గంటల నుండి 3.15 సమయంలో ప్రమాదానికి గురి అవడం బాధాకరమైన విషయం. ప్రాథమిక సమాచారం మేరకు ఎదురుగా వస్తున్న బైక్ ను ఢీకొని, 15 నుంచి 20 మీటర్ల దూరం వరకు లాక్కుని వెళ్లడం వల్ల వచ్చిన స్పార్క్ వల్ల మంటలు చెలరేగి 19 మంది చనిపోయారు" అని హోంమంత్రి అనిత చెప్పారు. కర్నూలు వద్ద జరిగిన ప్రమాదంలో 17 మంది పెద్దలు, ఇద్దరు ల్లలు ఉన్నారని వెల్లడించారు. తెల్లవారుజామున 3 గంటల నుంచి 3.15 గంటల మధ్యలో జరిగిన తర్వాత 3.21 గంటలకు స్థానిక సిఐకు సమాచారం వచ్చిన వెంటనే పోలీస్, అగ్నిమాపక శాఖ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ మొదలుపెట్టారన్నారు.
ఈ బస్సులో 39 మంది పెద్దవాళ్లు, 4 చిన్నపిల్లలు, ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ఉన్నారన్నారు. ఈ గుర్తు తెలియని వ్యక్తులు ఆరంగర్ చౌరస్తా దగ్గర ఎక్కారని వారిలో ఒక్కరు దిగిపోయారని హోంమంత్రి అనిత ధృవీకరించారు. 23 మంది పెద్దలు, ఇద్దరు పిల్లలు, 2 డ్రైవర్లు ప్రమాదం నుంచి సురక్షితంగాబయపడ్డారని ప్రకటించారు.
"తెలంగాణకు చెందిన ఆరుగురు, ఒకరు ఒడిస్సా, ఒకరు బీహార్, ఇద్దరు తమిళనాడు, ఇద్దరు కర్ణాటక రాష్ట్రాల నుంచి, ఒకరి మృత దేహం ఇంకా గుర్తించలేదు" అని హోంమంత్రి వెల్లడించారు. మృతదేహాలను గుర్తించేందుకు ఫోరెన్సిక్ నిపుణులతో 16 టీంలు ఏర్పాటు చేశామన్నారు. డిఎన్ఏ పరీక్షల కోసం 10 బృందాలు నాలుగు టీం లు ఫిజికల్, బ్లాస్ట్ అనాలసిస్ చేస్తాయన్నారు. ప్రమాదానికి కారణమైన వారి మీద చర్యలు తీసుకుంటామని, కేసులు నమోదు చేశామని హోంమంత్రి అనిత చెప్పారు.
కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద బస్సు దగ్ధమైన ప్రదేశానికి సమీపంలో బాధిత కుటుంబాలను హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత పరామర్శించారు. ప్రమాదం నుంచి బయటపడిన వారి నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఇది మూడో సంఘటన
కర్నూలు వద్ద జరిగిన ప్రమాద ఘటనపై రవాణా శాఖా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
"జాతీయ రహదారిపై జరిగిన తీవ్రమైన ప్రమాదాల్లో ఇది మూడవది" అని రవాణా శాఖ మంత్రి మండిపల్లి స్పష్టం చేశారు.
కొత్తగా వచ్చిన బస్సులకు ఆటోమేటిక్ ఫైర్ అలారం సిస్టం ఏర్పాటు చేస్తున్నాం. ప్రమాదానికి గురైన బస్సు ఏడు సంవత్సరాల నాటిది" అని వివరించారు. ఈ అంశం పై తెలంగాణ, కర్ణాటక రవాణా శాఖ మంత్రులతో చర్చించి, నూతన విధివిధానాలు అమలు చేస్తామని రవాణా శాఖ మంత్రి మండిపల్లి తెలిపారు.
బాధిత కుటుంబాలకు పరిహారం
కర్నూలు వద్ద జరిగిన బస్సు దర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన ఆరుగురు ప్రయాణికులకు రాష్ట్ర ప్రభుత్వం ఒకో కుటుంబానికి ఐదు లక్షల రూపాయలు ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. క్షతగాత్రులకు రెండు లక్షలు చెల్లించడానికి సీఎం నారా చంద్రబాబు ప్రకటించారని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాదరెడ్డి చెప్పారు. అంతకుముందు కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో చికిత్స తీసుకుంటున్న బాధితులను మంత్రులు పరామర్శించారు.