స్వచ్ఛాంద్ర ఎలా సాధ్యం ...

స్వచ్ఛంధ్ర సాధన సాధ్యం కావాలంటే ప్రజల్లో చెత్త నిర్వహణపై మార్పు రావాలి. అందుకు ప్రభుత్వం కొన్న సందర్భాల్లో కఠినంగా వ్యవహరించాలి.;

Update: 2025-03-18 12:50 GMT

ఆంధ్రప్రదేశ్ ను స్వచ్ఛాంధ్రగా మార్చేందుకు జిల్లాల మధ్య పోటీని ప్రభుత్వం పెంచుతోంది. ఇందుకు ర్యాంకులు ఇస్తోంది. మునిసిపాలిటీలకు కూడా పాయింట్లు ఇచ్చి పోటీ పెంచుతోంది. దీంతో పాటు ప్రజల ఆలోచనల్లో స్వచ్ఛత వైపు మార్పు తీసుకొచ్చే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాలని పౌర సమాజం కోరుకుంటోంది.

ఇండికేటర్స్ ఆధారంగా జిల్లాలకు ర్యాంకులు

స్వచ్చాంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్రతి విభాగానికి పెర్మామెన్స్ ఇండికేటర్ ర్యాంకింగ్స్ తయారుచేశారు. మున్సిపల్ శాఖకు 20 పాయింట్లు , పంచాయతీ రాజ్ కు 28 పాయింట్లు, ఎడ్యుకేషన్ కు 14 పాయింట్లు, టూరిజంకు 11 పాయింట్లు, ఇండస్ట్రీస్కు 13 పాయింట్లు, హాస్టల్స్ కు 11 పాయింట్లు , ఎండోమెంట్ కు 11 పాయింట్లు , ఆస్పత్రులకు 9 పాయింట్లు, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ కు 5 పాయింట్లు, బస్టాండ్లు, ర్వైల్వే స్టేషన్లకు 7 పాయింట్లు, మార్కెట్స్ కు 9 పాయింట్లు, హైవేస్ కు 3 పాయింట్లు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు 7 పాయింట్లు చొప్పున ఇచ్చారు.

మున్సిపల్ అడ్మినిష్ట్రేషన్ లో జిల్లాల ప్రోగ్రెస్

ఎన్టీఆర్ జిల్లా 134 పాయింట్లు, అనాకపల్లి జిల్లా 131 పాయింట్లు, తిరుపతి 128 పాయింట్లు, విశాఖ 127 పాయింట్లు, అనంతపురం 123 పాయింట్లు, కాకినాడ 121 పాయింట్లు, గుంటూరు 119 పాయింట్లు, ఈస్ట్ గోదావరి 118 పాయింట్లు, పల్నాడు 117 పాయింట్లు, అన్నమయ్య 115 పాయింట్లు, అంబేద్కర్ కోనసీమ 115 పాయింట్లు, శ్రీకాకుళం 113 పాయింట్లు, వైఎస్సాఆర్ 113 పాయింట్లు, బాపట్ల 111 పాయింట్లు, ఏలూరు 108 పాయింట్లు, కర్నూలు 104 పాయింట్లు, నంద్యాల 102 పాయింట్లు, సత్యసాయి 102 పాయింట్లు, పార్వతీపురం 100 పాయింట్లు, పొట్టి శ్రీరాములు 100 పాయింట్లు, విజయనగరం 100 పాయింట్లు, కృష్ణా 99 పాయింట్లు, ప్రకాశం 99 పాయింట్లు, వెస్ట్ గోదావరి 97 పాయింట్లు , చిత్తూరు 91 పాయింట్లు, అల్లూరు సీతారామరాజు 68 పాయింట్లు వచ్చాయి.

ఐవీఆర్ఎస్ ద్వారా అందరి పనితనాన్ని ఎప్పటికప్పుడు ప్రభుత్వం తెలుసుకుంటోంది. జపాన్ వంటి దేశాల్లో రోడ్డుపై చెత్త వేయరు. మనకు కూడా అలాంటి అలవాట్లు రావాలి. మున్సిపల్ శాఖలో వివిధ పనుల నిమిత్తం పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ద్వారా రూ. 150 కోట్లు గ్రాంట్ గా అందబోతున్నాయి.


ఇండికేటర్స్ వల్ల ఉపయోగాలు

స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఇండికేటర్స్ ఆధారంగా జిల్లాలకు ర్యాంకులు ఇవ్వటం వలన కొన్ని ముఖ్యమైన సందేశాలు ప్రజలకు అందుతాయి.

ఈ ర్యాంకుల వలన జిల్లాల మధ్య ఆరోగ్యకరమైన పోటీ తత్వం వస్తుంది. ప్రతి జిల్లా తమ పరిసరాలను మరింత శుభ్రంగా ఉంచుకోవడానికి ప్రయత్నిస్తుంది. స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ప్రజల భాగస్వామ్యం ఎంత ముఖ్యమో ఈ ర్యాంకులు తెలియజేస్తాయి. ప్రజలు తమ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడానికి మరింతగా ప్రోత్సహించబడతారు.

ప్రభుత్వం చేపడుతున్న స్వచ్ఛాంధ్ర కార్యక్రమం పనితీరును ప్రజలకు తెలియజేస్తుంది. ప్రభుత్వం మరింత బాధ్యతాయుతంగా పనిచేయడానికి ఈ ర్యాంకులు దోహదపడతాయి. స్వచ్ఛత ప్రాముఖ్యత గురించి ప్రజలలో అవగాహన పెరుగుతుంది. తద్వారా ప్రజలు తమ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడానికి మరింత శ్రద్ధ వహిస్తారు. మంచి ర్యాంకులు పొందిన జిల్లాలకు ప్రోత్సాహకాలు అందించడం ద్వారా, ఇతర జిల్లాలకు కూడా స్ఫూర్తిని కలిగిస్తుంది.ఈ ర్యాంకులు ప్రజలలో స్వచ్ఛత పట్ల అవగాహన పెంచడానికి, ప్రభుత్వ, ప్రజల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి దోహదపడతాయి.

స్వచ్ఛతపై అవగాహన ఒక్కటే మార్గం

రోడ్లు, పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలంటే ప్రజల్లో పూర్తి స్థాయిలో అవగాహన రావాలి. నిర్లక్యం పోవాలి. మునిసిపాలిటీ వారు ఉన్నారు. వారే ఊడ్చి ఎత్తేస్తారనే భావన పోవాలి. కార్లు, బస్సుల్లో ప్రయాణం చేసే వారు కూడా చెత్తను రోడ్డుపై వేయకుండా చెత్తకుండీలు ఉన్న చోట అందులో పడేయాలి. ప్రజల చెత్త ఎక్కడంటే అక్కడ వేయడం వల్ల దుర్వాసన రావడంతో పాటు పరిసరాలపై ఆ వాసన ప్రభావం చూపే అవకాశం ఉందనే విషయం ప్రజల ఆలోచనల్లోకి వస్తే పరిశుభ్రత వైపు దృష్టి పెడతారు.

రోడ్డుపై వక్ర బుద్ధి స్పష్టంగా కనిపిస్తోంది

వాహనాల్లో రోడ్డుపైకి రాగానే వెనుకనుంచి వస్తున్న వ్యక్తి వాహనానికి పక్కనే ఉన్న వ్యక్తి చక్రం డ్డంగా పెడతాడు. ఎందుకు ఇలా చేశావని ప్రశ్నిస్తే ఖాళీగా ఉంది కదా అని అలా పెట్టానని సమాధానం ఇస్తున్నాడు. వినడానికి చిల్లీగా ఉన్నా చూసే వారికి, వాహనం నడిపే వాడికి విపరీతమైన కోపాన్ని తెప్పిస్తాయి. వాహనం వెళుతున్నప్పుడు పక్క తొక్కులు తొక్కకుండా నేరుగా వెళ్లిపోతే ఇబ్బందులు ఉండవు. అలాగే చెత్త కూడా రోడ్డుపై ఎక్కడంటే అక్కడ పడేస్తే ఫైన్ వేస్తారనే భయం ఉంటేనే స్వచ్ఛతకు బాటలు పడతాయని సైకాలజీ నిపుణుడు డాక్టర్ రవీంద్రబాబు తెలిపారు. దేవాలయానికి వెళితే చెత్త ఎక్కడంటే అక్కడ పడేయడానికి సందేహిస్తాం. ఎందుకంటే దేవుడంటే భక్తి. ఇక్కడ కూడా పరిసరాలు, దేశ భక్తి ఉంటేనే అది సాధ్య మవుతుందంటారు ఆయన.

ఒక చోట బాగు చేసి నాలుగు మొక్కలు నాటి నంత మాత్రాన స్వచ్ఛాంధ్ర లక్యం నెరవేరినట్లు కాదని రిటైర్డ్ ఐపీఎస్ అధికారి కె కోటేశ్వరరావు పేర్కొన్నారు. తాను తెనాలి ప్రాంతంలో స్వచ్ఛత కార్యక్రమాలను ప్రోత్సహించే పనిలో ఉన్నారు. బీసీలకు రాజ్యాధికారం ఎందుకు కావాలనే అంశంపై ఆయన పలు రచనలు చేశారు. పర్యావరణంపైనా ఆయన ఆలోచనలు ఎందరినో ఆకట్టుకుంటున్నాయి.

కొత్త వాహనాలు కొనాలట..

ఉమ్మడి అనంతపురం జిల్లాలో 12 నియోజకవర్గాల్లోనూ (మునిసిపాలిటీలు) ఇటీవల కాలంలో చెత్త పేరుకు పోతున్నట్లు అధాకారులు భావిస్తున్నారు. ఉదాహరణకు అనంతపురంలో రోజూ పోగయ్యే చెత్త 150 మెట్రిక్ టన్నులు ఉన్నట్లు అక్కడి అధికారులు తెలిపారు. 76,948 గృహాలు ఉన్నాయి. ఈ గృహాల నుంచి చెత్తను సేకరించి బయట పడేయాలి. అయితే తగినన్ని వాహనాలు లేవని, అవి సమకూర్చుకోవాలని మునిసిపల్ అధికారులను ఆదేశించినట్లు మునిసిపల్ రీజినల్ డైరెక్టర్ విశ్వనాథ్ చెప్పటం విశేషం.

నగరాల్లో పేరుకు పోతున్న చెత్త..

గత ప్రభుత్వ హయాంలో సేకరించిన సుమారు 80వేల టన్నుల చెత్తను మునిసిపాలిటీలు, పంచాయతీల్లో తీసి ఊరి బయట వేసి చేతులు దులుపుకున్నారని, ఆ చెత్తను అలాగే వదిలేయడం వల్ల తిరిగి గ్రామానికి పర్యావరణ సమస్యలు వస్తున్నాయని చెబుతున్న ప్రభుత్వం ప్రస్తుతం చేస్తున్నదేమిటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. చెత్త పన్ను ఎత్తేశామని ప్రచారం చేశారు. వీధుల్లో ఎక్కడి చెత్త అక్కడ పేరుకు పోతుందనే విమర్శలు ఉన్నాయి. ఈ చెత్తను ఉపయోగించి ఎనర్జీ యూనిట్లు ఏర్పాటు చేస్తే బాగుంటుందనే ఆలోచన పలువురు వ్యక్తం చేస్తున్నారు. వేస్ట్ మేనేజ్ మెంట్ పేరుతో ఎన్నో చేయొచ్చని చెబుతున్న ప్రభుత్వం చెత్తను పూర్తి స్థాయిలో ఎప్పటికప్పడు లేకుండా చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు.

Tags:    

Similar News