ట్రోలింగ్ కాటేసిన గీతాంజలి మరణం చెప్పేదేమిటి?

గీతాంజలి మరణానికి కారణమైన సోషల్‌ మీడియా గ్రూపులను గుర్తించారు. వినియోగించిన వ్యక్తులు ఎవరనే దానిపై విచారణ జరుగుతోందంటున్నారు పోలీసులు

Update: 2024-03-13 10:00 GMT
Geetanjali

ఇటీవల మంత్రి ఆర్కే రోజా, కాంగ్రెస్‌ పార్టీ ఏపి చీఫ్‌ వైఎస్‌ షర్మిలా, వైఎస్‌ వివేకనందరెడ్డి కుమార్తె సునీతా వీటి బారిన పడి కన్నీటి పర్యంతమయ్యారు. కారణం సోషల్  మీడియా వికృత సంస్కృతే.  దానిపేరే ట్రోలింగ్.


తమకు ఏదైన పోస్టు నచ్చక పోతే చాలు, మహిళల ఫోటోలను మార్ఫింగ్‌ చేసి పైశాచిక ఆనందాన్ని పొందుతుంటాయి సోషల్‌ మీడియా టీమ్‌లు. కుటుంబాల మీద దాడి చేయడం ఈటీముల చ ప్రధాన వ్యూహం. మహిళలను చులకన చిత్రించడం వీళ్ల  వికృత క్రీడ.  ఆత్మాభిమానం ఉన్న ఆడపిల్లలు ఆ పోస్టులను చూల్లేక కొందరు పోలీసులను ఆశ్రయిస్తే మరి కొందరు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఈ పైశాచిక ఆనందానికి బలైన మహిళయే గీతాంజలి.
ఆ పార్టీ ఈపార్టీ అని లేకుండా ా అన్నీ పార్టీలు ట్రోలింగ్  వికారులను శకారులను పెంచిపోషిస్తున్నాయి. ట్రోలింగ్ ఆర్మీలేని పార్టీలేదు. ఫేక్ వార్తలను, వక్రీకరణలను,అబద్ధాలను, ఆశ్లీలతను ప్రచారం చేసేందుకు వీటికి శిక్షణ కూడా ఇస్తున్నాయి. కోట్లు ఖర్చు పెడుతున్నాయి.  ప్రతిపార్టీ ఈ విష సర్పాల పుట్టే.  అవిసోషల్ మీడియా మొత్తం జరజరా పాకుతూ విషం కక్కుకంటూ కాటేసుకుంటూ పోతుంటాయి. ఇందులో కొన్ని పాములు అమాయకురాలైన గీతాంజలిని కాటేశాయి. ఆమె విలవిల్లాడింది. ప్రాణాలు విడించింది.

ఆమె నేరం.  సంతోషంగా ఉన్నానని చెప్పింది..

 గుంటూరు జిల్లా తెనాలి పట్టణానికి చెందిన జి గీతాంజలి తనకు ప్రభుత్వం నుంచి లభించిన సాయం, తన కుటుంబం సంతోషంగా ఉన్న విషయం ఒక యూ ట్యూబ్‌ చానల్‌ ప్రతినిధితో పంచుకుంది.
అది రాజకీయ పార్టీల సోషల్‌ మీడియా టీమ్‌లకు నచ్చ లేదు. ఆ టీమ్‌లు ఏ పార్టీల వారని చెప్పడానికి ఆధారాలు లేవు. అధికార పార్టీలోని వ్యతిరేకులై ఉండొచ్చు, ప్రతిపక్ష పార్టీలలోని సభ్యులు అయి ఉండొచ్చు. ఇష్టాను సారం రెచ్చి పోయారు. గీతాంజలి గురించి ఆమె భరించ లేని రీతిలో పోస్టులు పెట్టారు. ఆమెనే కాదు ఆమె కుటుంబ సభ్యులను వదల్లేదు. ఈ పోస్టుల దాటికి 30 ఏళ్ల గీతాంజలి విలవిలలాడి పోయింది. భర్త, కుటుంబ సభ్యుల వద్ద బాధపడింది. రాత్రంతా ఆ బాధను దిగమింగుకో లేక పోయింది. తాను బతికి ఉండటం కంటే చనిపోవడమే పరిష్కారమనుకుంది. నేరుగా రైలు పట్టాలపై రైలుకు ఎదురుగా నడుస్తూ ఆత్మ త్యాగానికి పాల్పడింది. చుట్టు పక్కల చూసిన వారు ఆసుపత్రికి తీసుకెళ్లే లోపులే ఆమె మరణించింది. ఆమెకు ఇద్దరు చిన్న పిల్లలు. భర్త బంగారు దుకాణంలో ఒక కూలీ. రెక్కాడితే కానీ డొక్కాడని జీవితాలు వారివి. గీతాంజలి మరణానికి ఈ సోషల్‌ మీడియా ట్రోలర్లు ఏమని సమాధానం చెబుతారు. నా వరకు నాకు మంచి జరిగిందని చెప్పడమే నేరం అవుతుందా. ప్రభుత్వం మంచి చేసిందనడం వల్లే ఇంత దారుణం జరిగింది.
నిందితులను గుర్తించారా..
చాలా సందర్భాల్లో పోలీసులు ఈ సోషల్‌ మీడియా ట్రోలర్లను అదుపులోకి తీసుకోవడం రాజకీయ పార్టీల ప్రమేయంతో వదిలేయడం జరుగుతూనే ఉంది. గీతాంజలి విషయంలో మూడు రోజులుగా ఎటువంటి దర్యాప్తు చేశారు? ఎంత మందిని అదుపులోకి తీసుకున్నారు? వారిపై ఎటువంటి చర్యల కోసం రిపోర్టులు తయారు చేశారనేది పోలీసులు వెల్లడించాల్సి ఉంది. గుంటూరు ఎస్పీ తుషార్‌ మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిందితులను కొందరిని గుర్తించినట్లు చెప్పారు. సోషల్‌ మీడియా ద్వారా నేరాలకు పాల్పడే వారు తన సొంత ప్రొఫైల్‌తో కాకుండా ఫేక్‌ ప్రొఫైల్స్‌ సృష్టించి గ్రూపులను క్రియేట్‌ చేస్తారు.
అందువల్ల వారిని గుర్తించడం, పట్టుకోవడం అంత తేలికేమీ కాదు. పైగా దారుణమైన పోస్టులు పెట్టేటప్పుడు ఈ సోషల్‌ మీడియా గ్రూపులు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటాయి. పోలీసులు అనుమానిస్తున్న ప్రకారం గీతాంజలి కుటుంబంతో ఎంతో కొంత సాన్నిహిత్యం ఉన్న వాళ్లే ఈ దారుణానికి పాల్పడి ఉంటారనే కోణంలో కూడా పోలీసుల దర్యాప్తు సాగుతున్నట్లు విశ్వశనీయ సమాచారం. ఆ వైపుగా దర్యాప్తు స్పీడందుకుంటే తప్పనిసరిగా ఈ దుర్మార్గులను గుర్తించడం పెద్ద కష్టమేమీ కాదు.
రూ. 20లక్షలతో చేతులు దులుపుకుంటారా..?
గీతాంజలి మరణానికి కారకులను గుర్తించినా, శిక్షలు వేసినా, ఆమె ప్రాణం తిరిగి రాదు. అయితే మరొకరిపై ఇటువంటి పోస్టులు, ట్రోల్స్‌ ఎవ్వరూ చేయకుండా ఉండేందుకు ఉపయోగపడుతాయి. గీతాంజలికి ఇద్దరు పిల్లలు. చిన్న వయసు వాళ్లు. తండ్రి ఆ పిల్లల బరువు బాధ్యతలు చూడటం అంటే సాధారణ విషయం కాదు. పూటకు సంపాదించుకోవాలి. వీళ్లకు ఏ కష్టమూ రాకుండా కాపాడాలి. ఏ తండ్రికైనా అది సాధ్యమయ్యే పని కాదు. తల్లి ఉంటేనే పిల్లల సంరక్షణ బాగుటుంది. ప్రభుత్వం గీతాంజలి మరణానికి పరిహారంగానో, పారితోషకంగానో అనుకోవచ్చు కానీ రూ. 20 లక్షలు ఇస్తున్నట్లు ప్రకటించింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఈ మొత్తాన్ని ప్రకటించారు. మరి పిల్లల సంగతేమిటి. వారి బాగోగులు చూడాల్సి బాధ్యత ప్రభుత్వానికి లేదా. ఇప్పటి నుంచి పిల్లల ప్రతి అడుగులోను ప్రభుత్వం బాధ్యత తీసుకోవలసి ఉంటుంది. మంచి విద్యా సంస్థల్లో వారికి చదువు చెప్పించే బాధ్యత ప్రభుత్వమే తీసుకోవాలి. వారు ఉన్నత విద్యను అభ్యసించే వరకు అయ్యే ఖర్చులన్నీ ప్రభుత్వమే భరించాలి. గీతాంజలి భర్తకు ఉపాధి కల్పించాలి. లేదా ఏదైనా ప్రభుత్వ కొలువు ఇప్పించాలి. ఇంకా ఆ కుటుంబంలో చదువుకున్న వారు ఉంటే వాళ్ల విద్యార్హతను బట్టి ఉపాధి చూపించాల్సి బాధ్యత ప్రభుత్వానిదే. అప్పుడు మాత్రమే ఆ కుటుంబానికి కొంతైనా న్యాయం జరిగినట్లు అవుతుంది.
Tags:    

Similar News