'పులిబిడ్డ' వైఎస్ షర్మిల పారిపోతుందా?

నాలుగేళ్ల తర్వాత ప్రత్యేక హోదాను తెరపైకి తీసుకువచ్చిన ఘనత షర్మిలకు దక్కింది. ఇప్పుడదే ఆమె సత్తాకు అగ్నిపరీక్షగా మారనుంది.

Update: 2024-02-06 03:40 GMT
ప్రత్యేక హోదాపై ఢిల్లీలో దీక్ష చేస్తున్న షర్మిల

'నేను పులి బిడ్డను, డాక్టర్ వైఎస్సార్ కుమార్తెను' అని పదేపదే చెప్పే వైఎస్ షర్మిల ధైర్యానికి పరీక్షా సమయం వచ్చింది. ఎవ్వరికీ మింగుడు పడని, అందరూ రాజీపడిన ప్రత్యేక హోదా అనే తేనెతుట్టెను కదపడమే ఆమె చేసిన ‘నేరం’గా ప్రధాన రాజకీయ పార్టీలు ప్రత్యేకించి అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీలకు ఏమాత్రం మింగుడు పడడం లేదు. ఆమెను కట్టడి చేయకపోతే ప్రత్యేక హోదా అంశం మళ్లీ ప్రజల్లోకి పోతుందేమోననే అనుమానం అన్ని రాజకీయ పార్టీలకు ఉన్నా ప్రజల జ్ఞాపకశక్తి పట్ల నేతలకు అపార నమ్మకం ఉన్నందున.. ఈ షర్మిలను ఒక్కర్తెను కట్టడి చేస్తే సరిపోతుందనే.. గట్టి విశ్వాసంతో ఉన్నారు. దీనికి తగ్గట్టుగా అధికార పార్టీలు ఆమె చుట్టూ వలపన్నుతున్నారు. నిజంగానే ఆమెను కట్టడి చేయగలిగితే ప్రత్యేక హోదాపై ఇప్పటికిప్పుడు గట్టిగా మాట్లాడేవారు కూడా ఎవ్వరూ ఉండరు.

షర్మిల వచ్చిన తర్వాతే ప్రత్యేక హోదా కాక..

‘కారణాలు ఏవైనా ప్రత్యేక హోదాపై చాలా కాలం తర్వాత షర్మిల గళం విప్పారు. రాష్ట్రంలో చాలా చోట్ల ఈ విషయాన్ని చర్చకు పెట్టారు. కేవీపీ రామచంద్రరావు లాంటి వాళ్లు కూడా ఆమెకు అండగా నిలిచారు. మమ్మల్ని కలిసి రమ్మన్నారు. మేమూ వస్తామని చెప్పాం. అయినా వాళ్లు ఢిల్లీలో ప్రత్యేక దీక్ష చేసి రావడంతో మళ్లీ ఈ విషయం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైన మాట నిజం’ అన్నారు ప్రత్యేక హోదా సాధన సమితీ కన్వీనర్ చల్లపల్లి శ్రీనివాసరావు. ఈ ఉద్యమానికి సీపీఐ, సీపీఎం తొలి నుంచి మద్దతు ఇస్తున్నాయి. ఇప్పుడు షర్మిల ఊరూరా సభల్లో ఈ అంశాన్ని చెబుతుండడంతో రాజకీయ పార్టీల నేతలు ఏదో రూపంలో స్పందించక తప్పడం లేదు.

ప్రత్యేక హోదా నేపథ్యం ఇదీ....

పార్లమెంటు సాక్షిగా ఆనాటి ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్, ఆనాటి ప్రతిపక్ష నాయకుడు ముప్పవరపు వెంకయ్య నాయుడు సహా పెద్దలందరూ విభజిత ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా ఐదుకు పదేళ్లు ఉండాలన్న వారే. సన్మానాలు చేయించుకున్న వారే. రాష్ట్రం విడిపోయి చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఆనాటి ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఊరూరా తిరిగి విద్యార్థి సదస్సులు పెట్టి ప్రత్యేక హోదా కావాలని నినదించిన వారే. చంద్రబాబు ప్రత్యేక హోదాపై మాట మార్చి ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకుని ఆ తర్వాత నాలుక కరచుకుని ఢిల్లీలో ధర్నాకు పిలుపిచ్చి బీజేపీకి దూరమయ్యాడు. 2014 ఎన్నికల్లో ఇప్పటి ప్రధాని నరేంద్ర మోదీ తిరుపతిలో పదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి చాలా కన్వీనెంట్ గా మరిచిపోయారు. ఇచ్చే అధికారం తన చేతిలో ఉన్నా ఇవ్వకుండా మిన్నకుండి పోయారు.

ఇప్పుడేం జరుగుతోంది...

సరిగ్గా ఈ సమయంలో ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన వైఎస్ షర్మిల తన రాజకీయ తొలి అస్త్రంగా ప్రత్యేక హోదాను, రాష్ట్ర విభజన చట్టంలోని అంశాలను తలకెత్తుకున్నారు. ఢిల్లీలో దీక్ష, ఇండియా కూటమిలోని పార్టీ నేతలతో వరుస భేటీలతో ప్రత్యేక హోదా మళ్లీ నాలుగేళ్ల తర్వాత తెరపైకి వచ్చింది. సరిగ్గా ఇదే సమయంలో పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. ఇంకోపక్క ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. దీంతో 25 పార్లమెంటు సీట్లున్న ఏపీకి ప్రత్యేక హోదా అంశం రగులుకుంది.

బీజేపీని ఇరుకున పెట్టేలా కాంగ్రెస్ అస్త్రం...

అనుకున్నదే తడవుగా కాంగ్రెస్ ఏపీ వ్యవహారాల ఇన్ చార్జి మాణిక్యం ఠాకూర్ లోక్ సభలో విభజన హామీలపై వాయిదా తీర్మానాన్ని ప్రతిపాదించారు. మందబలంతో ఉన్న బీజేపీ ఆ తీర్మానాన్ని అనుమతించక పోవొచ్చు గాని రాష్ట్రానికి చెందిన టీడీపీ, వైసీపీ, బీజేపీ అనివార్యంగా మాట్లాడాల్సి వచ్చింది. వైసీపీ తరఫున రాజ్యసభలో మాట్లాడిన విజయసాయి రెడ్డి ఊహించినట్టే ప్రత్యేక హోదా తప్పంతా కాంగ్రెస్ పై నెట్టేశారు. ప్రత్యేక హోదాపై మంత్రివర్గ తీర్మానాన్ని చట్టంలో పెట్టడానికి బదులు ప్లానింగ్ కమిషన్ కు ఎందుకు పంపాల్సి వచ్చిందో చెప్పాలని ప్రశ్నించారు. మోదీ, వెంకయ్యనాయుడు చెప్పిన మాట ఏమైందని టీడీపీ సభ్యుడు గల్లా జయదేవ్ లోక్ సభలో ప్రధాని మోదీ ఉండగానే ప్రశ్నించారు. అది కాలం చెల్లిన అంశంగా బీజేపీ నేతలు ప్రకటించారు. ప్రధాని నోరు మెదపలేదు. సరిగ్గా ఈ పరిస్థితుల్లో వైఎస్ షర్మిల ప్రత్యేక హోదాను తన ప్రచార అస్త్రంగా ప్రజల్లోకి వెళ్లడంతో అటు బీజేపీ ఇటు వైసీపీ పెద్దలకు ఆగ్రహం వచ్చిందంటున్నారు

షర్మిలను మీరు కట్టడి చేస్తారా, మేము చేయాలా?

పార్లమెంటులో చిటపటలు మొదలైన తర్వాత బీజేపీ సీనియర్లు రంగంలోకి దిగారు. ‘ప్రత్యేక హోదా’ అంశం నాలుగేళ్ల కాలంలో పెద్దగా చర్చకు రాలేదు. ఏపీ కాంగ్రెస్‌ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టిన వైఎస్‌ షర్మిల ప్రత్యేక హోదాపై నిలదీస్తున్నారు. ఇది.. వైసీపీ ప్రభుత్వానికి, కేంద్రంలోని బీజేపీ సర్కారుకు కూడా మింగుడు పడడం లేదు. ‘‘హోదా విషయంలో కేంద్రం మెడలు వంచుతానని చెప్పి.. ఇప్పటి వరకు హోదా తీసుకురాలేదు’’ అంటూ షర్మిల తన ప్రసంగాల్లో సీఎం జగన్‌పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఏపీ కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్కం ఠాకూర్‌ తాజాగా లోక్‌సభలో విభజన హామీలపై వాయిదా తీర్మానం ఇచ్చారు. దీంతో బీజేపీ పెద్దలు వైసీపీ ముఖ్య ఎంపీ ఒకరిని పిలిపించి ఇదేంటని ప్రశ్నించారు. ఈ క్రమంలో షర్మిల అంశం ప్రస్తావనకు వచ్చింది. ‘‘ప్రత్యేక హోదా అంశాన్ని షర్మిల కావాలనే తెరపైకి తెస్తున్నారు. మేం ఎదురు దాడికి దిగాం. మీ పార్టీ నుంచి ఎవ్వరూ మాట్లాడట్లేదు. అలా వదిలేస్తే ఎన్నికల్లో నష్టం వస్తుంది’’ అన్నట్టు తెలిసింది. దీంతో ఢిల్లీ బీజేపీ పెద్దలు షర్మిలపై ఎదురుదాడి చేయాలని ఏపీ బీజేపీ నేతలకు దిశానిర్దేశం చేశారు.

షర్మిలను ఏమి చేసే చాన్స్ ఉందంటే...

సహజంగా ఎవరైనా ప్రత్యర్థి నోరు కట్టేయాలనుకుంటే ముందుగా ఆర్థిక మూలాలను దెబ్బతీస్తారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు బీజేపీ ప్రభుత్వ చేతిలో ఉన్నాయి గనుక ఆదాయపన్ను శాఖలతో దాడులు చేయిస్తారు. ఎన్ఫోర్స్మెంట్ విభాగంతో రెయిడ్స్ చేయించవచ్చు. గల్లా జయదేవ్ లాంటి పదేళ్ల అనుభవం ఉన్న లోక్ సభ సభ్యుడే రాజకీయ దాడులకు భయపడి రాజకీయాల నుంచి తప్పుకునే పరిస్థితి వచ్చింది. అలాగే షర్మిలపై ఆర్ధిక, రాజకీయ, వ్యక్తిగత దూషణలు, దాడులు జరిగే చాన్స్ ఉంటుంది. మానసికంగా దెబ్బతీనే పరిస్థితులు కల్పిస్తారు. ఇలా “అన్ని వైపుల నుంచి చేసిన ప్రయత్నాలు విఫలమైతే ఏదో కారణంతో అరెస్ట్ చేసి కొంతకాలం బయటకు రాకుండా చేసే అవకాశం ఉంటుందన్నారు” ప్రకాశం జిల్లాకు చెందిన న్యాయనిపుణుడు పి.అప్పారావు. మరి ఇలాంటి పరిస్థితుల్లో వైఎస్ షర్మిల పులిబిడ్డగా నిలబడతారో, బెదిరింపులకు, దాడులకు భయపడి వెనక్కుతగ్గుతారో చూడాలి.

Tags:    

Similar News