విజయవాడలో భారీ అగ్ని ప్రమాదం
ఎగ్జిబిషన్‌లో రెండు దుకాణాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. భారీగా ఆస్తి నష్టం జరిగినా.. అదృష్ట వశాత్తు ఎలాంటి ప్రాణ నష్టం జరగ లేదు.;
By : The Federal
Update: 2025-02-12 15:42 GMT
విజయవాడ నగరంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. విజయవాడ నగరంలోని సితార గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన జలకన్య ఎగ్జిబిషన్‌లో బుధవారం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాద ఘటనలో జలకన్య ఎగ్జిబిషన్ పూర్తిగా కాలిపోయింది. దీంతో పెద్ద ఎత్తున ఆస్తి నష్టం వాటిల్లింది. మంటలు పెద్ద ఎత్తున వ్యాపించడంతో సితార గ్రౌండ్స్‌కు సమీప ప్రాంతాల్లో నివాసం ఉంటున్న ప్రజలు భయందోళనలతో పరుగులు పెట్టారు.
మరో వైపు ఈ ఎగ్జిబిషన్‌లో ఉన్న వంగ సామాగ్రిలో ఉన్న గ్యాస్ బండలు పేలడంతో మంటలు మరింతగా వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది, పోలీసులు వెంటనే సితారా గ్రౌండ్స్‌కు చేరుకున్నారు. మంటలను ఆర్పేందుకు రంగంలోకి దిగారు. రెండు ఫైర్ ఇంజన్లుతో మంటలను అదుపులోకి తెచ్చారు. పెద్ద ఎత్తున ఆస్తి నష్టం జరిగింది. అయితే ఎంత జరిగిందనే దానిపై స్పష్టత రావలసి ఉంది.
ఈ ఘటనపై విజయవాడ మునిసిపల్ కమిషనర్ ధ్యానచంద్ మాట్లాడుతూ.. గ్యాస్ సిలిండర్ బండ పేలడమే ఈ అగ్ని ప్రమాదానికి కారణమని చెప్పారు. రెండు షెడ్లు ఈ ప్రమాదంలో పూర్తిగా ధ్వంసం అయ్యాయని, భారీగానే ఆస్తి నష్టం సంభవించిందని తెలిపారు. అయితే సితారా గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన జలకన్య ఎగ్జిబిషన్ సమయం ఇప్పటికే పూర్తి అయింది. జనవరి 28వ తేదీతో జలకన్య ఎగ్జిబిషన్‌కు ఇచ్చిన అనుమతుల గడువు ముగిసింది. అయినా ఎందుకు ఉంచారనే దానిపై విచారణ చేపట్టామని ధ్యానచంద్ తెలిపారు. ఎగ్జిబిషన్ నిర్వాహకులు మీద ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. భారీగానే అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నా.. ఎలాంటి ప్రాణ నష్టం జరగ లేదన్నారు. అయితే ఇక్కడ ఉన్న పక్షులు, జంతువులను సురక్షిత ప్రాంతాలను తరలించినట్లు తెలిపారు.
అగ్ని ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి వంగలపూడి అనిత స్పందించారు. అగ్ని ప్రమాదంలో ఆస్తి నష్టం జరిగిందా? ప్రాణ నష్టం జరిగిందా? అని విజయవాడ వెస్ట్ ఏసీపీ దుర్గారావుకు ఫోన్ చేసి ఆరా తీశారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం చోటు చేసుకోగా.. గ్యాస్ సిలిండ్ పేలడం వల్లనే మంటలు వ్యాపించాయని, దీని వల్ల ఎగ్జిబిషన్‌లోని దుకాణాలు పూర్తిగా దగ్ధమయ్యాయని.. అయితే పూర్తి స్థాయిలో మంటలను అదుపులోకి తీసుకొచ్చినట్లు మంత్రికి తెలిపారు.