పోలీస్ స్టేషన్‌లో చండీ హోమమా?
భక్తులు ఇండ్ల వద్ద, దేవాలయాల వద్ద హోమాలు నిర్వహిస్తారు. అయితే విజయవాడ వన్‌టౌన్ పోలీసులు ఏకంగా పోలీస్ స్టేషన్‌లోనే హోమం నిర్వహించారు.
ఎవరైనా భక్తి ప్రపత్తులు చాటు కోవాలంటే హోమాలు, యాగాలు చేస్తుంటారు. ఇందుకోసం ఒక చిన్న కుటీరం లాంటిది కొత్తగా నిర్మించి కొందరు పెద్దలు చేస్తారు. మరి కొందరు నివాస భవనంలోనే చేస్తారు. ఇంకొందరు దేవాలయాల్లో చేస్తారు. అయితే ఏకంగా పోలీస్ స్టేషన్‌లో హోమాలు చేస్తున్న సంఘటన పలువురిని ఆశ్చర్య పరుస్తోంది. విజయవాడ వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో పదేళ్లుగా ఈ హోమాన్ని నిర్వహిస్తున్నారు. అంతకు ముందు కూడా నిర్వహించినట్లు అక్కడ పనిచేసి రిటైర్డ్ అయిన పోలీసులు కొందరు తెలిపారు. హోమాలు చెయ్యాలంటే కొన్ని నియమాలు ఉంటాయి. పోలీసులు కాబట్టి వీరికి నియమాలు అవసరం లేకుండా పోయాయి. పోలీస్ డ్రెస్‌లోనే హోమ కార్యక్రమాన్ని వీరు నిర్వహిస్తున్నారు. విచిత్రం ఏమిటంటే వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి దుర్గమ్మ వారికి ప్రత్యేకంగా విజయవాడ పోలీస్ కమిషనర్ చీరను తీసుకెళ్లి ఇస్తారు.