ఒంగోలు వైసిపి గొడవ చక్కబడిందా, చిక్కబడిందా?

ఒంగోలు రాజకీయం కాస్త చల్లబడినట్లుంది. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డికి తిరిగి టిక్కెట్ ఇవ్వాలని బాలినేని కోరినా అధిష్టానం పట్టించుకోలేదు.

Update: 2024-02-01 05:12 GMT
ఎంఎల్ఏ బాలినేని శ్రీనివాసరెడ్డి

ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి (వాసు) ఒంగోలు ఎంపీ, ప్రకాశం జిల్లాలోని కొన్ని నియోజకవర్గాల సమన్వయ కర్తల నియామకం విషయంలో వెనక్కు సర్దుకున్నారు. నేను చెప్పిన వారికి టిక్కెట్లు ఇవ్వాలని ఇప్పటి వరకు వైసీపీ అధిష్టానంపై పోరాడిన బాలినేని అలిసిపోయారు. ఎట్టకేలకు నాకొక్కడికే పట్టిందా? అంటూ తప్పుకున్నారు. ఇకపై ఒంగోలు ఎంపీ ఎవరనేది నాకు అనవసరమని చెప్పేశారు. ఒంగోలు ఎంపీగా మాగుంట శ్రీనివాసులురెడ్డికి వైఎస్సార్సీపీ సీటు ఇవ్వాలని అధిష్టానాన్ని పట్టుబట్టారు. చివరకు నేను ఎంత చెప్పినా అధిష్టానం వినడం లేదని చేతులెత్తేశారు. ఈ విషయంలో మాగుంట శ్రీనివాసులురెడ్డి ముందుగానే మేలుకున్నారని చెప్పొచ్చు. చాలా సార్లు మాగుంట శ్రీనివాసులురెడ్డికి ఎంపీ టిక్కెట్ ఇచ్చేది లేదని సీఎం తేల్చి చెప్పడంతో వైసీపీలో టిక్కెట్ రాదనే నిర్ణయానికి వచ్చారు. వాసు (బాలినేని) మీపని మీరు చూసుకోండి. ఇక వద్దు, సీఎం అంగీకరించడం లేదు కాబట్టి మనం ఎంత ప్రయత్నించినా లాభం లేదని రెండు రోజుల క్రితం బాలినేనికి మాగుంట చెప్పారు. బాలినేని ఒంగోలులోని మాగుంట కార్యాలయానికి వెళ్లి కలిసినప్పుడు ఈ పరిణామం చోటు చేసుకుంది.

సమన్వయకర్తలపై నెట్టేసిన బాలినేని

ప్రకాశం జిల్లాలోని నియోజకవర్గ సమన్వయకర్తలపై ఎంపీ విషయం బాలినేని నెట్టేశారు. వాళ్లందరికీ లేని బాధ నాకెందుకన్నారు. మాగుంట శ్రీనివాసులురెడ్డి ఎంపీగా పోటీ చేస్తే బాగుంటుందని అనుకున్నాను. అయితే నియోజకవర్గ సమన్వయ కర్తలు ఎవ్వరూ మాట్లాడలేదు. అందకే అధిష్టానం చెప్పినట్లు నాపని నేను చూసుకుంటానని బుధవారం ఒంగోలులో మీడియాతో మాట్లాడుతూ అన్నారు. ఇప్పటి వరకు పట్టువదలకుండా మాగుంట కోసం ప్రయత్నించారు. ఇక సాధ్యం కాదని తేలడంతో ఈ మాటలు చెప్పారు.

గెలుపుపైనే దృష్టి

ఇప్పటి వరకు రాజకీయాలు చేసిన బాలినేని శ్రీనివాసరెడ్డి ఇకపై తన గెలుపుకోసం ప్రయత్నాలు ప్రారంభించారు. మాగుంట శ్రీనివాసులురెడ్డికి వైసీపీ టిక్కెట్ రాదని నిర్ణయించుకున్న తరువాత నా నియోజకవర్గంలో పేదలకు ఇళ్లపట్టాలు పంచాల్సి ఉంది. ఆ పని చూసుకుంటాను. ఆ తరువాత వేరే కార్యక్రమాలని సన్నిహితులతో చెప్పారు. అంటే నియోజకవర్గంలో ఓటర్లను ఎలా తనవైపు తిప్పుకోవాలో తనకు బాగా తెలుసనే ఆలోచనలో బాలినేని ఉన్నారు. ఆ దిశగా పావులు కదుపుతున్నారు. ప్రభుత్వం కూడా ఇప్పటికే ఇళ్ల పట్టాలు పంపిణీ చేసేందుకు ఎంత మొత్తం నిధులు కావాలో అంతమొత్తం ఇప్పటికే ఒంగోలుకు అందించారు. అంటే ఒక విధంగా బాలినేని శ్రీనివాసరెడ్డి ఏమనుకున్నారో అది జరిగిందని చెప్పొచ్చు.

మంత్రులు సైతం మాట్లాడలేదు

మంత్రులు ఆదిమూలపు సురేశ్, మేరుగ నాగార్జునలు అధిష్టానం సూచన మేరకు మారు మాట్లాడకుండా వారికి కేటాయించిన నియోజకవర్గాల్లో పనిచూసుకుంటున్నారు. అలాంటప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి ఎందుకు ప్రత్యేకంగా మెలికపెట్టారనేది ఆలోచించాల్సి ఉంది. జిల్లాలో సీనియర్ నాయకునిగా ఉన్న తనకంటూ ఒక వర్గం ఉండాలని బాలినేని తాపత్రయ పడ్డారు. దానికోసం మాగుంట సీటు విషయంలో పట్టుపట్టారు. తన బావమరిది వైవీ సుబ్బారెడ్డికి ఒంగోలులో ఎంపీకి అవకాశం లేకుండా చేయాలని ప్రయత్నించారు. ఇవన్నీ ఒక విధంగా ఫలించలేదని చెప్పొచ్చు. దీంతో ఎంపీ స్థానానికి ఎవరు పోటీ చేసినా నాకెందుకనే ఆలోచనకు వచ్చారు. ఎంపీ స్థానంలో ఉన్న వారు అసెంబ్లీ స్థానాలకు ఎన్నికల ఖర్చు కొంతవరకు భరించే అవకాశం ఉంటుంది. అయితే ఒంగోలు అసెంబ్లీకి కావాల్సిన నిధులు సీఎం ఇచ్చినందున నిధుల సమస్య కూడా బాలినేనికి వచ్చే అవకాశం లేదు. ప్రధానంగా గిద్దలూరు, మార్కాపురం నియోజకవర్గాల్లో బాలినేని చెప్పిన వారికి అసెంబ్లీ టిక్కెట్లు దక్కలేదు. దీనిపై మాత్రం కాస్త అసంతృప్తిగానే ఉన్నారు.

కొడుకును నాయకుడిని చేద్దామనే ఆశ కూడా నెరవేరలేదు

బాలినేని శ్రీనివాసరెడ్డి తన కొడుకు ప్రణీత్ రెడ్డిని ఎంపీగా లేదా ఎంఎల్ఏగా పోటీ చేయించాలనే ఆలోచనలో ఉన్నారు. దీనికి కూడా సీఎం జగన్ నుంచి అనుమతి రాలేదు. తన కుమారుడిని తీసుకుని ఇటీవల క్యాంపు కార్యాలయానికి వెళ్లారు. అప్పుడు కుమారునికి ఒంగోలు ఎంపీ కానీ, గిద్దలూరు ఎమ్మెల్యే టిక్కెట్ కానీ ఇప్పించుకోవాలనే ప్రయత్నం చేసినట్లు సమాచారం. ఇది కూడా సీఎం ఎదుట ఫలించలేదు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఒక్కటి కూడా సక్సెస్ కాకపోవడంతో అసంతృప్తితోనే ఉన్నారు.


Delete Edit

ఒంగోలు ఎంపీ టిక్కెట్ చెవిరెడ్డికేనా?

ఒంగోలు పార్లమెంట్ స్థానానికి తిరుపతి జిల్లా చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఫైనల్ చేసినట్లు సమాచారం. ఇప్పటికే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రకాశం జిల్లాలో పోటీ చేస్తే ఎలా ఉంటుందనే సర్వే కూడా చేయించారు. ఫలితాలు అనుకూలంగా ఉంటాయనే రిపోర్టును ముఖ్యమంత్రికి అందజేసినట్లు సమాచారం. అందువల్ల చెవిరెడ్డినే పోటీకి సిద్ధం కావాల్సిందిగా సీఎం జగన్ సూచించినట్లు విశ్వసనీయ సమాచారం. చంద్రగిరి నుంచి తాను పోటీ చేయకుండా తన కుమారునికి టిక్కెట్ ఇప్పించుకున్నారు.

Tags:    

Similar News