లక్ష్మీనారాయణ ‘స్పెషల్ క్యాటగరీ’ నినాదం అంటుకుంటుందా, ఆరిపోతుందా?

ఉద్యోగ సమస్యను ఆయన స్పెషల్ క్యాటగరి కి ముడేసి తెలివిగా ఒక రాజకీయవ్యూహం తయారుచేసుకుంటున్నారు. విజయవంతం అవుతారా?

Update: 2023-12-30 03:47 GMT

చిన్న పార్టీ, కొత్త పార్టీ అధినేత అయిన సిబిఐ మాజీ అధికారి లక్ష్మీ నారాయణ ప్రజలకు ఆయన ‘స్పెషల్ క్యాటగరి స్టేటస్'(SCS) పిలుపు నిచ్చారు.రాష్ట్ర ప్రజలంతా 2024 జనవరి 26న రిపబ్లిక్ డే సందర్భంగా స్పెషల్ క్యాటగరి కోసం ప్రతిజ్జ చేయాలంటున్నారు. రాష్ట్రానికి స్పెషల్ క్యాటగరీ చాలా ముఖ్యమని, ఇది వస్తే చాలా మటుకు నిరుద్యోగ సమస్య పరిష్కారమవుతుందని ఆయన చెబుతున్నారు.

తన జైభారత్ నేషనల్ పార్టీ పెట్టిన రోజుకూడా ఆయన ప్రధానంగా చెప్పిన అంశం నిరుద్యోగ సమస్య. రాష్ట్రంలో 2014నుంచి పెద్దగా ఉద్యోగావకాశాలు పెరగలేదు. రాష్ట్రయువకులు ఉద్యోగాలకు హైదరాబాద్,చెన్నై,బెంగుళూరు వంటి నగరాలకు వెళ్తున్నారు.

అందువల్ల యువకులకు సంబంధించి ఉద్యోగ సమస్యను ఆయన స్పెషల్ క్యాటగరి కి ముడేసి తెలివిగా ఒక రాజకీయవ్యూహం తయారుచేసుకుంటున్నారు. ఓట్లు పడతాయోలేదో కాని లక్ష్మీనారాయణ చెప్పే విషయాలో నిజం ఉందని ప్రజలు, యువకులు నమ్ముతారు. అందుకే ఆయన తెలుగుదేశం, వైఎస్ ఆర్ కాంగ్రెస్ మర్చిపోయిన ఈ నినదాన్ని దుమ్ముదులిపి జనంలోకి తీసుకురావాలనుకుంటున్నారు.

కొత్త పార్టీ పాత నినాదం

ఆంధ్రప్రదేశ్ కు స్పెషల్ క్యాటగరి స్టేటస్ అనేది రాష్ట్రవిభజన సమయంలో పార్లమెంటులో అధికారంలోఉన్న యుపిఎ ప్రభుత్వం, ప్రతిపక్షంలో ఉన్న బిజెపి మద్దతు ఇచ్చిన హామీ. అయితే, 2104 ఎన్నికల్లో యుపి ఎ ఓడిపోయి బిజెపి రావడం, నరేంద్ర మోదీ ప్రధానికావడంతో ఈ డిమాండ్ పక్కన పడిపోయింది. ఆయనకు కేంద్రంలో వచ్చిన మెజారిటీ చూసి మొదట తెలుగుదేశం ప్రభుత్వం, తర్వాత 2019లో వచ్చిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి కళ్లు బైర్లు కమ్మాయి. మోదీని నొప్పించడం ఈ రెండు పార్టీలకు వేర్వేరు కారణాల వల్ల సాధ్యం కాదు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సిబిఐ కేసుల వల్ల తన డిమాండ్లేవీ ప్రధాని ముందు పెట్టి ఆయన మీద వత్తిడి తెచ్చి అమలుచేయించుకునే పరిస్తితి లేదు. అయనకు కావలసిందల్లా అవసరమయిన కేంద్రం నిధులు, లోన్ లు తీసుకునేందుకు అనుమతి.

ఇక తెలుగుదేశం కూడా అప్రకటి బిజెపి మిత్రపక్షమే. జగన్ కేసులగురించి భయపడితే, టిడిపి అధినేతకు ఇడి దాడులు, ఎన్నికలపుడు ఎన్నికల కమిషన్ సహాయనిరాకరణ చేస్తుందేమోననే భయం. దీనితో గత అయిదేళ్లు గా జగన్ గాని, చంద్రబాబుగాని కేంద్రాన్ని కలలో కూడా పల్లెత్తు మాట అనలేని పరిస్థితి ఉంది. అందువల్ల అయిదేండ్ల పాటు స్పెషల్ క్యాటగరీ తెస్తానని రేయింబగలు చెప్పిన జగన్ అధికారంలోకి రాగానే ఆడిమాండ్ ను వదిలేశాడు.

2019 ఎన్నికల్లో స్పెషల్ క్యాటగరి మీద పోరాడిన చంద్రబాబు కేంద్రంలో మోదీకి వచ్చిన మెజారీటీ చూసి పరివర్తన తెచ్చుకున్నాడు. కాంగ్రెస్ తో కలసి నందుకు చెంపలేసుకున్నారు. బిజెపికి దగ్గరయ్యేందుకు ప్రయత్నాలు ఇంకా చేస్తూనే ఉన్నారు. మొత్తానికి జగన్, చంద్రబాబు ఇద్దరు ప్రత్యేక స్టేటస్ డిమాండ్ ను వదిలిపెట్టారు. మోదీకి ఇరుకున్న పెట్టకుండాజాగ్రత్త పడుతూ వస్తున్నారు.

ఇక మూడో పార్టీ, యాంగ్రీయంగ్ మన్ లాగా రంగ ప్రవేశం చేసి, ఇపుడు బాణాలను కేవలం జగన్ మీద మాత్రమే గురిపెట్టిన పార్టీ జనసేన. పవన్ కల్యాణ్ నాయకత్వంలో ఉన్న ఈ పార్టీ కూడా ప్రత్యేక హోదా గురించి భీకరోపన్యాసాలు చేసిందే. ఆ పార్టీ కూడ అధికారికంగా బిజెపి మిత్ర పక్షమయింది. ఈ కాబట్టి ఎన్నికలపుడు మహా అంటే మాకు ప్రత్యేక హోదా ఇవ్వండని కేంద్రానికి ఒక రిక్వస్టు పెట్టవచ్చు. మానిఫెస్టోలో  ఈ పాయంట్ చేర్చవచ్చు. అంతేకాని, ఈ డిమాండ్ మీద ఆయన ప్రధాని మోదీని చికాకు పెట్టే పరిస్థితి ఉండదు.

ఈ నేపథ్యంలో ఈ డిమాండ్ ను లక్ష్మీనారాయణ చేస్తున్నారు.

శుక్రవారం నాడు పార్టీ విధి విధానాలను ప్రకటిస్తూ ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం కాదు అదింకా ప్రజల డిమాండే నని, దానికి కాలం చెల్లలేదని ప్రటించారు.

ఈ విషయాన్ని రాష్ట్ర ప్రజలకు గుర్తు చేసేందుకు ‘జనవరి 26న ప్రతిజ్ఞ చేద్దాం రండి’ అని లక్ష్మీనారాయణ పిలుపు నిచ్చారు.

ఆ రోజు నుంచి ప్రత్యేక హోదా పోరాటం మొదలవుతుందని ప్రజలంతా ప్రత్యేక హోదా కోసం ఉద్యమించాలని ఆయన కోరారు. ప్రజలు పోరాట బాట పడితేనే ప్రత్యేక హోదా ఏపీకి వస్తుందని ఆయన అంటున్నారు. మొదటి సారి ఆయన పోరాటం అంటున్నారు. ఇది ఎన్నికల కోసం ‘పోరాట’ మా లేక ఆయన నిజంగా తన పార్టీని ప్రత్యేక హోదా పార్టీగా మార్చాలనుకుంటున్నార    అనేది తేలాలంటే కొద్ది రోజులు వేచి చూడాల్సిందే.

ఇపుడు ఆంధ్రాలో కమ్యూనిస్టులు తప్ప ఏ పార్టీ మోదీకి వ్యతిరేకంగా కాదు. ప్రధాని మోదీని వ్యతిరేకించి బతకలేం అనే నిర్ణయానికి అన్ని పార్టీలు వచ్చాయి.

ఇలాంటపుడు బీజేపీ మీద జేడీ తన విమర్శలు ఎక్కుపెట్టగలరా? ఎందుకొంటే ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే కేంద్రం. ఇది పార్లమెంటులో ఇచ్చిన కమిట్ మెంట్. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన బాధ్యత కేంద్రాన్ని పాలిస్తున్న బీజేపీకి ఉందని అనడం సరిపోదు. ఆమేరకు వైసిపి, టిడిపి, జెఎస్ పి కూడా అంటున్నాయి.

లక్మీనారాయణ నినాదం జనం నినాదం కావాలంటే, ఆయన కేంద్రం మీద ఎలాంటి వైఖరి తీసుకుంటారనేది చూడాలి. అంతేకాదు, ప్రత్యేక హోదా ఇవ్వకుండా ఎగ్గొట్టినందుకు కేంద్రాన్ని,ఈ డిమాండ్ ను గాలికి వదిలేసినందుకు రాష్ట్రపార్టీలను దుయ్యబడుతూ ఎన్నికల కదనరంగంలోకి దూకుతారా అనేదాని మీద ఆయన పార్టీ భవిష్యత్తు అధార పడివుంటుంది.

ప్రత్యేక హోదా డిమాండ్ 2014 ఎన్నికల్లో బాగా పనిచేసింది. దానికి శక్తి వంతంగతా వాడుకుని తెలుగుదేశం అధికారింలోకి వచ్చింది. 2019లో ఇదే మాట వినిపించింది. ఈ సారి అది జగన్ కు ఉపయోగపడింది. 2024లో ఏమవుతుంది. జగన్ గాని, చంద్రబాబు గాని ఈ నినాదం చేయలేరు. లక్ష్మీనారాయణ ఒక్కరే ఈ నినాదం ఇస్తున్నారు. రాష్ట్ర ప్రజలు, మేధావులు, యువకులు అందుకుంటారా?

Tags:    

Similar News