దేవుడి రాజకీయాలు కాదు నేరుగా రాజకీయాలు చేద్దాం: మాజీ సీఎం జగన్
రాజకీయాలు చేయాలంటే నేరుగా చేద్దాం. సీఎం చంద్రబాబుకు జగన్ హెచ్చరిక. కేంద్రానికి, సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ కు లేఖ రాస్తా. చంద్రబాబుకు మొటిక్కాయలు వేయిస్తా.
Byline : Vijaykumar Garika
Update: 2024-09-20 15:00 GMT
సీఎం చంద్రబాబు ప్రభుత్వం తమ 100 రోజుల పాలనలోని వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి తిరుమల లడ్డూ అంశంతో మరో డైవర్షన్‌కు తెరతీసారని జగన్ విమర్శించారు.సూçపర్‌సిక్స్ హామీలపై ప్రజలు నిలదీస్తారన్న భయంతో ఈ దుర్మార్గమైన కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. రాజకీయాల కోసం చివరకు దేవుణ్ని కూడా చంద్రబాబు వదలడం లేదన్నారు. తిరుపతి లడ్డూ తయారీలో నాసి రకం నెయ్యి, జంతువుల కొవ్వు నుంచి తయారు చేసిన నెయ్యిని వాడారని సీఎం చంద్రబాబు దారుణ విమర్శలు చేశారని, సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలా మాట్లాడడం ధర్మమేనా? కొన్ని కోట్ల మంది మనో భావాలతో ఆడుకోవడం ధర్మమేనా? అని అన్నారు.
నెయ్యి పరీక్షలకు, లడ్డూలో కలిపే ఇతర వస్తువులకు పక్కా వ్యవస్థ ఉందని అన్నారు. నెయ్యి సేకరణ ఎలా జరుగుతుంది, దాని విధివిధానాలు ఏమిటి అనే విషయాలు అందరూ తెలుసుకోవాలన్నారు. తిరుమలలో నెయ్యి సేకరణ రెగ్యులర్‌గా జరిగే కార్యక్రమం. ప్రతి ఆరు నెలలకు టెండర్లు పిలుస్తారు. కంపెనీలు కోట్ చేస్తాయి. ఎల్–1గా ఎవరు ఉంటే, బోర్డు దాన్ని ఆమోదిస్తుంది. ఇది రొటీన్‌గా జరిగే కార్యక్రమం. నియమాలు కొత్తగా ఎవరూ మార్చలేదని,ఎప్పటి నుంచో అవే కొనసాగుతున్నాయని అన్నారు.
టీటీడీ లడ్డూకి ఎంత ప్రాశస్త్యం ఉందో అందరికీ తెలుసు. దాని కోసం వస్తువుల సేకరణ పక్కా పద్ధతిలో జరుగుతుంది. నెయ్యిని ఎవరు సరఫరా చేసినా, ఆ నెయ్యి ట్యాంకర్‌తో పాటు నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ ల్యాబ్స్ (ఎన్‌ఏబీఎల్) సర్టిఫై చేసిన ల్యాబ్ నుంచి క్వాలిటీ సర్టిఫికెట్‌ను వారు తీసుకురావాలి. అలా వచ్చిన ట్యాంకర్ నుంచి మూడు శాంపిల్స్ తీసి, మూడు టెస్టులు చేస్తారు. అవన్నీ పాస్ అయితేనే, ఆ ఇంగ్రేడియంట్స్ కానీ, నెయ్యిని కానీ వాడడానికి ఆ ట్యాంకర్‌ను, వాహనాన్ని ముందుకు పంపిస్తారు. లేకపోతే వెనక్కు పంపిస్తారు. మరి అలాంటప్పుడు కల్తీ నెయ్యి వాడారని, నాసి రకం సరుకులు వాడారని చెప్పడం అబద్ధం కాదా? అది ధర్మమేనా? న్యాయమేనా? అని సీఎం చంద్రబాబును ప్రశ్నించారు. 2014–19 మధ్య చంద్రబాబు పాలనలో దాదాపు 15 సార్లు ఇలా నెయ్యి, ఇతర సరుకులను వెనక్కు పంపారు. తమ ప్రభుత్వ హయాంలో 2019–24 మధ్య కూడా 18 సార్లు ట్యాంకర్లను వెనక్కు పంపారు. ఎందుకంటే క్వాలిటీ టెస్టులో మంచి రిపోర్టు రాలేదు కాబట్టి అన్నారు. ఇక్కడ వ్యవస్థ గురించి గొప్పగా చెప్పుకోవాలన్నారు. ఇంత గొప్ప వ్యవస్థ ఉన్నందుకు మనం గర్వపడాలన్నారు. ఈ గొప్ప వ్యవస్థ, పద్ధతి, సంప్రదాయం ఉందన్న విషయాన్ని ప్రపంచానికి చెప్పాల్సింది పోయి, ఇలా పచ్చి అబద్ధాలు చెప్పడం దారుణమని అన్నారు.
చంద్రబాబు సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన రోజు అంటే జూన్ 12నన ఇప్పుడు రిపోర్టు వచ్చిన శాంపిల్స్ తీసుకున్నారు. రిపోర్టులు బాగా రాలేదు కాబట్టి, ఆ శాంపిల్స్‌ను జూలై 17న నేషనల్ డెయిరీ డెవలప్‌మెంట్ బోర్డుకి పంపారు. జూలై 23న వారు నివేదిక ఇచ్చారు. మరి 2 నెలల నుంచి ఏం చేశారు, ఆ నివేదిక ఎందుకు దాచి పెట్టారని సీఎం చంద్రబాబును నిలదీశారు. సీఎం చంద్రబాబు 100 రోజుల పాలన తర్వాత, సూపర్‌సిక్స్ గురించి ప్రజలు నిలదీస్తుండడంతో, ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఈ అంశాన్ని తీసుకొచ్చి డైర్ట్ చేస్తున్నారని విమర్శించారు. స్వామి వారిని అబాసు పాలు చేయడం ఎంత వరకు సమంజసమన్నారు. కర్ణాటక మిల్క్ ప్రొడ్యూసర్స్ ఫెడరేషన్ (కెఎంఎఫ్)కు చెందిన నందిని బ్రాండ్ నెయ్యికి కాంట్రాక్ట్ ఇవ్వలేదని సీఎం చంద్రబాబు ప్రభుత్వం విమర్శలు చేస్తున్నారని, 2015 నుంచి 2018 అక్టోబరు వరకు కెఎంఎఫ్‌కు కాంట్రాక్ట్ ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. ఎన్డీడీబీ రిపోర్టును టీటీడీ ఆఫీస్‌లో ఎలా రిలీజ్ చేస్తారని ప్రశ్నించారు.
తమ ప్రభుత్వ హయాంలో టీటీడీలో చాలా మార్పులు తీసుకొచ్చామన్నారు. టీటీడీలో ఉన్న ల్యాబ్‌ను సెంట్రల్ ఫుడ్ టెక్నాలజీ అండ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ సహకారంతో ఆధునీకరించామని, అక్కడి నుంచి నిపుణులను కూడా తీసుకొచ్చామని అన్నారు. నవనీత సేవలు మొదలుపెట్టామన్నారు. కొండమీద గోశాల ఏర్పాటు చేసి, సొంతంగా పాలు, వెన్న తయారీ మొదలుపెట్టామన్నారు. ప్రసాదాలు తయారు చేసే పోటులో కార్మికుల సర్వీస్ క్రమబద్థీకరించామన్నారు. వారి జీతాలు రెట్టింపు చేశామన్నారు. దేశవ్యాప్తంగా అనేకచోట్ల జీర్ణావస్థలో ఉన్న ఆలయాలను పునరుద్ధరించామన్నారు. హైదరాబాద్‌తో సహా, దేశంలోని పలు చోట్ల, చివరకు అమెరికాలో వెంకటేశ్వరస్వామి ఆలయాలు కట్టింది వైయస్సార్సీపీ ప్రభుత్వ హయాంలోనే చేశామన్నారు. టీటీడీలో 9 వేల మంది ఉద్యోగులకు ఇళ్ల పట్టాలు ఇచ్చింది కూడా తమ హయాంలోనే అన్నారు. చంద్రబాబు తన పాలనలో కనీసం ఒక్క సెంటు భూమి కూడా ఇవ్వలేదన్నారు. మఠాధిపతులతో మూడు విద్వత్ సదస్సులు నిర్వహించింది కూడా మా హయాంలోనే అన్నారు. 45 సార్లు అయ్యప్పమాల వేసుకున్న వైవీ సుబ్బారెడ్డిని టీటీడీ బోర్డు చైర్మన్‌గా చేశామన్నారు. కరుణాకర్‌రెడ్డి కూడా ఆధ్యాత్మికంగా ఎంతో ఉన్నత విలువలు ఉన్న వారని చెప్పారు.
ప్రధానికి, సీజేఐకి లేఖలు రాస్తా
సీఎం చంద్రబాబు దురుద్దేశంతో తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయాన్ని భ్రష్టు పట్టించే ప్రయత్నం చేస్తున్నారని,దానికి చంద్రబాబుకు అక్షింతలు వేయాలని చెప్పి, ప్రధానమంత్రితో పాటు, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌కు కూడా తాను లేఖలు రాస్తానని చెప్పారు. మన రాష్ట్ర పరువును, శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయ పరువును బజారుకీడుస్తున్న సీఎం చంద్రబాబు వైఖరిని అందరూ గుర్తించాలన్నారు. తాను చెప్పినవి నిజమా కాదా అని వెరిఫై చేసుకోవాలని భక్తులు, ప్రజలను కోరారు.