డబ్బు కోసమే లోకో పైలట్ హత్య

విజయవాడ రైల్వే స్టేషన్లో జరుగుతున్న ఘోరాలకు పుల్ స్టాప్ ఎప్పుడు పడుతుందో తెలియడం లేదు. లోకో పైలట్ ను దారుణంగా ఓ వ్యక్తి చంపాడంటే అందుకు బాధ్యులు అధికారులే.

Update: 2024-10-13 05:00 GMT

బీహార్‌లోని బక్సర్‌ జిల్లా బారు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ముజపర్పూర్ లో నివసించే దేవ కుమార్‌ సాహో రైల్వే లోకో పైలట్ డి ఎబనైజర్ ను డబ్బు కోసం రైల్వే ట్రాక్ పైనే దారుణంగా కొట్టి పరారయ్యాడు. ఆ తరువాత కొద్దిసేపటికి లోకో పైలట్ హతుడయ్యాడు. తెల్లవారు జాము 2 గంటలకు విజయవాడ రైల్వే స్టేషన్‌ శివార్లలోని ఎఫ్‌ క్యాబిన్‌ వద్ద విధులకు వెళుతున్న లోకో పైలట్‌పై నిందితుడు ఇనుప దిమ్మెతో దాడి చేశాడు. పైలట్ ను ఆస్పత్రికి తరలించేలోపులోనే మృతి చెందారు. క్రైం నెంబరు 309/2024 కింద 103 (1), 303 (2) సెక్షన్స్ తో కేసు నమోదైంది.

డబ్బు కోసమే లోకో పైలట్‌పై నిందితుడు దాడి చేసినట్టు పోలీసులు గుర్తించారు. పది రోజుల క్రితం ఉపాధి కోసం బీహార్‌లోని బక్సర్‌ నుంచి విజయవాడకు వచ్చిన సాహోకు ఎక్కడా పని దొరకలేదు. దీంతో తీవ్రమైన ఒత్తడితో డబ్బు కోసం ఏదైనా నేరానికి పాల్పడాలని భావించాడు. ఇంద్రకీలాద్రి వద్ద దసరా ఉత్సవాలు జరుగుతున్న ప్రాంతంలో గురువారం రాత్రి గంజాయి మత్తులో హంగామా సృష్టించడంతో పోలీసులు అదుపులోకి తీసుకుని రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో వదిలేశారు. అక్కడి నుంచి కాలినడకన వెళుతూ ఆటోలో నిద్రిస్తున్న డ్రైవర్‌పై రాయితో దాడి చేశాడు. డ్రైవర్‌ కేకలు వేయడంతో అక్కడి నుంచి పారిపోయాడు. నైజాం గేటు రైల్వే ట్రాక్‌ వెంబడి స్టేషన్‌ పరిసర ప్రాంతాలకు చేరుకున్నాడు. అక్కడ గూడ్స్ బోగీలను ప్లాట్‌ఫాం మీదకు షంటింగ్ చేస్తున్న డ్రైవర్‌ వద్ద డబ్బులు ఉంటాయని భావించి అతడిని డబ్బులు అడిగాడు. డబ్బులిచ్చేందుకు డ్రైవర్ నిరాకరించడంతో అతనిపై ఇనుప రాడ్డుతో దాడి చేసినట్టు జిఆర్పీ డిఎస్పీ రత్నరాజు తెలిపారు.

లోకో పైలట్‌ మీద అగంతకుడు దాడి చేస్తున్న విషయాన్ని ట్రాక్‌పై విధుల్లో ఉన్న కీమెన్‌ గమనించి కేకలు వేయడంతో అక్కడి నుంచి పరారయ్యాడు. యార్డులో విధుల్లో ఉన్న మరో కో పైలట్ పృధ్వీరాజ్‌కు కీమెన్‌ సమాచారం ఇవ్వడంతో మరి కొంత మంది రైల్వే కార్మికులతో కలిసి తొలుత రైల్వే ఆస్పత్రికి, అక్కడి నుంచి మరో ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ డ్రైవర్ మృతి చెందాడు. రైల్వే డ్రైవర్ హత్య తర్వాత నాలుగు ప్రత్యేక బృందాలు రైల్వే ప్రాంగణాల్లో గాలింపు చేపట్టారు. ఈ టీములకు జిఆర్పి సీఐ జెవి రమణ, ఆర్పిఎఫ్ సీఐ ఫతే అలీ బేగ్ లు నేతృత్వం వహించారు. కృష్ణా జిల్లా దోసపాడు రైల్వే స్టేషన్‌లో నిందితుడు పట్టుబడ్డాడు. కానీ రైల్వే పోలీసులు విజయవాడలోని అప్పి యార్డు వద్ద పట్టుపడినట్లు చెప్పటం విశేషం.

విజయవాడ రైల్వే స్టేషన్‌ పరిసర ప్రాంతాల్లో గత రెండేళ్లలో ఆరు హత్యలు జరిగాయి. నిర్మానుష్యంగా ఉండటంతో గంజాయి ముఠాలు తిష్ట వేస్తున్నాయి. రాత్రి సమయాల్లో విధులు నిర్వర్తించే రైల్వే సిబ్బందిపై దాడులకు పాల్పడుతున్నారు. రైల్వే యార్డుల్లో కనీసం లైట్లు కూడా ఏర్పాటు చేయకపోవడంతో బిక్కు బిక్కుమంటూ విధులు నిర్వర్తిస్తున్నారు. విధులకు వచ్చేటప్పుడు పైలట్లు కానీ, ఇతర సిబ్బంది కానీ రాత్రుల్లో టార్చిలైట్లు వేసుకుని రావాల్సి వస్తోంది. ఈ విషయాన్ని ఉద్యోగులు, యూనియన్ నాయకులు డిఆర్ఎంకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించులేదని ఉద్యోగులు చెబుతున్నారు.

రైల్వే స్టేషన్‌కు సమీపంలో ఉన్న నైజాం గేట్ లెవల్‌ క్రాసింగ్‌ను పూర్తిగా మూసేయడంతో సాధారణ ప్రజల రాకపోకలు నిలిచిపోయాయి. ఇదే అదనుగా గంజాయి సేవించడానికి యువతకు అడ్డాలుగా మారాయి. రైల్వే పరిధిలోని ప్రాంతాల్లో నిఘా బాధ్యత తమది కాదని స్థానిక పోలీసులు వదిలేస్తున్నారు. విజయవాడ రైల్వే జిఆర్పీ పరిధిలో 112 మంది పోలీసులు విధులు నిర్వర్తించాల్సి ఉంటే ప్రస్తుతం 42 మంది మాత్రమే ఉన్నారు. వీరిలో కోర్టు డ్యూటీ, విఐపీ సెక్యూరిటీ, సెలవుల్లో ఉన్న వారు పోతే మిగిలేది 17మంది మాత్రమే. కనీసం నాలుగో వంతు కూడా సిబ్బంది లేకపోవడంతో ఉన్నవారితోనే సరిపెట్టుకోవాల్సి వస్తోంది. దీంతో రైల్వే స్టేషన్‌లో భద్రతతో పాటు రైల్వే పరిసర ప్రాంతాల్లో నిఘాను పూర్తిగా వదిలేశారు.

రైల్వేకు చెందిన పరిసర ప్రాంతాల్లో ఆర్పీఎఫ్‌ భద్రత అంతంత మాత్రంగానే ఉంటోంది. ఆదాయపరంగా దక్షిణ మధ్య రైల్వే పరిధిలో అత్యధికంగా ఆదాయాన్ని సంపాదించే విజయవాడ రైల్వే స్టేషన్‌లో కనీస భద్రతా ఏర్పాట్లు కూడా లేవు. తగినంత సిబ్బంది లేకుండా తాము ఏమి చేయలేమని జిఆర్పీ అధికారులు చేతులెత్తేస్తున్నారు. విజయవాడ రైల్వే స్టేషన్‌లో విధులతో పాటు ఇతర బాధ్యతల పర్యవేక్షణ చేపట్టాలంటే స్థానిక పోలీసుల సహకారం కూడా ఉండాలని జిఆర్పీ అధికారులు చెబుతున్నారు.

విజయవాడ డివిజన్‌కు పశ్చిమగోదారి జిల్లా, విజయవాడ కమిషనరేట్‌, కృష్ణా జిల్లా పోలీసుల నుంచి సిబ్బందిని కేటాయించాల్సి ఉంటుంది. అయా జిల్లాల నుంచి పోలీసులను రైల్వే విధులకు ఇవ్వక పోవడంతోనే రైల్వే స్టేషన్ పరిసరాల్లో వరుస హత్యలు జరుగుతున్నాయని చెబుతున్నారు. పోలీసులు కూడా ఎంత విచిత్రంగా వ్యవహరిస్తున్నారంటే నైజాం గేటు నుంచి కంసాలిపేట ఫుట్ బ్రిడ్జిపై రాత్రి సమయంలో ఒక వ్యక్తిని కొట్టి చంపారు. ఈ సంఘటన 2022లో జరిగింది. రైల్వే ట్రాక్ అవతలివైపున డెడ్ బాడీని పడేయడంతో ట్రాక్ దాటి బాడీ ఉంది కాబట్టి మాకు సంబంధం లేదని రైల్వే పోలీసులు వదిలేస్తే కొత్తపేట పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ హత్యకు పాల్పడింది గంజాయి బ్యాచ్ గా చెప్పుకున్నారు. పోలీసులకు ఈ విషయాలు తెలుసు. గంజాయి బ్యాచ్ లు రైల్వే స్టేషన్ పరిసరాల్లో హల్ చల్ చేస్తున్నా ఎందుకు వారిని జైలుకు పంపించడం లేదనేది ఆలోచించాల్సి ఉంది. మూడు సంవత్సరాల క్రితం 10వ నెంబరు ప్లాట్ ఫారం పైన ఒక బాలిక కిడ్నాప్ కు గురైంది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సంఘటనలు ఉన్నాయి.

Tags:    

Similar News