మార్కాపురంపై మహా ట్విస్ట్
ఆంధ్రప్రదేశ్ లోని మార్కాపురం నియోజకవర్గంలో అధికార వైఎస్సార్సీపీ మహా ట్విస్ట్ ఇచ్చింది. ఊహించని విధంగా నిర్ణయం తీసుకుంది. దీంతో అభ్యర్థులు షాక్ అయ్యారు.
మార్కాపురం నియోజకవర్గం రాష్ట్రంలోని నియోజకవర్గాలన్నింటికంటే భిన్నమైనది. ఒక్కోసారి ఏమి జరుగుతుందో తెలిసేలోపు అన్నీ జరిగిపోతున్నాయి. వైఎస్సార్సీపీ ఇచ్చిన ట్విస్ట్ కు నియోజకవర్గ ప్రజలు నివ్వెర పోయారు. అయితే వైశ్య సామాజిక వర్గానికి చెందిన ప్రజలు హ్యీపీగా ఫీలవుతున్నారు. ఇందుకు నిదర్శనం అన్నా వెంకట రాంబాబుకు వైఎస్సార్సీపీ సీటు కేటాయించడం. నిజానికి అన్నా వెంకట రాంబాబుకు ఈ సారి సీటు లేదని అందరూ భావించారు. ఎందుకంటే అందరికంటే ముందుగానే జిల్లాలో మాగుంట శ్రీనివాసులురెడ్డి పోటీ చేస్తే ఆయన్ను ఓడించే వారిలో మొదటి లైన్లో నేను ఉంటానని ప్రకటించి సంచలనం సృష్టించారు. ఊహకు అందని విధంగా గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా వెంకట రాంబాబుకు మార్కాపురం శాసనసభ నియోజకవర్గ ఇన్చార్జ్గ్ గా అధికార వైఎస్సార్సీపీ ప్రకటించింది. ఇది ఒక విధంగా మంచి పరిణామమేనని మార్కాపురం నియోజకవర్గ ప్రజలు అంటున్నారు.
పట్టణంలో వైశ్యులకే పెద్దపీట
మార్కాపురం పట్టణంలో వైశ్యులకు పెద్ద పీట వేస్తున్నారు ఓటర్లు. ఎందుకో తెలియదు కానీ చాలా సార్లు మార్కాపురం పట్టణ మునిసిపల్ చైర్మన్ పదవి వైశ్యులకు దక్కింది. సామాజికవర్గం పరంగా చూసినా వైశ్యుల ఓట్లు మార్కాపురంలో ఎక్కువగానే ఉన్నాయి. పార్టీల కంటే వైశ్యులు సామాజికవర్గానికే ఎక్కువ విలువ ఇస్తున్నారు. అందువల్ల వైశ్య సామాజిక వర్గానికి చెందిన అన్నా వెంకట రాంబాబును వైఎస్సార్సీపీ అధిష్టానం మార్కాపురానికి ఎంపిక చేసింది. వైశ్య సామాజిక వర్గంతో పాటు రెడ్డి, బీసీ, ఎస్సీ సామాజికవర్గాలకు చెందిన వారు కూడా ఎక్కువమందే ఉన్నారు.
ఒకరికి ఒకరి సహకారం కూడా అవసరమే
మార్కాపురంలో పోటీ చేస్తున్న అన్నా రాంబాబుకు ఇద్దరి సహకారం అవసరం. ఒకరు ఎమ్మెల్యే నాగార్జున రెడ్డి కాగా, మరొకరు మార్కాపురం మాజీ ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి. నాగార్జనరెడ్డి ఎలాగూ అన్నా వెంకట రాంబాబుకు సహకారం అందించాల్సిందే. ఎందుకంటే గిద్దలూరులో అన్నా రాంబాబు సహకారం లేకుండా నాగార్జున రెడ్డి గెలుస్తాడనుకోవడం కూడా సరైంది కాదనే వాదన రాజకీయ పరిశీలకుల్లో వ్యక్తమవుతున్నది. అందువల్ల నాగార్జునరెడ్డి తప్పకుండా సహకరిస్తాడు. అయితే జంకె వెంకటరెడ్డి సహకారం ఉంటుందా? లేదా? అనేది ఆలోచించాల్సి వుంది. పైగా జంకె వెంకటరెడ్డి ప్రస్తుతం ప్రకాశం జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు. అందువల్ల పార్టీ చెప్పిన విధంగా తప్పకుండా జంకె సహకారం అన్నా రాంబాబుకు ఉంటుందని చెప్పొచ్చు.
జంకెను ఎందుకు కాదనుకున్నారు
మార్కాపురం మాజీ ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి మార్కాపురం సీటు దక్కలేదు. 2014లో వైఎస్సార్సీపీ సీటు దక్కించుకున్న జంకె మార్కాపురం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తరువాత 2019లో సీటు దక్కించుకోలేకపోయారు. కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే కె.పి కొండారెడ్డి కుమారుడు కె నాగార్జునరెడ్డికి టిక్కెట్ ఇచ్చింది. నాగార్జునరెడ్డి మామ కూడా కంభం మాజీ ఎమ్మెల్యే కావడం విశేషం. జంకె వెంకటరెడ్డి బాలినేని శ్రీనివాసరెడ్డి వర్గంగా చెబుతుంటారు. టిక్కెట్ కూడా ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ద్వారా తప్పకుండా వస్తుందనుకున్నారు. అయితే బాలినేని శ్రీనివాసరెడ్డికి అధిష్టానం పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదు. ఒక దశలో బాలినేని శ్రీనివాసరెడ్డిని గిద్దలూరు నుంచి పోటీ చేయాల్సిందిగా అధిష్టానం చెప్పింది. దీంతో ఆయన కూడా అధిష్టానాన్ని ఒప్పించలేకపోయారు.
జంకె వెంకటరెడ్డి ఆర్థిక స్థితి బాగోలేదని భావించిన అధిష్టానం టిక్కెట్ ను అన్నా రాంబాబుకు కేటాయించి మరో ట్విస్ట్ ఇచ్చింది. జంకె తనకు టిక్కెట్ వచ్చిందని మొదట భావించారు. ఆ తరువాత నాగార్జనరెడ్డి తనకు టిక్కెట్ వచ్చిందని అనుచరులతో పట్టణంలో టపాసులు కూడా కాల్చుకున్నారు. అనూహ్యంగా అన్నా రాంబాబును వైఎస్సార్సీపీ రంగంలోకి దించింది. టిక్కెట్ రాదని మొదట భావించిన రాంబాబు తాను రానున్న ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ప్రకటించారు. తన కుమారునికి టిక్కెట్ ఇప్పించుకునే ప్రయత్నం చేశారు. ఇవన్నీ పక్కనబెట్టి అధిష్టానం రాంబాబును మార్కాపురం నుంచి రంగంలోకి దించింది.
ఎందుకు ఈ నిర్ణయం
అన్నా రాంబాబుకు వ్యతిరేకంగా గిద్దలూరు నియోజకవర్గంలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారంతా ఒక్కటయ్యారు. ఎందుకు ఒక్కటయ్యారనే విషయాన్ని పరిశీలిస్తే.. కారణాలు చాలా ఉన్నాయి. అన్నా వెంకట రాంబాబు తనకు అందరిలా కాకుండా వ్యక్తిగత స్వేచ్ఛ ఉందని, మీరు చెప్పినట్లుగా నేను ఉండనని ముందుగానే చెప్పారు. పైగా రెడ్ల పెత్తనానికి చెక్ పెట్టారు. దీనిని జీర్ణించుకోలేని నలుగురు మండల ఎంపీపీలు, ఇద్దరు బీసీ ఎంపీపీలను కలుపుకుని ఆరుగ్గురితో అన్నా రాంబాబును వ్యతిరేకిస్తూ రాంబాబు నియోజకవర్గనికి పనికి రాడని, జనమంతా వ్యతిరేకిస్తున్నారని మేకప్ ఇచ్చారు. ఇది నిజం కాదని జనానికి తెలుసు. అయితే స్థానికంగా ఎంపీపీలను కాదని టిక్కెట్ ఇస్తే రాంబాబు ఓటమి కోసం ఎంపీపీలు అందరూ పనిచేసే అవకాశం ఉందని భావించిన వైసీపీ అధిష్టానం ముందడుగు వేసింది. అందులో భాగంగానే అన్నా వెంకట రాంబాబును మార్కాపురానికి మార్చి గిద్దలూరుకు నాగార్జనరెడ్డిని పంపించింది.