ఆంధ్రప్రదేశ బడ్జెట్ సమావేశాలు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. జాతీయ ఉపాధి హామీ పథకంలో అవకతవకలు జరిగాయనే దానిపై సోమవారం అసెంబ్లీలో చర్చ జరిగింది. జాతీయ ఉపాధి హామీ పథకం(ఎన్‌ఆర్‌ఈజీఎస్)లో అవినీతి జరగడంపై సోమవారం ప్రశ్నోత్తరాల సమయంలో చర్చ తెరపైకొచ్చింది. ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ వాల్మీకి పార్థసాథి ప్రశ్న అడిగారు. ఉపాధి హామీ పథకం పనులలో అవినతీని నిరోధించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఏమి? కర్నూలు జిల్లాలో ఉపాధి హామీ పథకం పనులలో అవకతవకలు జరిగినట్లు ఫిర్యాదులు అందాయా? అవినీతికి పాల్పడిన ఫీల్డ్ అసిస్టెంట్లు, అధికారులపై తీసుకుంటున్న చర్యలు ఏమి? అంటూ ప్రశ్నలు అడిగారు.
వీటికి సబంధిత శాఖ మంత్రి పవన్ కల్యాణ సమాధానం చెప్పాలని కోరారు. ఇదే అంశంపై సోమవారం ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ.. గత అయిదేళ్లల్లో ఉపాధి హామీ పథకాన్ని ఆదాయ మార్గంగా మార్చుకున్నారని మండిపడ్డారు. చేసిన పనులు మళ్లీ మళ్లీ చూపించి, రాని వారిని కూడా వచ్చినట్లు చూపి డబ్బులు తినేశారని విమర్శలు గుప్పించారు. కర్నూలు జిల్లా ఆదోని సాక్షి విలేఖరి బంధువులను పనికి రాకుండా వారి పేర్లను మస్తర్‌లో రాసి బిల్లులు చెల్లించి అవినీతికి పాల్పడ్డారని సభలో వివరించారు. గత ఐదేళ్లల్లో ఉపాధి హామీ పథకాన్ని రాజకీయ ఉపాధి హామీ పకథకంగా మార్చేశారని, ప్రజలకు ఉపయోగ పడేవిధంగా చేయలేదని ధ్వజమెత్తారు. పనులు చేసిన కూలీలకు సరిగా డబ్బులు పడటం లేదని, 70 రోజులు అయినా కూలీలకు వారి ఖాతాల్లో ఎందుకు డబ్బులు పడటం లేదని ప్రశ్నించారు.
ఇదే అంశంపై మరో సభ్యుడు, తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు మాట్లాడుతూ అవినీతికి పాల్పడిన 77 మంది ఫీల్డ్ అసిస్టెంట్ల అవినీతి వివరాలను పంపాలని కోరారు. దీనికి సబంధిత శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సమాధానం చెబుతూ వైసీపీ ప్రభుత్వ హయాంలో భారీ ఎత్తున ఉపాధి హామీ పథకంలో అవకతవకలు జరిగాయని పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలోనే అవకతవకలు జరిగాయని, కూటమి ప్రభుత్వంలో కాదని స్పష్టం చేశారు. తాను పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ ఉపాధి హామీ పథకంపైన దృష్టి సారించానని, అందులో జరిగిన అవినీతిని బయటకు తీసేందుకు చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. సోషల్ ఆడిట్, విజిలెన్స్ సెల్, క్వాలిటీ కంట్రోల్ వంటి అంశాల మీద దృష్టి పెట్టినట్లు తెలిపారు. రాష్ట్ర స్థాయి ఫ్లయింగ్ స్వా్కడ్‌లతో మస్తర్ జాబితాల మీద విచారణ చేపట్టామని, మస్తర్ జాబితాలు సరిగా ఉన్నాయా? లేదా? అంశాల మీద తనికీలు చేస్టున్నట్లు తెలిపారు. జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్లే ఈ ఇబ్బందులు చోటు చేసుకున్నట్లు పేర్కొన్నారు.