ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు ఎప్పుడంటే
ఐదు ఎమ్మెల్సీ స్థానాలు ఈ నెలఖరు నాటికి ఖాళీ కానున్నాయి. వీటిల్లో వీరిలో సీనియర్ నేత యనమల కూడా ఉన్నారు.;
By : The Federal
Update: 2025-03-03 12:42 GMT
ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఇది వరకు షెడ్యూల్‌ను ప్రకటించిన కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం ఎన్నికల నోటిఫికేషన్‌ను జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో మార్చి 29 నాటికి ఐదు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కానున్నాయి. వీరంతా తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్సీలే. జంగా కృష్ణమూర్తి, దువ్వారపు రామారావు, బీటీ నాయుడు, అశోక్ బాబుతో పాటు టీడీపీ సీనియర్ నాయకుడు యనమల రామకృష్ణుడు పదవీల కాలం ఈ నెలాఖరుతో ముగియనుంది. దీంతో ఈ ఐదు స్థానాలకు ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. వైఎస్‌ఆర్‌సీపీకి తగినంత సంఖ్యా బలం లేక పోవడంతో ఈ ఐదు స్థానాలు కూటమికే దక్కనున్నాయి.
ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన నాటి నుంచి ఎన్నికల కోడ్ అమలులోకి వస్తుంది. ఈ ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా అసెంబ్లీ డిప్యూటీ సెక్రెటరీ ఆర్ వనితా రాణిని నియమించగా, అసిస్టెంట్ సెక్రెటరీలైన ఆర్ శ్రీనివాసరావు, ఎం ఈశ్వరరావులను అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులుగా నియమించింది. మార్చి 20న ఈ ఐదు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 24న ఫలితాలను వెల్లడిస్తారు. మార్చి 10లోపు నామినేషన్‌లు దాఖలు చేయాల్సి ఉంటుంది. మార్చి 11న నామినేషన్ల పరిశీలన, మార్చి 13న నామినేషన్‌ల ఉపసంహరణ ఉంటుంది.
అయితే ఈ ఐదు స్థానాల్లో ఒక స్థానం జనసేనకు కేటాయించే అవకాశం ఉంది. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సోదరుడు, జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబుకు కేటాయించనున్నారు. తక్కిన వాటిల్లో పవన్ కల్యాణ్ కోసం ఎమ్మెల్యే సీట్ల సర్దుబాటులో తన పిఠాపురం సీటును త్యాగం చేసిన మాజీ ఎమ్మెల్యే వర్మకు ఎమ్మెల్సీగా ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. తక్కిన మూడు స్థానాల కోసం పెద్ద ఎత్తున పోటీ పడుతున్నారు. దీంతో ఎవరికి ఇవ్వాలనే దానిపై కూటమి పెద్దలు తర్జన భర్జనలు పడుతున్నారు. మరో వైపు తక్కిన మూడు స్థానాలు సీఎం చంద్రబాబు, లోకేష్, పవన్ కల్యాణ్‌లు ఒక అండర్‌స్టాండింగ్‌కు వచ్చినట్లు కూటమి శ్రేణుల్లో టాక్ వినిపిస్తోంది.