పీఎన్ఎస్ ఘాజీ ఆఖరి మజిలీ విశాఖలోనే..

ప్రస్తుతం పాక్ ఉన్న యుద్ధ వాతావరణం వేళ నేడు విశాఖలో మాక్ డ్రిల్;

Update: 2025-05-07 03:45 GMT

(బొల్లం కోటేశ్వరరావు, విశాఖపట్నం)


కశ్మీర్ లోని పహల్గాంలో ఉగ్రవాదులు 26 మంది పర్యాటకులను పొట్టనబెట్టుకున్న నేపథ్యంలో భారత్-పాకిస్తాన్ల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. మరికొద్ది రోజుల్లో యుద్ధం జరగవచ్చన్న ప్రచారం ఇరు దేశాల్లోనూ జరుగుతోంది. కొద్ది రోజుల నుంచి భారత్.. పాక్ యుద్ధానికి సర్వసన్నద్ధమవుతోంది. దేశ ప్రజలను ఆ దిశగా సన్నద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా దేశంలోని 259 జిల్లాల్లో యుద్ధ ప్రభావం ఉండవచ్చని అంచనా వేస్తోంది. కేటగిరి 1, కేటగిరీ 2 నగరాలనూ గుర్తించింది. కేటగిరి-1లో ఢిల్లీ, తారాపూర్ అణు కేంద్రం, కేటగిరి-2లో హైదరాబాద్, విశాఖపట్నం నగరాలను చేర్చింది. ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఒక్క విశాఖపట్నం మాత్రమే యుద్ధ ప్రభావిత నగరం జాబితాలో ఉంది. దేశవ్యాప్తంగా యుద్ధ ప్రభావిత ప్రాంతాల్లో బుధవారం యుద్ధ సన్నాహక మాక్ డ్రిల్ నిర్వహించాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో 1971లో

జరిగిన భారత్-పాక్ యుద్ధంలో ఇండియా విజయంలో పీఎన్ఎస్ ఘాజీ జలాంతర్గామిని విశాఖ సాగరతీరంలో మట్టుబెట్టడం కీలక ఘట్టం. నాటి ఘాజీ ఆఖరి మజిలీపై ఆసక్తికర కథనం ఇది..

పీఎన్ఎస్ ఘాజీ.. పాకిస్తాన్ నావికాదళంలో అత్యంత శక్తివంతమైన జలాంతర్గామి. అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో నిర్మించిన ఈ సబ్మెరైన్ అసలు పేరు యూఎస్ఎస్ డయాబ్లో. ఆ దేశ నౌకాదళంలో 1945 నుంచి 1963 వరకు సేవలందించింది. అనంతరం దీనిని 1964లో పాకిస్తాన్కు లీజుకిచ్చింది. 1965 ఇండో-పాక్ యుద్ధంలో భారత నౌకాదళానికి ఈ జలాంతర్గామి సవాలుగా మారి గుర్తింపు తెచ్చుకుంది. అనంతరం 1971లో భారత్-పాకిస్తాన్ల మధ్య మరోసారి జరిగిన యుద్ధ సమయంలో పాకిస్తాన్ ఈ ఘాజీతో భారత్ను దెబ్బతీయాలని నిర్ణయించింది. ఇందులోభాగంగా ఘాజీ సబ్మెరైనన్ను తూర్పు పాకిస్తాన్ (బంగ్లాదేశ్) విముక్తి కోసం సేవలందిస్తున్న విమాన వాహక యుద్ధనౌక ఐఎన్ఎస్ విక్రాంతన్ను, విశాఖపట్నం కేంద్రంగా ఉన్న తూర్పు నావికాదళ ప్రధాన కేంద్రాన్ని (ఈస్టర్న్ నేవల్ కమాండు) ధ్వంసం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం 1971 నవంబరు 14న కరాచీ పోర్టు నుంచి బయల్దేరిన ఘాజీ.. సుమారు 4800 కిలోమీటర్లు అరేబియా సముద్రం నుంచి హిందూ మహా సముద్రం మీదుగా ప్రయాణించి బంగాళాఖాతంలోని భారత జలాల్లోకి రహస్యంగా ప్రవేశించింది. అయితే ఘాజీ ఉనికిని ముందే పసిగట్టిన భారత నౌకాదళం వ్యూహాత్మకంగా ఐఎన్ఎస్ను విక్రాంత్ను అండమాన్ దీవులకు తరలించింది. ఆ సంగతిని తెలుసుకోలేకపోయిన ఘాజీ విశాఖ సాగర జలాల్లోకి ప్రవేశించింది. విశాఖపట్నంలోని తూర్పు నావికాదళాన్ని లక్ష్యంగా చేసుకున్న ఘాజీ దానికి సమీపంలో పొంచి ఉంది. ఘాజీ విశాఖ సముద్ర జలాల్లో నక్కి ఉన్న విషయాన్ని తెలుసుకున్న భారత నావికాదళం ఐఎన్ఎస్ రాజ్పుత్ యుద్ధనౌక ద్వారా దానిపై 1971 డిసెంబర్ 4న దాడి చేసి ముంచేసింది. అయితే పాకిస్తాన్

నావికులు పీఎన్ఎస్ ఘాజీ అడుగున ఉన్న బ్యాటరీలకు చార్జింగ్ చేస్తుండగా పేలుడు సంభవించి దానంతట అదే పేలిపోయిందన్న మరో వాదన కూడా ఉంది. ఘాజీ మునిగిపోయిన/పేలిపోయిన సమయంలో ఆ జలంతర్గామిలో 92 మంది (10 మంది అధికారులు, 82 మంది నావికులు) పాకిస్తాన్ నావికులున్నారు. వీరంతా మరణించారు. ఘాజీ శకం ముగియడంతో ఆ యుద్ధంలో పాకిస్తాన్ ఓటమి పాలైంది. ఇప్పటికీ పీఎన్ఎస్ ఘాజీ విశాఖ నగరానికి సమీపంలోని బంగాళాఖాతం అడుగున కూరుకుపోయి ఉంది. ఘాజీ మునిగిపోయిన ప్రాంతానికి సమీపంలో పాక్పై భారత్ విజయానికి చిహ్నంగా విశాఖ సాగర తీరంలో 'విక్టరీ ఎట్ సీ' పేరిట ఓ స్మారక స్థూపాన్ని ఏర్పాటు చేసి ఏటా డిసెంబర్ 4న నేవీ డే వేడుకలను అట్టహాసంగా నిర్వహిస్తున్నారు.

మాక్ డ్రిల్లో ఏం చేస్తారు?

పాక్ తో ఉద్రిక్తతలు, యుద్ధ ఛాయల నేపథ్యంలో పాకిస్తాన్ దాడులు జరిపే అవకాశాలున్నట్టు కొన్ని ప్రాంతాలను గుర్తించారు. దీనిపై దేశంలోని ఎంపిక చేసిన ప్రాంతాల్లో మాక్ డ్రిల్ నిర్వహించాలని కేంద్రం హోంశాఖ నిర్ణయించింది. ఈ మేరకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది. యుద్ధం సంభవిస్తే సముద్ర తీర ప్రాంతాలు, విమానాశ్రయాలు ఉన్న ప్రాంతాల్లో తమను తాము ఎలా రక్షించుకోవాలి? తమతో పాటు ఇతరులను ఎలా కాపాడాలి? తీసుకోవలసిన జాగ్రత్తలు తదితర అంశాలపై ప్రజలకు అధికారులు అవగాహన కల్పిస్తారు. యుద్ధ సైరన్లు మోగిస్తారు. నిజంగా యుద్ధం వస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ప్రజల కళ్లకు కడతారు.

విశాఖలోనే మాక్ డ్రిల్ ఎందుకు ?

విశాఖపట్నంలో మాక్ డ్రిల్ నిర్వహించే కేటగిరి-2 నగరాల్లో ఉంది. ఎందుకంటే? విశాఖలో తూర్పు నావికాదళ ప్రధాన కేంద్రం (ఈస్టర్న్ నేవల్ కమాండ్) ఉంది. ఇది

దేశ తూర్పు ప్రాంతంలో అత్యంత రక్షణకు ఆయువు పట్టుగా ఉంది. ఇంకా ప్రతిష్టాత్మక నేవల్ డాక్ యార్డు, నేవల్ ఆర్మ్ డ్ డిపో, హిందుస్తాన్ షిప్యార్డు, విశాఖపట్నం పోర్టు, గంగవరం పోర్టు, హెచ్పీసీఎల్, స్టీల్ ప్లాంట్, అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు మరెన్నో భారీ, మధ్య తరహా పరిశ్రమలు ఉన్నాయి. పాకిస్తాన్తో 1971లో జరిగిన యుద్ధంలో ఆ దేశం విశాఖనే లక్ష్యంగా చేసుకుని దాడులకు యత్నించింది. పీఎన్ఎస్ ఘాజీ జలాంతర్గామిని మోహరించింది. చివరకు ఇండియన్ నేవీ దానిని ఖతం చేసింది. ఇలా ఎన్నో ప్రత్యేకతలు, పరిశ్రమలు, రక్షణ రంగ స్థావరాలు వంటి వాటితో అలరారుతున్న విశాఖ మహా నగరంపై పాకిస్తాన్ సహా శత్రుదేశాల కన్ను ఎప్పుడో పడింది. అందుకే ఇలాంటి యుద్ధ వాతావరణ పరిస్థితులు తలెత్తినప్పుడు విశాఖను అప్రమత్తం చేస్తుంటారు.

Tags:    

Similar News