ఏపీలో వలంటీర్లే లేరు.. లేని వారిని ఎలా కొనసాగిస్తాం
వలంటీర్ వ్యవస్థ మీద ఆంధప్రదేశ్ శాసన మండలిలో మంటలు చెలరేగాయి. అధికార ప్రతిపక్షం మధ్య యుద్ధవాతావరణం నెలకొంది.
ఆంధ్రప్రదేశ్‌లో వలంటీర్ వ్యవస్థ లేదని కూటమి ప్రభుత్వం మరో సారి స్పష్టం చేసింది. వలంటీర్ వ్యవస్థ మీద తొలుత తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన తెలుగుదేశం, జనసేన పార్టీలు ఎన్నికల సమయంలో మాట మార్చాయి. వలంటీర్లపై తమకు ఎలాంటి ద్వేషం లేదని, అన్యాయంగా వారి పొట్టగొట్టడం తమకు ఇష్టం లేదన్నాయి. తాము అధికారంలోకి వస్తే వలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామని, వలంటీర్లకు ఇప్పుడు ఇస్తున్న దాని కంటే రెట్టింపు గౌరవ వేతనం చెల్లిస్తామని, నెలకు రూ. 10వేలు చొప్పున వలంటీర్లకు ఇస్తామని హామీ ఇచ్చారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చారు. వలంటీర్ల నియామకాలు నిబంధనల ప్రకారం జరగలేదని చెప్పారు. అందువల్ల వలంటీర్లను కొనసాగించలేమని పేర్కొన్నారు. ఇదే విషయాన్ని కూటమి ప్రభుత్వం అసెంబ్లీ సాక్షిగా మరో సారి స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో వలంటీర్ వ్యవస్థ లేదని, వలంటీర్లు పని చేయడం లేదని, ఇక దానిని ఎలా కొనసాఇస్తామని తేల్చి చెప్పారు.