వైఎస్సార్‌ సీపీ నుంచి ఒక్కొక్కరుగా...

వైఎస్సార్‌సీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు ఒక్కొక్కరు దూరంగా వెళుతున్నారు. కొందరు వేరే పార్టీల్లో చేరుతున్నారు. మరికొందరు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు.

Update: 2024-01-06 09:56 GMT
YSRCP Flog

తన పిల్లలను తానే మింగిన పాములా వైఎస్సార్‌సీపీ తయారైంది. గుడ్లు పగిలి పిల్లలైన తరువాత పాముకు కళ్లు నానరావట, అప్పుడు ఆహారం దొరక్క పాము తన పిల్లలను తానే తింటుందట. ఇప్పుడు వైఎస్సార్‌సీపీలో జరుగుతున్న పరిణామాలు ఇలాగే ఉన్నాయని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇది నిజమేనని ఎవరినడిగినా చెబుతున్నారు. ఎందుకంటే అభ్యర్థుల ఎంపిక విషయంలో ఒకరికొకరికి మధ్య నిప్పు రాజుకోవడమే కాకుండా పార్టీ పెద్దలకు కూడా తలనొప్పిగా మారింది. ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయానికి పిలిపించి ప్రభుత్వ ప్రజా వ్యవహారాల సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ ఐఏఎస్‌ అధికారి ధనుంజయ్‌రెడ్డి ద్వారా టిక్కెట్లు ఇవ్వలేకపోతున్నామని చెప్పిస్తున్నారు. లేదంటే మిమ్మల్ని మీరు ఉన్న నియోజకవర్గం కాకుండా పలానా నియోజకవర్గానికి మార్చామని చెబుతున్నారు. దీనిని కొందరు ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు జీర్ణించుకోలేకపోతున్నారు.

రాజీనామాలు, పార్టీ మారడాలు
అనకాపల్లి ఎమ్మెల్యే, మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నారు. పలువురు నేతలు రాజీనామాలు చేయడం అధికార పార్టీని కలిచివేస్తోంది. ఇప్పుడు తాజాగా మచిలీపట్నం లోక్‌సభ ఎంపీ బాలశౌరి టీడీపీలోకి జంప్‌ చేయబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. గుంటూరు జిల్లాలో మంచి పట్టు ఉన్న సీనియర్‌ నాయకుడు బాలశౌరి. అంతకు ముందు 2004లో దివంగత వైఎస్‌ఆర్‌ నాయకత్వంలో కాంగ్రెస్‌ పార్టీ నుంచి తెనాలి ఎంపీగా పనిచేశారు.
ఆయన వైఎస్సార్‌సీపీని వీడితే పెద్ద ఎదురుదెబ్బ తప్పదని పలువురు వైఎస్సార్‌సీపీ నాయకులు భావిస్తున్నారు. నివేదికల ప్రకారం, పలువురు సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఆశావహులు తమ విధేయతను మార్చుకోవాలని ఆలోచిస్తున్నారు. మరికొందరు కాంగ్రెస్‌లో చేరి వైఎస్‌ షర్మిలతో కలిసి ప్రయాణించే అవకాశం ఉంది.
తాజాగా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీసీ రామచంద్రయ్య, ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్‌లు అధికార పార్టీని వీడారు. కాగా ఎమ్మెల్యేలు వుండవల్లి శ్రీదేవి (తాడికొండ అసెంబ్లీ), మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి (ఉదయగిరి), ఆనం రామనారాయణరెడ్డి (వెంకటగిరి), కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి (నెల్లూరు రూరల్‌) పార్టీని వీడారు.
తిరుగుబాటు బావుటా ఎగరేసిన కాపు రామచంద్రారెడ్డి
నిన్న సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లి వచ్చిన రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి వైఎస్సార్‌సీపీని వీడుతున్నట్లు ప్రకటించారు. సజ్జల రామకృష్ణారెడ్డి నాకు టిక్కెట్‌ లేదని చెప్పారని, ఇది దారుణమని తాడేపల్లిలోని సీఎం ఆఫీసు వద్ద చెప్పారు. రాయదుర్గం నుంచి నా భార్య, కళ్యాణదుర్గం నుంచి నేను పోటీ చేస్తున్నామని ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా గెలుపు మాదేనని రామచంద్రారెడ్డి అన్నారు. నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు కూడా పార్టీని వీడనున్నారని సమాచారం. ఆయనకు కూడా నర్సరావుపేట టిక్కెట్‌ లేదని ముఖ్యమంత్రి తేల్చి చెప్పారు. వేరే నియోజకవర్గాల్లో కావాలంటే ఇస్తానన్నారు. హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్, జగ్గంపేట ఎమ్మెల్యే చంటిబాబులు కూడా వైఎస్సార్‌సీపీని వీడనున్నారు. బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణకు నియోజకవర్గం మార్చారు. విజయనగరం జిల్లా రాజాం ఎమ్మెల్యే కంభాల జోగులును ఈస్ట్‌ గోదావరి జిల్లా పాయకరావుపేటకు మార్చారు. ఆయన కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. జగ్గంపేట ఎమ్మెల్యే చిట్టిబాబుకు సీటు లేదని చెప్పారు. దీంతో ఆయన కూడా పార్టీకి దూరం కానున్నారు. ఇక చిత్తూరు జల్లా పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్‌ బాబు కూడా వైఎస్సార్‌సీపీకి దూరం కానున్నారు. ఆయనకు కూడా టిక్కెట్‌ ఇవ్వడం లేదు. ఇప్పటికే దాదాపు 20 మంది ఎమ్మెల్యేలు వైఎస్సార్‌సీపీని వీడేందుకు నిర్ణయించుకున్నారని సమాచారం.
Tags:    

Similar News