పవన్ కల్యాణ్ శ్రీరామ నవమి శుభాకాంక్షలు ఎలా చెప్పారంటే
ప్రజలందరికీ శ్రీరామనవమి శుబాకాంక్షలు అంటూ ఎవరైనా చెబుతారు. కానీ పవన్ కల్యాణ్ స్టైలే వేరు.;
By : The Federal
Update: 2025-04-06 08:57 GMT
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్టైలే వేరు. పండుగ పర్వదినాల సందర్భంగా శుభాకాంక్షలు చెప్పడంలో ఆయన రూటే సపరేటు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్‌లు సాదాసీదాగా శ్రీరామ నవమి శుభాకాంక్షలు చెబితే.. పవన్ కల్యాణ్ మాత్రం తనదైన స్టైల్‌లో శుభాకాంక్షలు తెలిపారు. వాల్మీకి రామాయణంలోని ఓ శ్లోకాన్ని ఉటంకిస్తూ.. శుభాకాంక్షలు చెప్పారు. లక్షలాది పుస్తకాలు చదివానని చెప్పిన పవన్ కల్యాణ్.. తనకు తెలుగు, తమిళం, హిందీ, ఇంగ్లీషుతో పాటు సంస్కృతం కూడా తెలుసు అన్నట్లు తక్కిన వారి కంటే భిన్నంగా తన శుభాకాంక్షలు చెప్పి, ఔరా అనిపించుకున్నారు. దీంతో పాటుగా గత ప్రభుత్వాన్ని కూడా విమర్శలు గుప్పించారు. అంతటితో ఊరుకోలేదు. అలా శ్రీరామనవమి శుభాకాంక్షలు చెప్పడం తన బాధ్యతగా చెప్పుకున్నారు.
ఎలా చెప్పారంటే..
‘రామో విగ్రహవాన్ ధర్మః’ – సకల సుగుణాలు, ధర్మం, న్యాయం మూర్తీభవించితే అది సాక్షాత్ రాముని రూపమే అవుతుంది. సకల ప్రాణికోటికి హితవు కలిగించే సాధు మూర్తి శ్రీరాముడు... తిరుగులేని పరాక్రమశీలి అని శ్రీమద్వాల్మీకి రామాయణం చెబుతోంది. సత్యం, ధర్మం, న్యాయం అనేవాటిని ఒక పాలకుడు ఎంత నిబద్ధతతో పాటించాలో శ్రీరామచంద్రుడి నుంచి పాలకులు గ్రహించాలి. దశరథ తనయుడు ధర్మానికి ప్రతీక కాబట్టే... త్రేతా యుగం నుంచి నేటి కలియుగంలోనూ రామ నామం వాడవాడలా మారుమోగుతూ ఉంది.
శ్రీరామ నవమి సందర్భంగా హైందవ ధర్మాన్ని విశ్వసించే ప్రతి ఒక్కరికీ భక్తిపూర్వక శుభాకాంక్షలు. ఏ గొప్ప గుణం గురించి చెప్పాలన్నా.. శ్రీరాముడినే ప్రతిరూపంగా చూపిస్తుంది మన భారతీయ సమాజం. అటువంటి శ్రీరాముడి విగ్రహానికి శిరచ్ఛేదం చేశారు గత పాలకుల హయాంలో. ఆ దుష్ట పాలనకు ప్రజలు ఎంతో ధర్మబద్ధంగా చరమగీతం పాడారు. శ్రీరాముడి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలపై ఎల్లవేళలా ఉండాలని ప్రార్థిస్తున్నాను. వాల్మీకి మహర్షి చెప్పిన రామ రాజ్య పాలన ఆవిష్కృతం చేసే దిశగా మా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోందని ఈ పర్వదినం సందర్భంగా చెప్పడం ఒక బాధ్యతగా భావిస్తున్నాను. అంటూ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ తన శుభాకాంక్షల సందేశాన్ని వెల్లడించారు.
ఇక సీఎం చంద్రబాబు నాయుడు ఎలా చెప్పారంటే..
శ్రీరామనవమి శుభాకాంక్షలు అని చెబుతూ.. ప్రజల మాటకు విలువనిచ్చిన పాలనతో ఆనాడే ప్రజాస్వామ్య ప్రాధాన్యతను శ్రీరాచంద్రుడు తెలియజేశారని, పాలకుడు ఎప్పుడు ప్రజలకు ఆదర్శనీయుడుగా ఉండాలని, తన పాలన ద్వారా తెలియజేసిన సుగుణాభిరాముని చరిత్రను ఈ సందర్భంగా మననం చేసుకుందాం. వాడవాలా జరిగే నవమి వేడుకలు గ్రామాల్లో కొత్త శోభను ఆవిష్కరించాలి. ఆ సీతారాముల దయతో మీ ఇంటిల్లిపాది ఆనంద, ఆరోగ్యాలతో చల్లగా ఉండాలని కోరుకుంటున్నట్లు సీఎం చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలిపారు.
మంత్రి లోకేష్ ఎలా చెప్పారంటే..
ధర్మబద్ద జీవనానికి నిలువెత్తు నిదర్శనం శ్రీరాముడు. పట్టాభిశక్తుడిగా ప్రజలకు నిలిచారు. ధర్మ మార్గంలో నడిచిన వారికి శ్రీరాముడు ఎల్లప్పుడూ తోడుగా ఉంటారు. ఈ శ్రీరామ నవమి అందరికీ సుఖసంతోషాలను, ఆరోగ్యాన్ని అందించాలని, శ్రీరామ చంద్రమూర్తి దయ మీ కుటుంబాలపై ఉండాలని ఆకాంక్షిస్తూ.. శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలిపారు.