గిరిజన ప్రాంతాల పర్యటనకు పవన్ కల్యాణ్

ఏజెన్సీ ఏరియాలో రెండు రోజులు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ పర్యటన చేయనున్నారు.;

Update: 2025-04-07 05:31 GMT

పిఠాపురం అసెంబ్లీ నియోజక వర్గంలో ఇటీవల చేపట్టిన పలు కార్యక్రమాల ప్రారంభోత్సవాలకు సోదరుడు, ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబును పంపిన ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ గిరిజన ప్రాంతాల పర్యటనకు మాత్రం స్వయంగా చేయనున్నారు. సోమవారం గిరిజన ప్రాంతాల పర్యటనకు పయనమయ్యారు. పవన్‌ కల్యాణ్‌ తన పర్యటనలో భాగంగా ‘అడవి తల్లి బాట’ పేరుతో గిరిజనులతో నిర్వహించే సూర్య నమస్కారాల కార్యక్రమానికి హాజరు కానున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో పవన్‌ కల్యాణ్‌ రెండు రోజుల పాటు పర్యటించనున్నారు.

అల్లూరి సీతారామరాజు జిల్లాలో రెండు రోజుల పర్యటన నిమిత్తం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు పవన్‌ కళ్యాణ్‌ సోమవారం ఉదయం విశాఖ విమానాశ్రాయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి నేరుగా డుంబ్రిగూడ మండలం, పోతంగి పంచాయతీ పెదపాడు గ్రామానికి బయలుదేరారు. డుంబ్రిగూడ మండలం, పెదపాడులో గిరిజన ఆవాసాల సంరక్షణ, ముఖాముఖి కార్యక్రమాల్లో పాల్గొంటారు. గిరిజన గ్రామాల అభివృద్ధి నిమిత్తం చేపట్టిన ‘అడవి తల్లి బాట’ కార్యక్రమానికి పెదపాడు గ్రామంలో పవన్‌ కళ్యాణ్‌ శ్రీకారం చుట్టనున్నారు. అందులో భాగంగా గిరిజన గ్రామాల మధ్య అనుసంధానం చేసే రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. అనంతరం డుంబ్రిగూడ ఆశ్రమ పాఠశాలలో జరిగే బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. తర్వాత గిరిజన బిడ్డలతో సూర్య నమస్కారాలు కార్యక్రమంలో పాల్గొంటారు. దాదాపు 20వేల మంది గిరిజన యువతీ యువకులతో గిన్నీస్‌ బుక్‌ రికార్డు కోసం 108 సూర్య నమస్కారాల కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. చాపరాయి జలవిహారిలో మత్సా్యలమ్మను దర్శించుకుంటారు. సోమవారం రాత్రికి అరకులోయ చేరుకుని అక్కడి ఏపీటీడీసీ గెస్ట్‌ హౌస్‌లో బస చేస్తారు.
రెండో రోజు మంగళవారం కూడా పవన్‌ కల్యాణ్‌ పర్యటన కొనసాగుతుంది. అరకు మండలం సుంకరమిట్ట ప్రాంతాల్లో కాఫీ తోటలను సందర్శిస్తారు. ఇదే గ్రామంలో నిర్మించిన ఉడెన్‌ వంతెనను పవన్‌ కల్యాణ్‌ ప్రారంభించనున్నారు. తర్వాత విశాఖపట్నంకు పయనమవుతారు. విశాఖలోని ఇందిరాగాంధీ జూలాజికల్‌ పార్కులో జరిగే పర్యాటక అభివృద్ధి, ఎకోటూరిజం డెవలప్‌మెంట్‌కు చేపట్టాల్సిన కార్యక్రమాలు వంటి పలు అంశాల మీద అధికారులతో సమీక్షలు నిర్వహించనున్నారు. అయితే ఉప ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా సోమవారం చాపరాయి జల విహారిలో పర్యాటకులకు ప్రవేశాన్ని అధికారులు రద్దు చేశారు.
అంతకు ముందు విమానాశ్రయంలో విశాఖ జిల్లా కలెక్టర్‌ ఎంఎన్‌ హరేంద్రప్రసాద్, ఇతర ఉన్నతాధికారులు, యలమంచిలి శాసన సభ్యులు సుందరపు విజయ్‌ కుమార్, రాష్ట్ర ఎంఎస్‌ఎంఈ కార్పోరేషన్‌ ఛైర్మన్‌ తమ్మిరెడ్డి శివశంకర్, పార్టీ పీఏసీ సభ్యులు కోన తాతారావు, జనసేన ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్యనారాయణ, పార్టీ నేతలు డాక్టర్‌ సందీప్‌ పంచకర్ల, పసుపులేటి ఉషాకిరణ్, బోడపాటి శివదత్, భీశెట్టి వసంత లక్ష్మి తదితరులు పవన్‌ కల్యాణ్‌కు ఘన స్వాగతం పలికారు. డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్‌ దినేశ్‌కుమార్, జాయింట్‌ కలెక్టర్‌ అభిషేక్‌ గౌడ, సబ్‌ కలెక్టర్‌ శౌర్యమన్‌ పటేల్, జిల్లా ఎస్పీ అమిత్‌ బర్దార్‌లు çస్వయంగా పర్యవేక్షించనున్నారు.
Tags:    

Similar News