ఆంధ్రాలో రాజకీయ చోద్యం...
విజయవాడ విద్యుత్ ధర్నాలో పాల్గొనవద్దంటూ కార్మిక నేతలకు పోలీసులు నోటీసులు జారీ చేస్తున్నారు.
By : The Federal
Update: 2024-02-11 07:40 GMT
ఫిబ్రవరి 12వ తేదీన యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ (సిఐటియు అనుబంధం) ఆధ్వర్యంలో విజయవాడలో చేయ తలపెట్టిన ధర్నాకు హాజరు కావద్దని తిరుపతి అలిపిరి పోలీసులు సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి, మరి కొందరు నేతలు, విద్యుత్ కార్మికులకు ఆదివారం నాడు నోటీసులు అందజేశారు. ఇది అప్రజాస్వామికమని వేరే చెప్పనవసరం లేదు. ఎందుకంటే సమ్మె ప్రాథమిక హక్కు. ఈ హక్కును కాలరాస్తే ఎలా అంటున్నారు కందారపు మురళి.
ఈ విషయం మీద మురళి స్పందించారు. విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులకు ఎందుకు సమ్మెచేస్తున్నారో ఆయన వివరించారు. 2019 ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి ఈ కార్మకులకు ఇచ్చిన హామీలు అమలు చేయకపోగా తాజా పి ఆర్ సి ప్రకారం వేతనాలు కూడా పెంచలేదు. కాంట్రాక్ట్ కార్మికుల పట్ల తీవ్రమైన వివక్షను ప్రభుత్వం ప్రదర్శిస్తున్నదని ఆయన విమర్శించారు.
వాచ్ మెన్ నుంచి షిఫ్ట్ ఆపరేటర్లు గా ప్రమోషన్ పొందిన కార్మికుల విషయంలోనూ ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తున్నదని మురళి అన్నారు.
ప్రమోషన్ ఇచ్చి ఆపరేటర్లు గా ఉద్యోగాల్లోకి తీసుకున్న విద్యుత్ సంస్థ పాత ఆపరేటర్లకి ఒక వేతనం కొత్త ఆపరేటర్లకి మరో వేతనం అందిస్తూ వివక్ష చూపుతున్నదని ఆరోపించారు.
విద్యుత్ సంస్థలో వేలాదిమంది కార్మికులు కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్, మీటర్ రీడర్ లు, స్టోర్ హమాలీలు వంటి రకరకాల పేర్లతో శ్రమ దోపిడికి గురిఅవుతున్నారని కందారపు మురళి ఆరోపించారు.
సమస్యలు పరిష్కరించాలని, ఆందోళనలకు పిలుపు ఇచ్చినప్పుడల్లా తీవ్ర నిర్బంధాన్ని ప్రయోగించడం ప్రభుత్వంకు ఆనవాయితీగా మారిందని ఆఖరికి ఎన్నికల సమయంలోనూ ప్రభుత్వం తన వైఖరి మార్చుకోకుండా అ ప్రజాస్వామిక పద్ధతులకు పాల్పడుతూ నోటీసులు ఇవ్వడం అన్యాయమని కందారపు మురళి విమర్శించారు.
ఎవరెన్ని ఆటంకాలు కల్పించినా విజయవాడలో ధర్నా చౌక్ వద్ద వేలాది మందితో విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులు తమ నిరసన తెలియజేస్తారని సమస్యల పరిష్కారం కై పెద్ద ఎత్తున పోరాటాన్ని కొనసాగిస్తారని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు