ఈవీఎంల విధ్వంసం కేసులో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి అరెస్ట్
పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరులు, మరికొందరు అనుచరులు తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా కంది పట్టణంలో ఉన్నట్టు తెలియడంతో పోలీసులు అక్కడికి వెళ్లారు.
ఆంధ్రప్రదేశ్ లోని పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గ ప్రస్తుత ఎమ్మెల్యే, వైసీపీ అభ్యర్ధి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఏపీ పోలీసులు హైదరాాబాద్ శివార్లలోని ఇస్నాపూర్ వద్ద అరెస్ట్ చేశారు. పోలింగ్ సందర్భంగా ఈనెల 13న ఏడు పోలింగ్ కేంద్రాలలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు (ఈవీఎంలు), వీవీప్యాట్లను ధ్వంసం, ఓ మహిళా ఓటరును ధూషించడం, మరో ఓటరుపై చేయి చేసుకోవడం వంటి ఆరోపణల నేపథ్యంలో ఆయన్ను అరెస్ట్ చేసినట్టు పోలీసులు చెబుతున్నారు.
రాష్ట్ర ఎన్నికల సంఘం సీఇవో ముఖేశ్ కుమార్ మీనా రాష్ట్ర డీజీపీకి ఇచ్చిన ఆదేశాల మేరకు ఆయన్ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు హైదరాబాద్ చేరుకున్నారు. ఆయన, ఆయన అనుచరులు ఉంటున్న నివాసాలపై పోలీసులు నిఘా పెంచారు. సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ వద్ద అరెస్ట్ చేసినట్టు పోలీసులు చెప్పారు.
ఆయన అరెస్ట్ కు ముందు ఏమి జరిగిందంటే...
మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామ కృష్ణారెడ్డిని తక్షణమే అరెస్టు చేయాలని ఎన్నికల సంఘం ఆదేశించింది.ఈవీఎంలు పగలగొట్టడాన్ని ఈసీ తీవ్రంగా పరిగణించింది. పోలింగ్ రోజు ఎమ్మెల్యే పిన్నెల్లి తన అనుచరులతో కలిసి పాల్వాయి గేటు పోలింగ్ బూత్ లోకి దూసుకెళ్లారు. ఈవీఎంను నేలకేసికొట్టి ధ్వంసం చేసి వీరంగం సృష్టించారు. ఎమ్మెల్యేను అడ్డుకోబోయిన ఓ పోలింగ్ ఏజెంట్ ను పిన్నెల్లి వేలు చూపి బెదిరించడం, ఆ వీడియోలు ఆలస్యంగా బయటకు రావడంతో ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. పిన్నెల్లిని ఎందుకు అరెస్టు చేయలేదని డీజీపీని ప్రశ్నించింది. తక్షణం అరెస్టు చేయాలని ఆదేశించింది. దీంతో పోలీసులు లుకౌట్ నోటీసులు ఇచ్చారు.
పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరులు, మరికొందరు అనుచరులు హైదరాబాద్ శివార్లలోని సంగారెడ్డి జిల్లా కంది పట్టణంలో ఉన్నట్టు సమాచారం రావడంతో పోలీసులు అక్కడికి వెళ్లారు. రెండు మూడు బృందాలుగా విడిపోయి గాలిస్తున్న తరుణంలో పిన్నెల్లి సోదరులు పారిపోయి ఓ గెస్ట్ హౌస్ లో దాక్కున్నట్టు తెలిసింది. అదే సమయంలో ఆయన కారు డ్రైవర్ ను అరెస్ట్ చేశారు. పోలీసుల అదుపులో పిన్నెల్లి డ్రైవర్, అనుచరులు ఉన్నారంటున్నారు. పిన్నెల్లి కోసం ఏపీ, తెలంగాణ స్పెషల్ టాస్క్ ఫోర్ రంగంలోకి దిగింది. హైదరాబాద్ పటాన్ చెరు పోలీసుల సహకారంతో. సంగారెడ్డి జిల్లా కంది వద్ద పిన్నెల్లి కారును స్వాధీనం చేసుకున్నారు. కార్లో పిన్నెల్లి సోదరులకు చెందిన ఓ ఫోన్ దొరికినట్టు తెలుస్తోంది. .
పిన్నెల్లి సోదరులు విదేశాలకు పారిపోయారంటూ వదంతులు
పిన్నెల్లి విదేశాలకు పారిపోయేందుకు ప్రయత్నించారంటూ వదంతులు కూడా వ్యాపించాయి. దీంతో అన్ని ఎయిర్‌పోర్టులను ఏపీ పోలీసులు అప్రమత్తం చేశారు. లుకౌట్ నోటీసులు జారీ చేశారు. భారతీయ శిక్షాస్మృతి (ఐపీసీ), ప్రజాప్రాతినిధ్య చట్టం (ఆర్) ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం (పీడీపీపీ) చట్టాల పరిధిలో పది సెక్షన్ల కింద పిన్నెల్లిపై కేసులు నమోదు చేశారు. ఐపీసీ కింద 143, 147, 448 427, 353, 452, 120బి సెక్షన్ల కింద కేసులు, పీడీ పీపీ చట్టం కింద మరో కేసు నమోదు, ఆర్పీ చట్టం 131, 135 సెక్షన్లతో కేసులు నమోదు నమోదు చేశారు. ఈనెల 20నే పిన్నెల్లిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
పిన్నెల్లి సోదరులు ఓ మీడియా వ్యాన్ లో పారిపోయారంటూ గుంటూరు జిల్లా అంతటా వదంతులు వ్యాపించాయి. పోలీసులు వీరికి సాయం చేశారంటూ టీడీపీ ఆరోపించింది. ఓ ప్రముఖ మీడియా ఛానల్ కి చెందిన సీనియర్ జర్నలిస్ట్, ప్రజెంటర్ వీరికి సాయపడినట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఏపీ సరిహద్దులు దాటుతున్నప్పుడు ఆ విలేఖరి పక్కనే ఉన్నట్టు చెబుతున్నారు.
పోలింగ్ రోజు ఏపీలో మొత్తం 9 చోట్ల ప్రత్యేకించి ఒక్క మాచర్లలోనే 7 చోట్ల ఈవీఎంలు ధ్వంసం చేశారని ఎన్నికల ప్రధానాధికారి ఎంకే మీనా చెబుతున్నారు. 10 సెక్షన్ల కింద మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లిపై కేసులు పెట్టారు. ఈ సెక్షన్ల కింద కేసులు రుజువైతే ఏడేళ్ల వరకు పిన్నెల్లికి శిక్ష పడే అవకాశం ఉంది. ఎవరినీ వదిలే ప్రసక్తి లేదని మీనా చెప్పారు. పిన్నెల్లి విషయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
నిలదీసిన మహిళా ఓటరు...
పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంను పగలగొట్టే సమయంలో నిలదీసిన ఓ మహిళను కూడా ఆయన తిట్టినట్టు వీడియోలు బయటకు వచ్చాయి. ఆ మహిళను ఆయన బెదిరిస్తున్న దృశ్యం అందులో ఉంది. మరోవైపు, మాచర్లలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆగడాలపై తక్షణమే స్పందించాలంటూ టీడీపీ, ఇతర ప్రజాసంఘాలు డిమాండ్ చేస్తూ ట్వీట్లు చేస్తున్నాయి. పాల్వాయి గేటు వద్ద పోలింగ్ కేంద్రంలో ఈవీఎంను పగలగొట్టడానికి ప్రయత్నించినపుడు ఎమ్మెల్యేను అడ్డుకున్న టీడీపీ పోలింగ్ ఏజెంట్ నంబూరి శేషగిరిరావును వైసీపీ నేతలు బెదిరిస్తున్నారంటూ మరికొందరు ఫిర్యాదు చేశారు.
మరో వైపు కేంద్ర ఎన్నికల సంఘం ఈవీఎంల ధ్వంసంపై చాలా సీరియస్ గా ఉండడంతో పిన్నెల్లిని ఎలా అయినా అరెస్ట్ చేయాలని పోలీసులకు ఆదేశాలు అందాయి. ఈనేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన మంగళవారం సాయంత్రం ఐదు లోపు పోలీసులు మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లిని అరెస్ట్ చేయడం గమనార్హం.