సీనియర్ ఐపీఎస్‌ సునీల్‌కుమార్‌ను వెంటాడుతున్న రఘురామకృష్ణంరాజు

తన అరెస్టు ఎపిసోడ్‌లో కథ, స్క్రీన్‌ప్లే, డైరెక్షన్‌ అంతా సునీల్‌కుమార్‌దే. సాక్షులను బెదిరిస్తున్నారు. తక్షణమే అరెస్టు చేయాలని రఘురామకృష్ణంరాజు సీఎంకు లేఖ.

Update: 2024-09-30 05:45 GMT

సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి, మాజీ సీఐడీ చీఫ్‌ పీవీ సునీల్‌కుమార్‌ను ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు వెంటాడుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోను ఆయనను అరెస్టు చేయించాలని కంకణం కట్టుకున్నారు. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే కావడంతో ఎలాగైనా పీవీ సునీల్‌కుమార్‌ను అరెస్టు చేయించాలనే పట్టుదలతో ఉన్నారు.

తన అరెస్టు ఎపిసోడ్‌కి కథ, స్క్రీన్‌ప్లే, డైరెక్షన్‌ అన్నీ తానై పోషించాడని బహిరంగంగానే ఆయన గతంలో ఆరోపణలు చేశారు. తనను అరెస్టు చేయడం దగ్గర నుంచి చిత్ర హింసలకు గురి చేయడం వరకు సునీల్‌కుమార్‌ పర్యవేక్షణలోనే తంతు సాగిందని పలుమార్లు ఆరోపించారు. ఆ మేరకు రఘురామకృష్ణం రాజు గుంటూరు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఆ మేరకు గుంటూరు పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేయడానికి ఒక ప్రత్యేక బృందాన్ని కూడా ఏర్పాటు చేశారు. శర వేగంగానే విచారణ కొనసాగుతోంది.
సీఐడీ మాజీ చీఫ్‌ పీవీ సునీల్‌కుమార్‌ను వెంటనే పోలీసులు అదుపులోకి తీసుకోవాలని సీఎం చంద్రబాబుకు రఘురామకృష్ణంరాజు లేఖ రాయడంతో మరో సారి ఇది చర్చనీయాంశంగా మారింది. తన కేసులోని సాక్షులను బెదిరిస్తున్నారని, ఈ నేపథ్యంలో సునీల్‌కుమార్‌ను వెంటనే అరెస్టు చేయాలని లేఖలో కోరారు.
గత జగన్‌ ప్రభుత్వ హయాంలో తనపై జరిగిన కస్టోడియల్‌ టార్చర్‌ కేసు, దానికి సంబంధించి చేపట్టిన దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన వివరాలు, సాక్షులు ఇచ్చిన వాంగ్మూలాలు తదితర వివరాలతో ఈ నెల 27న తెలుగు దినపత్రికలో కథనం ప్రచురితమైంది. ఈ నేపథ్యంలో తనను ఎక్కడ అరెస్టు చేస్తారో అని భావించిన పీవీ సునీల్‌కుమార్‌ ఆ మరుసటి రోజు నుంచి సాక్షులుగా ఉన్న పోలీసులు, వైద్యులను బెదిరించడం చేస్తున్నారని, దీంతో సాక్షులు ప్రభావితమయ్యా అవకాశం ఉందని, దీంతో సునీల్‌కుమార్‌ను వెంటనే పోలీసులు కస్టడీలోకి తీసుకోవాలని లేఖలో కోరారు. తాను గుంటూరు ఎస్పీకి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నాటి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, మెడికల్‌ రిపోర్టు ఇచ్చిన డాక్టర్‌ ప్రభావతి, విచారణ అధికారిగా వ్యవహరించిన విజయ్‌పాల్, నాటి నిఘా చీఫ్‌గా పని చేసిన పీ సీతారామాంజనేయులు, సీఐడీ చీఫ్‌గా వ్యవహరించిన పీవీ సునీల్‌కుమార్‌పై జూలై 11న పట్టాభిపురం పోలీస్‌ స్టేషన్‌లో హత్యాయత్నం కేసు నమోదైంది. ఈ కేసులో నాలుగో నిందితుడుగా ఉన్న విజయ్‌పాల్‌ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారని, ఇప్పుడు సాక్షుల్ని సునీల్‌కుమార్‌ బెదిరించడం చేస్తున్నారని, అందుకే సునీల్‌కుమార్‌ను తక్షణమే అరెస్టు చేయాలని ఆదివారం సీఎంకు రాసిన లేఖలో రఘురామకృష్ణంరాజు కోరారు.
Tags:    

Similar News