టుంకూరు నుంచి రఘువీరా

కర్నాటకలోని టుంకూరు పార్లమెంట్ నుంచి ఏపీసీసీ మాజీచీఫ్ నీలకంఠపురం రఘువీరారెడ్డి పోటీ చేయనున్నారా? అవుననే అంటున్నారు కాంగ్రెస్ ముఖ్య నాయకులు కొందరు.

Update: 2024-01-30 07:40 GMT
ఎపిసిసి మాజీ చీఫ్ ఎన్ రఘువీరారెడ్డి

కర్నాటక రాష్ట్రంలోని టుంకూరు పార్లమెంట్ స్థానం నుంచి వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఏపీసీసీ మాజీచీఫ్, ఏపీ రాష్ట్ర మాజీ మంత్రి, నీలకంఠపురం రఘువీరారెడ్డి పోటీ చేసేందుకు రంగం సిద్దమైంది. ఈమేరకు కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. కాంగ్రెస్ పార్టీ రఘువీరారెడ్డి సేవలు వినియోగించుకోవాలంటే ఖచ్చితంగా పార్లమెంట్ సభ్యునిగా వుండటం అవసరమని కాంగ్రెస్ భావించింది. అందులో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. మడకశిర నుంచి టుంకూరు వంద కిలోమీటర్లలోపు వుంటుంది. అలాగే టుంకూరు నుంచి బెంగళూరు 60 కిలో మీటర్లు మాత్రమే వుంటుంది. రాయదుర్గం నుంచి టుంకూరుకు ప్రస్తుతం రైల్వేలైన్ కూడా వేస్తున్నారు. ఇలా రాయదుర్గం, కళ్యాణదుర్గంలతో కర్నాటకలోని టుంకూరుకు సంబంధాలు ఉన్నాయి. ఎక్కువగా ఏ అవసరాలు వచ్చినా టుంకూరు ప్రాంతానికి ఏపీ ప్రజలు వెళుతుంటారు. ఏపీ, కర్నాటక ప్రజలకు ఉపయోగపడే ఒక మంచి నియోజకవర్గం. అందువల్ల ఈ నియోజకవర్గం అయితే బాగుంటుందనే ఆలోచన కాంగ్రెస్ అధిష్టానం చేసినట్లు సమాచారం.

కర్నాటకలో రఘువీరాకు మంచి గుర్తింపు

రఘువీరారెడ్డికి కన్నడ కూడా వచ్చు. ఆయన భార్యది కూడా కర్నాటక రాష్ట్రమే కావడం విశేషం. అన్నివిధాల టుంకూరు నియోజకవర్గం ఉపయోగంగా వుంటుందని కాంగ్రెస్ అధిష్టానం భావించిన సరైన నిర్ణయం తీసుకుందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ఒక మంచి నాయకుడికి మంచి అవకాశం కల్పించడం కూడా ఎంతో ముఖ్యమని దీనిని బట్టి అర్థమైందని పలువురు కాంగ్రెస్ అభిమానులు అంటున్నారు. కాంగ్రెస్ కు పీసీసీ చీఫ్ గా షర్మిల రావడంతో కాంగ్రెస్ లో జోష్ పెరిగింది. దాదాపు రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో షర్మిల సుడిగాలి పర్యటన చేశారు. త్వరలోనే అభ్యర్థులను ప్రకటించే కార్యక్రమంలో ఉన్నారు. కర్నాటక ఎన్నికల్లో పార్లమెంట్ స్థానాలు ఎక్కువగా కాంగ్రెస్ దక్కించుకునే అవకాశం వుందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.

కాంగ్రెస్ అధిష్టానం నుంచి మంచి గుర్తింపు

రఘువీరారెడ్డి మడకశిర ఒకసారి, కళ్యాణదుర్గం నుంచి రెండు సార్లు, ఎమ్మెల్యేగా గెలుపొందారు. వ్యవసాయ, రెవెన్యూ శాఖల మంత్రిగా పనిచేసి మంచి పేరు సంపాదించారు. వైఎస్సార్, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డిల మంత్రివర్గాల్లో పనిచేశారు. 2014లో రఘువీరా ఏపీసీసీ అధ్యక్షునిగా పనిచేశారు. ఆసమయంలో కర్నటక రాష్ట్రంలోనూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మంచి వాక్చాతుర్యం ఉంది. రాజకీయ నాయకునిగా మంచి పేరు సంపాదించుకున్నారు. నిజాయితీ పరునిగా పేరు తెచ్చుకున్నారు. రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్ తోనే ప్రయాణం సాగించారు. ఎవ్వరూ తోడు రాకున్నా పీసీసీ అధ్యక్షునిగా పనిచేసి అధిష్టానం వద్ద మంచి పేరు సంపాదించారు.

ఏపీలో కాంగ్రెస్ కు మంచి భవిష్యత్

ఆంధ్రప్రదేశ్ లో రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ కు మంచి భవిష్యత్ ఉందని చెప్పొచ్చు. షర్మల సోమవారం కర్నూలు, కడపల్లో నిర్వహించిన సభల్లో దూకుడు పెంచారు. సాక్షిలో నాకు సగం వాటా వుంది. మా నాన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి మా అన్నకు, నాకు సమాన వాటా వుందని చెప్పారు. ఇప్పుడు నాపైనే సాక్షిలో పిచ్చిరాతలు రాస్తున్నారు. నేను రాజశేఖర్ రెడ్డి బిడ్డను వైఎస్ షర్మిల రెడ్డిని, నేను పుట్టింటి నుంచే రాజకీయం చేస్తా. అందరం జమ్మలమడుగు ఆస్పత్రిలోనే పుట్టాం. ఈ రాష్ట్రం నాది అంటూ ఏం పీక్కుంటారో పీక్కోండి. నేను ఇక్కడే వుంటానన్నప్పుడు కడప ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. దీనిని బట్టి రాష్ట్రంలో కాంగ్రెస్ కు భవిష్యత్ ఉందని చెప్పోచ్చు. ప్రతి సభలోనూ రఘువీరారెడ్డి, తులసిరెడ్డి, ఆళ్ల రామకృష్టా రెడ్డి, జేడీ శీలం, కొప్పుల రాజు వంటి ముఖ్యనాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కూడా రఘువీరారెడ్డి టుంకూరు నుంచి పోటీ చేసే విషయం అక్కడక్కడ చర్చకు వచ్చింది.

Tags:    

Similar News