ఈశాన్య రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్.. తెలుగు రాష్ట్రాల్లో ప్రయాణం..

ఆ ప్రయివేటు బస్సులతో ప్రభుత్వ ఆదాయానికి రెండు వందల కోట్లు నష్టం.

Byline :  The Federal
Update: 2025-10-26 04:39 GMT
తిరుపతి ఆర్టీసీ బస్టాండు సమీపంలోని పూర్ణకుంభం సర్కిల్ వద్ద బారులుదీరిన ప్రయివేటు బస్సులు

ప్రయాణికులు ప్రధానంగా ప్రభుత్వంతో ప్రైవేటు బస్సు ఆపరేటర్లు కబడ్డీ ఆడుతున్నారు. కబడ్డీ క్రీడలో ప్లేయర్ కూతకు వెళితే.. ప్రత్యర్థి జట్టు అల్లిలో ఫాలో లైన్ టచ్ చేసి రావాలి. లేదంటే అవుట్ అయినట్లు ప్రకటిస్తారు. రిజిస్ట్రేషన్ చేయించిన రాష్ట్రంలో తిరగని బస్సు ఏపీలో నడుస్తున్నా, అంపైర్ (ప్రభుత్వం) ఎందుకు స్పందించడం లేదు?

పత్రాలు ఉంటే చాలు ప్రయివేటు బస్సులకు ఆర్టీఏ అధికారులు రైట్.. రైట్ అంటున్నారు. ఏసీ, స్లీపర్, ఓల్వో బస్సులకు పొరుగు రాష్ట్రాల్లో రిజిస్రేషన్ చేయిస్తున్నారు. ఆ రాష్ర్టం మినహా ఏపీలో బస్సులు నడపడం ద్వారా నిబంధనలు అతిక్రమిస్తున్నారు. సూటిగా చెప్పాలంటే అక్రమ రవాణానే అని ఆర్టీఏ అధికారులు స్పష్టం చేశారు. దీనివల్ల ఏటా రెండు వందల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి గండి పడుతోంది. ప్రభుత్వం కూడా ఉదాసీనంగా వ్యవహరించడం వెనుక ఆంతర్యం ఏమిటనేది సమాధానం లేని ప్రశ్నగా మిగిలిపోయింది.

కొన్ని అంతర్రాష్ట బస్సు ప్రమాదాలు

1) 2013లో తెలంగాణ మహబూబనగర్ జిల్లాలో బస్సు కాలిపోవడంతో 45 మంది దహనమయ్యారు.

2) 2022లో మహారాష్ట్రలోని నాసిక్ లో జరిగిన బస్సు అగ్నిప్రమాదంలో 12 మంది కాలిపోయారు.

3) 2023 మహారాష్ట్రలోని బుల్దానా ప్రమాదంలో 25 మంది చనిపోయారు.

4) 2025లో రాజస్థాన్ లోని జైసల్మేర్ బస్సు అగ్ని ప్రమాదంలో 26 మంది మాడిమసైపోయారు.

5) 2025 ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు దగ్గిర బస్సులో లేచిన మంటల్లో 20 మంది భస్మయ్యారు.

వీటికి కారణాలు విశ్లేషించిన వ్యక్తులంతా ప్రమాదాలుకు అన్ని వైపుల నుంచి లోపాలను ఎత్తి చూపినా ప్రభుత్వ విధానాలను ప్రధాన దోషులుగా నిలబెట్టారు.


రిజిస్ట్రేషన్ చేయించిన ఆ రాష్ట్రానికి ఏమాత్రం సంబంధ లేకుండా, ఏపీ నుంచి ప్రయివేటు బస్సులు అంతర్రాష్ట్ర సర్వీసులుగా నడుపుతున్నారు. కేంద్ర ప్రభుత్వం అమలులోకి తెచ్చిన వన్ ఇండియా వన్ టాక్స్ విధానాన్ని ప్రయివేటు ఆపరేటర్లు చక్కగా సద్వినియోగం చేసుకుంటున్నారు.
ఇతర రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ చేయిస్తున్న ప్రయివేటు బస్సులను ఏపీ నుంచి పొరుగు రాష్ట్రాల మధ్య నడపడంలో తిరకాసు ఏమిటనేది ఒకటి, రెండు సందర్భాల్లో 2021 ఫిబ్రవరి
14వ తేదీ 
కర్నూలు జిల్లా వెల్డుర్తి వద్ద టెంపోను లారీ ఢీకొని 17 మంది మరణించడం, 2013 అక్టోబర్ నెల 30వ తేదీ కర్నూాలు దాటి మహబూబ్ నగర్ వద్ద జబ్బార్ ట్రావెల్స్  బస్సు ప్రమాదానికి గురై, 45 మంది సజీవదహనం అయిన సంఘనలు జరిగినప్పుడు తాత్రాలిక హడావుడి మినహా ప్రభుత్వాలు స్పందించిన దాఖలాలు లేవు. 12 సంవత్సరాల తరువాత కర్నూలు వద్ద బస్సు శుక్రవారం దగ్ధం కావడంతో ఈశాన్య రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ చేయించిన బస్సులు తెలుగు రాష్ట్రాలతో పాటు అంతర్రాష్ట్ర సర్వీసుల ఈ అంశం చర్చకు వచ్చింది.

పర్మిట్ ఇలా..

కేంద్రంలో ఎన్డీఓ ప్రభుత్వం ఏర్పడక ముందు కూడా ప్రతి వాహనానికి నేషనల్ పర్మిట్ ఇచ్చేవారు. అందులో ఏపీలో రిజిస్ట్రేషన్ చేయించుకునే వాహనం పొరుగు రాష్ట్రానికి వెళ్లాలంటే సరిహద్దులోని ఆర్టీఏ కార్యాలయంలో నిర్దిష్ట రోజులకు టాక్స్ చెల్లించి ప్రయాణించే వెసులుబాటు ఉండేది. వన్ ఇండియా వన్ టాక్స్ విధానం వల్ల కేంద్రానికి కూడా పన్ను చెల్లించే పద్ధతి రావడం వల్ల ప్రయివేటు బస్సు ఆపరేటర్లకు అవకావం కలిసి వచ్చింది. ఇదిలావుంటే..
రాష్ట్రంలో ప్రయాణికుల అవసరానికి తగినట్టు ఆర్టీసీ బస్సులు నడపలేకపోవడం, రైళ్ల సంఖ్య కూడా పెంచని స్థితి ఒకపక్క. దూర ప్రాంతాలకు వెళ్లడానికి నెలలకు ముందే రైళ్లలో టికెట్లు అందుబాటులో లేని స్థితి మరోపక్క. త్వరగా గమ్యం చేరాలనే ప్రయాణికుల ఆతృత ప్రయివేటు బస్సులను ఆశ్రయిస్తున్నారు.
ఈ పరిస్థితిపై తిరుపతి రోడ్ ట్రాన్స్ పోర్టు ఆఫీసర్ ( Road Transport Officer RTO ) కే. మురళీమోహన్ ఏమంటున్నారంటే..

"డయ్యు డామన్, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్ లో బస్సు రిజిస్ట్రేషన్ చేయించారను కోండి. అక్కడ టాక్స్ చెల్లించినప్పుడు అది మదర్ స్టేట్ అవుతుంది. ఆ రాష్ట్రం నుంచి మిగతా ప్రాంతాలకు వచ్చి, వెళ్లవచ్చు. వన్ ఇండియా వన్ టక్స్ విధానం వల్ల ప్రయివేటు బస్సు యజమానులకు ఇది కలిసి వచ్చింది. అయితే ఒకే రాష్ట్రంలో (ఏపీలో) తిప్పడం అనేది విరుద్ధమే" అని ఆర్టీఓ మురళీ మోహన్ స్పష్టం చేశారు.
దక్షిణాన పన్నులు అధిక'మనీ'
దక్షిణాది రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయివేటు బస్సుల రిజిస్ట్రేషన్కు వసూలు చేసే టాక్స్ దాదాపు ఒకేలా ఉంటుంది. అది ఎలా ఉంటుందనేది పరిశీలిద్దాం.. ఉత్తరాది, ఈశాన్య రాష్ట్రాల్లో పన్నులు చాలా తక్కువ. దీనికి
ఏపీలో 48 సీట్లు ఉన్న బస్సు లేదా 36 బెర్తులు ఉన్న స్లీపర్ కోచ్ రిజిస్ట్రేషన్ చేయించాలంటే..
ఒక సీటుకు నాలుగు వేలు, కేంద్ర ప్రభుత్వానికి వెయ్యి రూపాయల వంతున మూడు నెలలకు ఒకసారి చెల్లించాలి. అంటే దీనివల్ల మూడు నెలలకు రూ. 1.44 లక్సలు, కేంద్రానికి రూ. 90 వేలు చెల్లించాలి. సంవత్సరానికి 5.76 లక్షలు రాష్ట్ర ప్రభుత్వానికి, 3.60 లక్షలు కేంద్రప్రభుత్వానికి చెల్లించాల్సి వస్తుంది. అంటే ఒక స్లీపర్ బస్సు యజమాని సంవత్సరానికి రూ. 9.76 లక్షలు కేవలం పన్ను, రూట్ పర్మిట్ భారం భరించాల్సి వస్తుందని భావించారు.
ఈశాన్యంలో తక్కువ..
దేశంలోని మిగతా రాష్ట్రాలతో పోలిస్తే దక్షిణాది రాష్ట్రాల్లో పన్నులు భారంగా మారాయని ప్రయివేటు బస్సుల యజమానులు భావిస్తున్న సమయంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ జాతీయ భావాలను పెంపొందించాలనే లక్ష్యంతోవన్ ఇండియా వన్ టాక్స్ విధానం అమలులోకి తీసుకుని రావడం ప్రయివేటు బస్సు యజమానులు వరంగా మార్చుకున్నారు.
ఉదాహరణకి
1. డయ్యు డామన్ (డిడి), నాగాలాండ్ (ఎన్ ఎల్) అరుణాచల్ ప్రదేశ్ (ఏఆర్) లో రిజిస్ట్రేషన్ చేయిస్తే సంవత్సరానికి కేవలం రూ.30 వేల టాక్స్ తోపాటు కేంద్రానికి రూ. 90 వేలు చెల్లిస్తే, రిజిస్ట్రేషన్, పర్మిట్ దక్కుతోంది.
2. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం కాస్త పన్ను ఎక్కువ. మూడు నెలలకు ఓసారి రూ. 50 వేలు సెంట్రల్ టాక్స్ రూ. 90 వేలు అంటే సంవత్సరానికి రూ. మూడు లక్షలు చెల్లించే వెసులుబాటుతో అనుమతులు మంజూరు చేస్తున్నారు.
"దక్షిణాది రాష్ట్రాల తరువాత బస్సు ఫిట్నెస్, ఇతర ప్రామాణికాలు పాటించడంలో మధ్యప్రదేశ్ రాష్ట్రం కాస్త మెరుగ్గా ఉంటుంది. అందుకే అక్కడ మూడు నెలలకు ఒకసారి రూ.50 వేలు టాక్స్ వసూలు చేస్తుంటారు" అని ప్రయివేటు టూర్ ఆపరేటర్ మల్లికార్జున వివరించారు. ఇది కాకుండా డయ్యూడామన్, నాగాలాండ్ అరుణాచల్ ప్రదేశ్ లో వాహనపత్రాలు, పిట్నెస్ చూడడం తోపాటు వాహనం మోడల్ మార్చడంలో కూడా వెనుకాడరని, ఛాసిస్ నంబర్ మార్చడంలో కూడా సిద్ధహస్తులనేది మల్లికార్జున చెప్పిన మాట.
ఆదాయానికి రూ. కోట్లలో గండి
ప్రయివేటు బస్సులు ఏపీలో రిజిస్ట్రేషన్ చేయించని కారణంగా ప్రభుత్వానికి భారీగా గండి పడుతున్నట్లు చెబుతున్నారు. ఏపీలో సుమారు రెండు వేల ప్రయివేటు బస్సులు నడుస్తున్నట్లు రవాణా శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. దీనివల్ల దాదాపు రెండు వందల కోట్ల వరకు ఆదాయం పోయినట్టేనని తిరుపతిలోని ఓ ఆర్టీఏ అధికారి అభిప్రాయపడ్డారు. ఇదిమిద్దంగా లెక్క తేలకపోవడానికి ప్రధాన కారణం మధ్యప్రదేశ్, గోవా, డయ్యడమన్ (డిడి), నాగాలాండ్, హిమాచల్ ప్రదేశ్, అరుణాచలప్రదేశ్ రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ చేయించిన బస్సులు కావడమే అని ఆర్టీఏ అధికారులు చెబుతున్నారు.
సరిపోని ఆర్టీసీ బస్సులు

రాష్ట్రంలో ఏపీఎస్ఆర్టీసీకి ప్రయివేటు బస్సులు సమాంతరగా వ్యవస్థగా మారాయి. ఏపీఎస్ఆర్టీసీలో 11,449 బస్సులు ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి. తిరుపతి, నగరంలోని మంగళం, జిల్లాలోని శ్రీకాళహస్తి, సత్యవేడు, పుత్తూరు నుంచి ఐదు బస్సులు నడుపుతున్నట్లు ఆర్టీసీ రీజనల్ మేనేజర్ జగదీష్ చెప్పారు.
"రాష్ట్ర విభజన నాటికి 10 నుంచి 15 బస్సులు నడిచేవి. రెండు రాష్ట్రాల మధ్య ఒప్పదం నేపథ్యంలో సంఖ్య తగ్గింది. మంగళం నుంచి ఓల్వో, ఏసీ స్లీపర్ బస్సు ఉంది" అని ఆర్ఎం జగదీష్ వివరించారు. తిరుపతి విజయవాడ మధ్య 80 సర్వీసులు నడుస్తున్నాయని ఆయన వివరించారు. విజయవాడ నుంచి హైదరాబాద్ మధ్య అధికంగా 40 నుంచి 50 బస్సులు నడుస్తున్నట్లు ఆయన చెప్పారు. ఈ పరిస్థితుల్లో
ప్రయాణికుల అవసరానికి ఈ బస్సులు చాలడం లేదనే విషయం రోజు సాయంత్రం నుంచి నడిరేయి వరకు ప్రయివేటు బస్సుల్లో సీటు కూడా దొరకకపోవడమే.
రాష్ట్రంలోనే కాకుండా, ప్రయివేటు బస్సులు అంతర్రాష్ట్ర సర్వీసులుగా ఆర్టీసీతో పోటీ పడుతున్నాయి. ఇందులో విజయవాడ నుంచి తిరుపతి మీదుగా బెంగళూరు, తిరుపతి హైదరాబాద్, హైదరాబాద్ బెంగళూరు, హైదరాబాద్ గోవా, విజయవాడ చెన్నై, పాండిచ్చేరి నుంచి తిరుపతి మీదుగా హైదరాబాద్ నగరాలకు నిత్యం వందలాది బస్సులు నడుస్తున్నాయి.
రాష్ట్రంలోని తిరుపతి, విజయవాడ, గుంటూరు, వైజాగ్, హైదరాబాద్ నగరాల్లో బస్టాండ్ల తోపాటు ప్రత్యేకంగా కార్యాలయాలు కూడా ఏర్పాటు చేసుకున్న ప్రయివేటు బస్సు ఆపరేటర్లు ఆర్టీసీకి సమాంతర వ్యవస్థగా మారారు.
తిరుపతి విషయానికి వస్తే...
తిరుపతి మీదుగా దాదాపు 17 ప్రయివేటు ట్రావెల్ ఏజెన్సీలు బస్సులు నడుపుతున్నాయి. వాటిలో విజయవాడ నుంచి తిరుపతి మీదుగా బెంగళూరుకు రోజూ 123 బస్సులు రాకపోకలు సాగిస్తున్నట్లు ఆర్టీసీ అధికారులే వెల్లడించారు. ఈ సంఖ్య 150 వరకు ఉంటుందని తిరుపతిలోని ఓ ప్రయివేటు బస్సు ఆపరేటర్ మల్లికార్జున చెప్పారు. ఇవన్నీ పొరుగు రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ అయినవే అని ఆర్టీసీ అధికారులు కూడా ధృవీకరించారు.

తిరుపతి మీదుగా తమిళనాడు, కర్ణాటక, హైదరాబాద్ తోపాటు ఏపీలోని ప్రధాన నగరాలకు తిరుగే బస్సుల సంఖ్య చూస్తే ఆశ్చర్యపోక తప్పదు. ఇది అధికారిక లెక్కలే. ఏసీ స్లీపర్ బస్సులు 201, ఏసీ సీటింగ్ కం స్లీపర్ 20, ఏసీ కోచ్ లు 251 నాన్ ఏసీ స్లీపర్ 22, నాన్ ఏసీ సీటర్ 53 మొత్తం 326 బస్సులు కేవలం తిరుపతి సెక్టార్ నుంచి ప్రయాణిస్తున్నాయి. ఇందులో
తిరుపతి నుంచి హైదరాబాద్ కు 45 నుంచి 50 బస్సులు వెళుతున్నాయి. బెంగళూరుకు 30, విజయవాడ, తిరుపతి, విశాఖపట్టణం, చెన్నై నగరానికి వంద బస్సుల వరకు నడుపుతున్నారు.
తిరుపతి ఆర్టీసీ బస్టాండుకు సమీపంలోనే ఫ్లైఓవర్ బ్రిడ్జి సమీపంలో కొత్తగా నిర్మించిన రోడ్డు ప్రయివేటు బస్సుల కోసమే అన్నట్లుగా మారింది. ఆర్టీసీ బస్టాండుకు చుట్టుపక్కలే పదుల సంఖ్యలో ట్రావెల్ ఏజెన్సీలు, కార్యాలయాలు సాయంత్రం నుంచి రద్దీగా మారుతుంటాయి.
ప్రయివేటు బస్సులకు ఆల్ ఇండియా పర్మిట్ ఉండడం అనేది కలిసొచ్చిందని తిరుపతి ఆర్టీఓ (Road Transport Officer RTO) కొర్రపాటి మురళీ మోహన్ చెప్పారు. ఏపీలో 27 సీట్ల నుంచి 48 సీట్ల వరకు ఓకే టాక్స్ ఉంటుంది. మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, డయ్యూడామన్ లో దీనికి భిన్నంగా తక్కువ ఉంటుందని ఆయన వివరించారు.
ప్రయివేటు బస్సులకు ఎక్స్ ప్రెస్ స్టేజీ కారియర్ ( Express Stage Carrier ), కాంట్రాక్టు కారియర్ ( Contract Carrier) గా పర్మిట్ ఇస్తుంటారు. ఆర్టీసీకి మినహా ప్రయివేటు బస్సులకు స్టేజి కారియర్ అనుమతి కూడా ఉండదు. కాంట్రాక్టు క్యారియర్ గా నడపాల్సిన బస్సులు ప్రతి పట్టణంలో ఆపి, ముందుగా టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులను ఎక్కిస్తుండడం సహజంగా మారింది. తిరుపతి ఆర్టీఓ మురళీ మోహన్ కూడా స్పష్టం చేశారు.
ఆ పర్మిట్ రూ. రెండు కోట్లు..!
స్టేజి కారియర్ నేషనల్ పర్మిట్లు ఇప్పుడు జారీ కావడం లేదు. దశాబ్దాలుగా ప్రయివేటు బస్సులు నడుతున్న వారి వద్ద మాత్రమే ఉన్నాయని తెలిసింది. వారి నుంచి కొనుగోలు చేయాలంటే రెండు కోట్ల రూపాయలు పలుకుతున్నాయని ఓ ప్రయివేటు ఆపరేటర్ చెప్పారు. దివంగత ప్రధాని ఇందిరాగాంధీ కాలంలో రూ. వెయ్యి, రూ. 1500 ఆ పర్మిట్లు జారీ చేశారు. వాటిలో చాలా మంది పొగొట్టకున్నారు. కానీ, తమిళనాడు కేంద్రంగా ఏపీలో కూడా బస్సులు నడిపే ఓ బస్సు సర్వీస్ యజమాని వద్ద వెయ్యికి పైగానే పర్మిట్లు ఉన్నట్లు సమాచారం.
ఆదర్శం: భారతీ బస్సు సర్వీసుల తమిళనాడులో ప్రధానమైనవి. అక్కడే కాదు. ఏపీలో రిజిస్ట్రేషన్ చేయించడం ద్వారా మాత్రమే ఆ యాజమాన్యం చిత్తూరుతో పాటు రాయలసీమలో కూడా బస్సులు నడుపుతోంది.
చాలని రైళ్లు..

తిరుపతి ఆధ్యాత్మిక రాజధాని మాత్రమే కాదు. దేశంలోని అన్ని రాష్ట్రాలకు రైల్వే మార్గం అనుసంధానంగా ఉంది. అయితే తిరుపతితో పాటు పర్యాటక ప్రదేశాలకు వెళ్లడానికి అనువుగా సరిపడ రైళ్ల సంఖ్య తక్కువగానే ఉంది. ప్రస్తుతం తిరుపతి మీదుగా రోజూ 90 నుంచి 95 రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. చెన్నై మార్గంలో తిరుపతికి సమీపంలోని రేణిగుంట జంక్షన్ మీదుగా 45 నుంచి 50 రైళ్లు నడుస్తున్నాయి. ఇవికాకుండా, మిగతా ప్రాంతాల వివరాలు పక్కన ఉంచితే తిరుపతి నుంచి హైదరాబాద్ మధ్య రెగ్యులర్ రైళ్లు కాకుండా స్పెషల్ ట్రైన్లు 21 నడుపుతున్నా, ప్రయాణికుల సంఖ్యకు చాలడం లేదు.
దీనిపై విశ్రాంత చీఫ్ టికెట్ ఇన్స్పెక్టర్, తిరుపతి రైల్వే డివిజన్ సాధన సమితి ప్రతినిధి కుప్పాల గిరిధర్ ఏమంటారంటే..
"రైళ్ల సంఖ్య పెంచాలంటే తిరుపతి డివిజన్ ఏర్పాటు చేయాలి. దీనికి తగినట్లు రైల్వే స్టేషన్ విస్తరణ జరగాలి. వాటిలో సమానంగా మూడో లైన్ నిర్మాణం తోపాటు కొత్త రైళ్లను ప్రవేశ పెట్టాల్సిన అవసరం ఉంది" అని కుప్పాల గిరిధర్ విశ్లేషించారు.
రాష్ట్రంలో తిరుగుతున్న ప్రయివేటు బస్సు సర్వీసులు అక్రమం అనే మాట అధికారవర్గాల నుంచి గట్టిగా వినిపిస్తోంది. ప్రభుత్వం తాత్కాలిక తనిఖీలతో సరిపెడుతుందా? విధానాలు సమీక్షిస్తుందా? అనేది తేలాలంటే నిరీక్షించాల్సిందే.
Tags:    

Similar News