పర్యావరణ హితం పరిశ్రమల బాధ్యత: డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌

పర్యావరణాన్ని రక్షించుకోవడానికి సమష్టిగా ముందుకు కదలాలి. దీని కోసం ఎన్జీవోలు, నిపుణుల సూచనలు తీసుకుంటాం.

Update: 2024-10-09 11:24 GMT

పర్యావరణ హితం, పర్యావరణ పరిరక్షణ అనేది పరిశ్రమల బాధ్యతని ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ అన్నారు. కాలుష్యరహిత పరిశ్రమలకు ప్రోత్సాహం ఉంటుందన్నారు. విజయవాడలో కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో బుధవారం వర్క్‌ షాపు జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధిలో భాగమయ్యే పరిశ్రమలు భావి తరాలకు చక్కటి పర్యావరణం అందించడం కూడా తమ బాధ్యతగా గుర్తించాలన్నారు. యువతకు ఉపాధి అవకాశాలు కావాలని, దీని కోసం పరిశ్రమలను ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అదే సమయంలో సాధ్యమైనంతగా కాలుష్య రహిత పరిశ్రమలను ప్రోత్సహించడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని చెప్పారు.

కాలుష్యం వల్ల భావి తరాలకు భవిష్యత్తు లేకుండా చేసే అభివృద్ధి సరికాదన్నారు. కాలుష్య నియంత్రణ మండలి అనగానే పరిశ్రమలకు వ్యతిరేకం అనే భావన సరికాదన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో పర్యావరణాన్ని కాపాడుకోవడం, అభివృద్ధి పథంలో ముందుకు సాగడం అనేవి రెండూ కీలకమైనవే అని అన్నారు. దీనికి తగిన మార్గాలను అన్వేషించాల్సిన అవసరం ఉందన్నారు. వాటి విధివిధానాల రూపకల్పనకు నిపుణులు, మేధావులు విలువైన సూచనలు అందించాలన్నారు. ఎన్జీవోలు భాగస్వాములు కావాలన్నారు. ఈ కార్యక్రమంలో కాలుష్య నియంత్రణ మండలి ఛైర్మన్‌ పి కృష్ణయ్య, ఏపీఐఐసీ డైరెక్టర్‌ చెరుకూరి శ్రీధర్‌ తదితరులు పాల్గొన్నారు.
Tags:    

Similar News