తిరుపతికి మళ్లీ బాంబు బెదిరింపు: ఈసారి కలెక్టరేట్‌లో..
తిరుపతి కలెక్టరేట్‌కి బాంబు బెదిరింపు– పోలీసుల ఉరుకులు పరుగులు
By : The Federal
Update: 2025-10-17 13:00 GMT
ఆధ్యాత్మిక కేంద్రమైన తిరుపతికి బాంబు బెదిరింపులు ఆగడం లేదు. మొన్నీమధ్య రైల్వే స్టేషన్ కి రాగా ఇప్పుడు కలెక్టరేట్ కి వచ్చింది. ఈ బెదిరింపులతో నగరంలో కలకలం రేగుతోంది. “తిరుపతి కలెక్టరేట్‌ను బాంబులతో పేల్చేస్తాం” అంటూ గుర్తు తెలియని వ్యక్తుల నుంచి కలెక్టర్ కార్యాలయానికి మెయిల్ బెదిరింపు వచ్చింది.
బెదిరింపు మెయిల్ అందుకున్న వెంటనే బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ బృందాలు రంగంలోకి దిగి కలెక్టరేట్ పరిసర ప్రాంతాలను, వివిధ విభాగాల గదులను క్షుణ్ణంగా తనిఖీ చేశాయి. కలెక్టర్ ఛాంబర్ సహా ప్రతి విభాగం పరిశీలించిన తర్వాత ఎలాంటి పేలుడు పదార్థాలు లేవని అధికారులు నిర్ధారించారు.
ప్రాథమిక దర్యాప్తులో ఆ మెయిల్ తమిళనాడులోని ఒక IP అడ్రస్ నుంచి వచ్చినట్టు తెలుస్తోంది.
ఆగని బెదిరింపు మెయిల్స్ – పోలీసులు సతమతం
గడచిన 15 రోజులుగా వరుసగా బెదిరింపు మెయిల్స్ రావడం ఆందోళన కలిగిస్తోంది. ఎయిర్‌పోర్ట్, హోటల్స్, ఆలయాల తర్వాత ఇప్పుడు కలెక్టరేట్ టార్గెట్ కావడం పోలీసు శాఖను కలవరపెడుతోంది. సైబర్ నిపుణులు ఈ మెయిల్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయో కనిపెట్టడానికి VPN (Virtual Private Network) టెక్నాలజీతో IP (Internet Protocol Address) అడ్రస్‌లను ట్రాక్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ ఇంకా ఖచ్చితమైన ఆధారాలు లభించలేదు.
బాంబు బెదిరింపులు వరుసగా రావడంతో ఆధ్యాత్మిక నగరమైన తిరుపతి భయంతో వణుకుతోంది. ఈ బెదిరింపులు వచ్చిన ప్రతిసారీ భక్తులు, యాత్రికులు ఆందోళన చెందుతున్నారు. పోలీసులు “భయపడొద్దు, అప్రమత్తంగా ఉండండి” అని విజ్ఞప్తి చేస్తున్నా ఎక్కడేమి జరుగుతుందోననే బెరుకు మాత్రం ఉంటూనే ఉంది.
గత ఏడాది నుంచే తిరుపతిలో ఇలాంటి ఫేక్ మెయిల్స్ పరంపర కొనసాగుతోంది. 2024 అక్టోబర్‌లో ఎయిర్‌పోర్ట్, రాజ్ పార్క్ హోటల్‌లకు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. 2025 ఫిబ్రవరిలో ఇస్కాన్ ఆలయానికి, పలు హోటల్స్‌కు బెదిరింపు ఇమెయిల్స్ వచ్చాయి. ఈ నెల 3, 6 తేదీల్లో పాక్, ఐసిస్ పేరుతో కొత్త మెయిల్స్ రావడం పోలీసులకు సవాలుగా మారింది. ఇప్పటివరకు ఎక్కడా పేలుడు పదార్థాలు లభించలేదు. పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.