దుర్గమ్మకు అగ్గిపెట్టెలో పట్టే పట్టుచీర సమర్పించిన సిరిసిల్ల నేతన్న

ఐదే ఐదు రోజుల్లో ఈ పట్టును తయారు చేశారు. ఆలయ ఈవో శీనానాయక్‌ ఆ భక్తుడు నల్ల విజయకుమార్‌ను అభినందించారు.;

Update: 2025-05-15 05:38 GMT

తెలంగాణకు చెందిన ఓ చేనేత భక్తుడు విజయవాడ కనక దుర్గమ్మపై ప్రత్యేక భక్తిని చాటుకున్నారు. దుర్గామాత మీద తనకున్న భక్తితో అగ్గిపెట్టెలో పట్టే ఓ అద్భుతమైన పట్టు చీరను తయారు చేసి కనకదుర్గమ్మకు సమర్పించారు. దుర్గమ్మ కోసం తాను ప్రత్యేకంగా తయారు చేసిన అగ్గిపెట్టెలో పట్టే పట్టు చీరను తొలుత అమ్మవారి విగ్రహం ఎదురుగా ఉంచి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించిన తర్వాత దుర్గమ్మ దేవాలయం ఈవో శీనానాయక్‌ సమక్షంలో దానిని అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో శీనానాయక్‌ను ఆ భక్తుడిని అభినందించి, అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. దుర్గమ్మ పట్ల అంతటి భక్తిని చాటుకున్న చేనేత కళా శిల్పి నల్ల విజయకుమార్‌. తెలంగాణ ప్రాంతం సిరిసిల్లకు చెందిన వారు.

నల్ల విజయకుమార్, ఆయన తండ్రి నల్ల పరంధాములు చేనేత కళారంగంలో చేయి తిరిగిన నిపుణులు. చేనేత వస్త్రాల తయారీలోను, నైపుణ్యాలు ప్రదర్శించి అద్భుతాలు సృష్టించడంలోను వీరు అగ్రభాగాన నిలుస్తుంటారు. వీరు చేసిన చేనేత కళాఖండాలకు, వాటిని తీర్చి దిద్దడంలో చూపించే వీరి కళా నైపుణ్యానికి మంత్ర ముగ్దులు కావలసిందే. అగ్గిపెట్టెలో పట్టే పట్టు చీరలు తయారు చేయడం, అగ్గి పెట్టెలో పట్టే శాలువాలు తయారు చేయడం, ఎలాంటి కుట్టు అల్లికలు లేకుండానే లాల్చి ఫైజామాలను తయారు చేయడం, జాతీయ జెండాను తయారు చేయడంలోను, మూడు కొంగుల చీరను నేయడంలోను, సుగంధ ద్రవ్యాల సువాసనలు వెదజల్లే చీరలను నేయడంలోను వీరికి వీరే సాటి. అంతేకాకుండా దబ్బనంలో దూరిపోయే చీరలను తయారు చేయాలన్నా, బంగారం, వెంటి వంటి విలువైన వాటితో చీరలను తయారు చేయాలన్నా నల్ల విజయకుమార్, అతని తండ్రి నల్ల పరంధాములకు మించిన వారు లేరని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
దుర్గమ్మ కోసం ప్రత్యేకంగ తయారు చేసిన పట్టు చీర విశేషాలేంటంటే.. చీర బరువు కేవలం 100 గ్రాములు. ఆ పట్టు చీర పొడవు ఐదున్నర మీటర్లు. చీర వెడల్పు 48 ఇంచులు. ఈ అగ్గిపెట్టెలో పెట్టే పట్టు చీరను పూర్తిగా పట్టు దారాలతోను, గోల్డ్‌ జరీలతో తయారు చేశారు. కేవలం ఐదే ఐదు రోజుల్లో ఈ పట్టు చీరను తయారు చేశారు.
Tags:    

Similar News