సంఘీభావం అన్ని వర్గాలను ఒకటి చేయగలదు
ఒకరికి ఒకరు మంచి కోసం మద్దతు తెలపడం ద్వారా సంఘీభావాన్ని వ్యక్తం చేసిన వారవుతారు. సంఘీభావం అనేది అన్ని వర్గాల వారిని ఒకటి చేస్తుందా? లేదా? తెలుసుకుందాం.
సంఘీభావం అనేది మానవ సంబంధాలను మెరుగు పరిచి మంచిని ప్రోత్సహించడంలో అడుగులు ముందుకు వేయాలి. నేడు అంతర్జాతీయంగా మానవ సంబంధాలు మంట గలుస్తున్నాయి. సామ్రాజ్య కాంక్ష మానవత్వాన్ని మరిచిపోయేలా చేస్తోంది. వర్గ విభేదాలు లేని సమాజం కావాలని యునైటెడ్ నేషన్స్ కోరుకుంది. ఆ దిశగా నేటీకీ యూఎన్ అడుగులు వేస్తూనే ఉంది. ఏడాది కోసారి మానవులు సంఘీ భావం ప్రదర్శించాలని గుర్తు చేస్తూనే ఉంది.
మానవ సంఘీభావం అంటే అందరం ఒకే మానవ కుటుంబానికి చెందిన వారమనే భావన. ఇది జాతి, మత, లింగ, జాతీయత, ఇతర భేదాలను అధిగమించి అందరిని ఒకటి చేసి మానవత్వాన్ని పెంచుతుంది. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ డిసెంబర్ 22, 2005న 60/209 తీర్మానం ద్వారా డిసెంబర్ 20ని ‘అంతర్జాతీయ మానవ సంఘీభావ దినోత్సవం’గా (International Human Solidarity Day) ప్రకటించింది. అంటే అధికారికంగా అంతర్జాతీయ మానవ సంఘీభావ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం డిసెంబర్ 20న జరుపుకుంటాం. ‘సాలిడారిటీ’ అనే పదాన్ని 2000 సంవత్సరంలో United Nations లో అంతర్జాతీయ సంబంధాలకు అవసరమైన ప్రాథమిక విలువల్లో ఒకటిగా చేర్చారు.
సంఘీభావ దినోత్సవం ఎందుకు?
మానవ సంబంధాల ప్రాముఖ్యతను ప్రపంచ వ్యాప్తంగా ప్రజలకు తెలియజేయడం ద్వారా సంఘీభావానికి ప్రాధాన్యత ఇచ్చిన వారవుతారు. పేదరికం, ఆకలి, వంటి ప్రపంచ సమస్యలను పరిష్కరించడానికి అంతర్జాతీయ సహకారాన్ని పొందే వీలు కలుగుతుంది. వివిధ దేశాలు, సంస్కృతుల మధ్య ఐక్యత, అవగాహనను పెంపొందించడం కోసం ఈ దినోత్సవం ఎంతో ముఖ్యం. అందుకే డిసెంబర్ 20న మానవ సంఘీభావం ప్రాముఖ్యతను గుర్తు చేసుకోవాలి. 2006 నుంచి ప్రతి సంవత్సరం డిసెంబర్ 20ని అంతర్జాతీయ మానవ సాలిడారిటీ డే గా జరుపుకుంటున్నారు.
మానవ సంఘీభావం ఎందుకు..
విభేదాలను తగ్గించి, సహకారాన్ని పెంపొందించడంలో మానవ సంఘీభావం కీలక పాత్ర పోషిస్తుంది. ఇది ప్రపంచ శాంతికి దారి తీస్తుంది. అన్ని వర్గాల ప్రజలకు సమాన హక్కులు, అవకాశాలు లభించేలా చేయడానికి మానవ సంఘీభావం అవసరమవుతుంది. ఇతరుల బాధను అర్థం చేసుకోవడానికి, సహాయం చేయడానికి మానవ సంఘీభావం ఎంతో ముఖ్యం.
మానవుల్లో సంఘీభావాన్ని ఎలా పెంచవచ్చు..
భిన్న సంస్కృతులు, నమ్మకాలు ఉన్న వ్యక్తులతో మాట్లాడటం ద్వారా, స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా, సమానత్వం, సామాజిక న్యాయం కోసం పనిచేయడం ద్వారా, మానవ హక్కుల గురించి చెప్పడం ద్వారా సంఘీభావాన్ని ప్రతి ఒక్కరిలో పెంచే అవకాశం ఉంటుంది. మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని సహనం, కరుణ, సామరస్యంతో నింపడానికి కృషి చేసినప్పుడు సంఘీభావం దానంతట అదే పెరుగుతుంది. అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం ప్రతి సంవత్సరం డిసెంబర్ 10న జరుపుకుంటారు. ఇది మానవ హక్కుల ప్రాముఖ్యతను గుర్తు చేస్తుంది. అంతర్జాతీయ స్వచ్ఛంద సేవా దినం ప్రతి సంవత్సరం డిసెంబర్ 5న జరుపుకుంటారు. ఇది ఇతరులకు సహాయం చేయడం, సమాజానికి సేవ చేయడం గురించి నొక్కి చెబుతుంది. ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడం ద్వారా మానవుల మధ్య సంఘీభావం పెరుగుతుంది. అంతర్జాతీయ మానవ సంఘీభావ దినోత్సవం ఒక సాధారణ ప్రయోజనం, పేదరిక నిర్మూలన అనే ఉమ్మడి లక్ష్యం కోసం, మానవ ఐక్యత అనే అంశంపై మానవ సంఘీభావ దినోత్సవం రూపొందించారు.