ఎస్ఆర్ఎం వేదికగా అమరావతి సాహిత్యోత్సవం

“కొత్త నగరం, కొత్త స్వరాలు” పేరిట 3 రోజుల లిటిరరీ ఫెస్టివల్

Update: 2025-10-19 12:18 GMT
ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని అమరావతిలో తొలిసారి సాహిత్యోత్సవం నిర్వహించేందుకు ఎస్.ఆర్.ఎం. యూనివర్శిటీ ముస్తాబైంది. అమరావతి లిటిరరీ ఫెస్టివల్ పేరిట అక్టోబర్ 22 నుంచి 24 వరకు ఈ సాహిత్య ఉత్సవం జరుగుతుంది. SRM విశ్వవిద్యాలయం–AP ఆధ్వర్యంలో ఇది జరుగుతుంది. “కొత్త నగరం, కొత్త స్వరాలు” అనే ట్యాగ్‌లైన్‌తో ఈ ఉత్సవం ఏర్పాటైంది. అభివృద్ధి చెందుతున్న అమరావతి నగర ఆత్మను ఆవిష్కరించేందుకు ఈ ఉత్సవం తోడ్పడుతుందని నిర్వాహకులు భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ సాహిత్య శాశ్వత శక్తిని మరోసారి ఇనుమడింపజేస్తుందని అంచనా.

సాహిత్యం, సంస్కృతి, సమాజాల సమాహారం..
మూడు రోజుల పాటు సాగే ఈ సాహిత్య మహోత్సవానికి దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రముఖ రచయితలు, కవులు, అనువాదకులు, విద్యావేత్తలు, సాంస్కృతిక ప్రముఖులు తరలి వస్తున్నారు. సాహిత్య ప్రముఖులందరితో ఎస్ఆర్ఎస్ యూనివర్శిటీ కళకళలాడనుంది. నేటి యువతరం కవులు ఆనాటి సాహిత్యకారుల్ని ఒకే వేదిక మీద చూసి తరించనుంది.
నూతన రాజధాని ప్రాంతంలోని ఓ విశ్వవిద్యాలయం నిర్వహిస్తున్న ఏకైక తొలి సాహిత్యోత్సవం ఇదే. అందుకు SRM–AP యూనివర్శిటీ నడుంకట్టింది. ఉన్నత విద్యతో పాటు సాంస్కృతిక జీవనంతో అనుసంధానించే కొత్త ప్రమాణానికి దారులు వేస్తోంది. అమరావతి లిటిరరీ ఫెస్టివల్ (ఎఎల్ఎఫ్) ద్వారా -ఎస్ఆర్ఎం విశ్వవిద్యాలయం- ప్రముఖ రచయితలు, ఆలోచనాపరులతో పాటు విద్యార్థులు, యువగళాలకు వేదిక కల్పిస్తోంది.

సాహిత్యోత్సవంలో భాగంగా వర్క్‌షాప్‌లు, సృజనాత్మక రచనల పోటీలు, ఇంటరాక్టివ్‌ సేషన్లు ఏర్పాటు అయ్యాయి. ఈ ఉత్సవాన్ని కేవలం “వినే, నేర్చుకునే” వేదికగా మాత్రమే కాకుండా “పార్టిసిపేటరీ (పాల్గొనే), క్రియేటివిటీ (సృజనాత్మకత)” వేదికగా కూడా ఉపయోగపడేలా నిర్వహిస్తున్నారు.
ప్రముఖ స్త్రీవాద తెలుగు రచయిత్రి వోల్గా (పి. లలిత కుమారి) ప్రధాన ప్రసంగం (Keynote Address) చేస్తారు. సాహిత్య సంభాషణల్లో పద్మశ్రీ గణేశ్‌ దేవి, పి. సత్యవతి, రమేష్‌ కార్తిక్‌ నాయక్, కడలి సత్యనారాయణ, జెర్రీ పింటో, దేవేంద్ర ప్రభుదేశాయ్, రంజన్‌ ఘోష్, మనిషా సోభ్రాజాని, మిళ్లో అంఖా, మిలీ అశ్వార్యా, కనాటో జిమో, ఎన్‌. జెన్సీ, పవన్‌ సంతోష్ లాంటి ప్రముఖులెందరో పాల్గొనబోతున్నారు. తెలుగు, ఇంగ్లీష్‌ భాషల్లో ప్యానెల్‌ చర్చలు, కవితా పఠనాలు, సృజనాత్మక సెషన్స్ జరుగుతాయి.
విద్యార్థులు, కళాకారులు పాల్గొనే సాంస్కృతిక కార్యక్రమాల్లో కోకా విజయలక్ష్మి సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలువనుంది.
పుస్తకాలకే కాదు, నగర ఆత్మకు కూడా...
సాహిత్యోత్సవంలో భాగంగా అరుదైన పుస్తక ప్రదర్శన ఏర్పాటు కానుంది. రాజధానిగా రూపుదిద్దుకుంటున్న అమరావతి నగరాన్ని కొత్త కథలు, కొత్త స్వరాల ద్వారా ఆవిష్కరించడమే ఉద్దేశంగా ఈ పుస్తక ప్రదర్శన ఉంటుంది.
ఈ వేడుకలో ప్యానెల్‌ చర్చలు, ఆర్ట్‌ ఇన్‌స్టాలేషన్లు, హస్తకళల ప్రదర్శనలు, ఆహార సాంస్కృతిక అనుభవాలు వంటి విభిన్న కార్యక్రమాలను ఆస్వాదించవచ్చు.

“సాహిత్య అభిమానులను, విమర్శనాత్మక ధోరణులను ప్రోత్సహించడానికి, యువకవులు, కళాకారులను అనుభవజ్ఞులైన వారితో మిళితం చేసి సరికొత్త స్వరాలు, గళాలు, కలాలు కదం తొక్కేలా చేయడమే మా ప్రయత్నం. అమరావతి లిటిరరీ ఫెస్టివల్ అంటే కేవలం సాహిత్య చర్చలే కాదు.. అది సమాజ భాగస్వామ్యాన్ని, సమగ్ర సాంస్కృతిక అనుభవాన్ని కలిపిన వేడుక,” అన్నారు ఫెస్టివల్‌ కన్వీనర్ ఆమ్లన్‌ బైస్యా‌ అన్నారు.
ఓ కొత్త నగరంలో, కొత్త సాంస్కృతిక చైతన్యాన్ని రగిల్చడమే ఈ సాహిత్యోత్సవం అని ఆమ్లన్ చెప్పారు. ఎస్ఆర్ఎం యూనివర్శిటీలో జరిగే ఈ ఉత్సవం చారిత్రత్మాకం అవుతుంది.
Tags:    

Similar News