కాపులు ఉన్న చోటే జనసేనకు టికెట్లు!! హాస్య నటుడు సప్తగిరికి టికెట్?

టీడీపీ జనసేన టికెట్ల సర్ధుబాటు స్టార్ట్ అయింది. అసెంబ్లీ సీట్లకంటే ముందు పార్లమెంటు సీట్లను కొలిక్కి తెస్తున్నారు. బీజేపీతో పొత్తు లేకుండానే ముందుకెళ్తున్నాయి..

Update: 2024-02-01 03:40 GMT
పవన్ కల్యాణ్, చంద్రబాబు..

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల సంరంభం స్టార్ట్ అయింది. పోటాపోటీగా అభ్యర్థులను ప్రకటిస్తున్నారు. వైసీపీ తాజాగా ఐదో జాబితాను విడుదల చేస్తే టీడీపీ-జనసేన కూటమి హైదరాబాద్ లో అభ్యర్థుల ఖరారుపై కసరత్తు మొదలు పెట్టింది. పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం రాష్ట్రంలోని 25 లోక్‌సభ స్థానాలలో 13 సీట్లకు టీడీపీ-జనసేన కూటమి అభ్యర్థులను ఖరారు చేసింది. జనసేనకు ఎన్ని ఇస్తారు, టీడీపీ ఎన్ని పోటీ చేస్తుందనేది ఇంకా తేలకపోయినా పవన్ కల్యాణ్ సామాజిక వర్గం ఎక్కడైతే బలంగా ఉంటుందో అక్కడ జనసేన అభ్యర్థులు పోటీకి దిగుతారనేది అర్థమవుతోంది.

వైసీపీ నుంచి వచ్చిన ముగ్గురికీ టికెట్లు...

వైసీపీకి గుడ్ బై చెప్పి బయటకు వచ్చిన ముగ్గురు సిటింగ్‌ ఎంపీలకు.. టికెట్లు ఖరారైనట్టే. నరసాపురం పార్లమెంటు సీటు రఘురామకృష్ణం రాజుకు, నరసరావుపేటకు లావు శ్రీకృష్ణదేవరాయలు, మచిలీపట్నం సీటు వల్లభనేని బాలశౌరికే కేటాయిస్తున్నారు. ఒంగోలు ఎంపి మాగుంట శ్రీనివాసుల రెడ్డి వస్తే ఆయనకు కూడా అదే సీటు ఇస్తారు.

జనసేనకు మచిలీపట్నం, కాకినాడ...

25 లోక్‌సభ స్థానాల్లో జనసేనకు ఎన్ని ఇస్తారో ఇంకా తేలలేదు. ఇప్పటికి ఖరారైన 13 సీట్లలో మచిలీపట్నం, కాకినాడ సీట్లు ఆ పార్టీకి దక్కాయి. శ్రీకాకుళం, అనకాపల్లి, విశాఖపట్నం, అమలాపురం, నరసాపురం, ఏలూరు, విజయవాడ, నరసరావుపేట, తిరుపతి(ఎస్సీ), రాజంపేట, అనంతపురం, హిందూపురంలో టీడీపీ బరిలో ఉండనుంది. జనసేనకు కేటాయించిన రెండు సీట్లూ కాపు సామాజిక వర్గం ఎక్కువ ఉన్నవే. వైసీపీ నుంచి ప్రముఖ పారిశ్రామిక వేత్త చలమలశెట్టి సునీల్, మచిలీపట్నం నుంచి సింహాద్రి రమేశ్ బాబు పోటీ చేస్తున్నారు. వీళ్లిద్దరూ కాపులే. అందువల్ల ఈ రెండు సీట్లలో జనసేన నుంచి పోటీ చేయబోయే వారిలో ఒకరైన వల్లభనేని బాలశౌరి కూడా కాపే. ఇక కాకినాడ జనసేన అభ్యర్థి కూడా అనివార్యంగా కాపే అవుతారు.

మాజీ ఎంపీ కంభంపాటి పోటీ చేస్తారా...

రాజమహేంద్రవరం సీటుకు మాజీ ఎంపీ కంభంపాటి రామ్మోహన్‌రావు లేదా బొడ్డు వెంకటరమణ, గన్ని కృష్ణ, శిష్ట్లా లోహిత్‌ పేర్లు పరిశీలనకు వచ్చాయి. విజయనగరం ఎంపీ సీటుకు వెంకటేశ్‌, కంది చంద్రశేఖర్‌ పోటీలో ఉన్నారు. అరకు (ఎస్టీ) స్థానంపై సందిగ్ధత నెలకొంది. అమలాపురానికి మాజీ స్పీకర్‌ బాలయోగి కుమారుడు గంటి హరీశ్‌ పేరు ఖరారైనా.. తాజాగా మాజీ ఎంపీ బుచ్చిమహేశ్వరరావు కుమార్తె తనకు ఆసక్తి ఉందంటూ టీడీపీ అధినేత చంద్రబాబును కలిశారు. గుంటూరుకు టీడీపీ తరఫున ఖరారైన ప్రవాసాంధ్రుడు పెమ్మసాని చంద్రశేఖర్‌ పేరు కూడా మారిపోయింది. ప్రత్యామ్నాయంగా భాష్యం రామకృష్ణ పేరు పరిశీలనకు వస్తోంది. బాపట్ల (ఎస్సీ) స్థానానికి హరిప్రసాద్‌, ఉండవల్లి శ్రీదేవి, పనబాక లక్ష్మి, పాలపర్తి మనోజ్‌కుమార్‌, ఎంఎస్‌ రాజు పోటీ పడుతున్నారు.

సినీనటుడు సప్తగిరికి టికెట్...

చిత్తూరు(ఎస్సీ) స్థానానికి తలారి ఆదిత్య, యశ్వంత్‌, హరిప్రసాద్‌, సినీ నటుడు సప్తగిరి, కోనేరు ఆదిమూలం పేర్లు వినిపిస్తున్నాయి. అనంతపురంలో మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు పేరును ఖరారు చేసినా.. తాజాగా పూల నాగరాజు, అంబిక లక్ష్మీనారాయణ, బండి శ్రీకాంత్‌ పేర్లు పరిశీలనలోకి వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. కడపలో పొలిట్‌బ్యూరో సభ్యుడు ఆర్‌.శ్రీనివాసులరెడ్డి, బద్వేలు మాజీ ఎమ్మెల్యే విజయమ్మ కుమారుడు రితేశ్‌రెడ్డి పేర్లు పరిశీలనలో ఉన్నాయి. కర్నూలులో బస్తీ నాగరాజు, డాక్టర్‌ పార్థసారథి.. నంద్యాలలో సీనియర్‌ నేత బైరెడ్డి రాజశేఖరరెడ్డి కుమార్తె శబరి, విద్యా సంస్థల యజమాని కేవీ సుబ్బారెడ్డి పేర్లు ప్రచారంలో ఉన్నాయి. ఒంగోలు, నెల్లూరు అభ్యర్థులపై కసరత్తును ప్రస్తుతానికి పెండింగ్‌లో ఉంచింది.

Tags:    

Similar News