దసరాకి పెరిగిన నాటు కోళ్ల గిరాకీ
పల్లెల్లో ఘుమాయిస్తున్న నాటు కోడి.. రాగి సంగటి
By : The Federal
Update: 2025-09-30 10:12 GMT
దసరా పండగొచ్చింది.. పట్ణాలు పల్లెలకు తరలిపోయాయి. పిల్లాజెల్లాతో పల్లెలు కళకళలాడుతున్నాయి. పిల్లల జిహ్వ చాపల్యం తీర్చేందుకు అమ్మమ్మలు, నాయనమ్మలు, తాతయ్యలు నానా తంటాలు పడుతున్నారు. గారెలు, బూరెలు పాతపడిపోయాయి. కొత్త రుచులను పరిచయం చేసే క్రమంలో ఇప్పుడు రాగి సంగటి, నాటు కోళ్లకు గిరాకీ పెరిగింది. ఒకప్పుడు ఇళ్లల్లోనే కోళ్లు పెంచే వాళ్లు. ఇప్పుడా సంస్కృతి కనుమరుగు కావడంతో ఊళ్లల్లో నాటుకోళ్లు ఎక్కడమ్ముతారా అనే వెతుకులాట మొదలైంది.
దసరా సందర్భంగా ఊళ్లల్లో వేటలు (పొట్టేలు, గొర్రెపోతులు) కోయడం చాలా మామూలు విషయం. ఓ నాలుగైదు కుటుంబాలు కలిసి ఓ వేటను కోసుకుని పంచుకునే వారు. ఇప్పుడా పరిస్థితి పోయి నాటు కోళ్లు, ఫారం కోళ్ల సంస్కృతి పెరిగింది. దీంతో నాటు కోళ్ల రేట్లు అమాంతం పెరిగాయి. మటన్‌కు దీటుగా ధరలు పెరిగాయి.
దీనికి తోడు దసరా మొక్కుల కోసం కూడా నాటుకోళ్లనే వాడుతుంటారు. విజయవాడ, విశాఖపట్నం, ఒంగోలు, గుంటూరు, భీమవరం ప్రాంతాలలో నాటు కోళ్ల సంతలు ఏర్పాటయ్యాయి. ప్రస్తుతం కిలో నాటుకోడి ధర రూ.900కు చేరింది. బుధ, గురువారాల్లో ఇది రూ.1,000కు పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు. నాలుగు రోజుల క్రితం దీని ధర రూ.800 మాత్రమే ఉండేది. డిమాండ్ పెరగడంతో వ్యాపారులు ధరలను పెంచేశారు.
విశాఖపట్నం పాత డెయిరీ ఫారం వద్ద సుమారు 40 ఏళ్లుగా నాటుకోళ్ల సంత జరుగుతోంది. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలలో వ్యాపారులు కొనుగోలు చేసి ఇక్కడికి తెచ్చి అమ్ముతుంటారు. నగరంలో పారిశ్రామిక వాడలు ఎక్కువగా ఉండటం వల్ల దసరా సందడి ఇక్కడ ఎక్కువగా కనిపిస్తుంది. పరిశ్రమలు, వాహనాలు, యంత్రాలకు నాటుకోళ్లతో మొక్కులు తీర్చుకోవడం ఇక్కడ ఆనవాయితీ. గాజువాక, ఆటోనగర్, గోపాలపట్నం, అక్కయ్యపాలెం వంటి ప్రాంతాల నుంచి ఎక్కువగా జనాలు ఇక్కడికి వస్తారు.
విజయవాడ సమీపంలోని గన్నవరంలోని కోళ్ల ఫారాలలో నాటుకోళ్ల విక్రయం జోరుగా సాగుతోంది. విజయవాడ పక్కనే ఉన్న నున్న గ్రామంలోని నాటుకోళ్ల వ్యాపారంలో కోళ్ల వ్యాపారం పెరిగింది. ఇక్కడైతే ఇప్పుడే 8వందల నుంచి 9 వందల రూపాయల మధ్య కోళ్లను అమ్ముతున్నారు.
మరికొన్ని ప్రాంతాలలో నాటుకోళ్లలో గిరిరాజు కోళ్లను కలిపి విక్రయిస్తున్నారు. ఇవి అచ్చం నాటుకోళ్ల మాదిరిగానే కనిపిస్తాయి. అందువల్ల నాటుకోళ్లు ఏవో, గిరిరాజు కోళ్లు ఏవో గమనించి కొనుక్కోవాలని హెచ్చరిస్తున్నారు వ్యాపారులు.
గిరిరాజు కోళ్ల ధర కిలో రూ.400 మాత్రమే ఉంటుంది. కానీ నాటుకోడి ధరతో వాటిని విక్రయిస్తున్నారని వారు చెప్పారు. గిరిరాజు కోళ్లు పొట్టి కాళ్లతో, దట్టమైన వెంట్రుకలతో ఉంటాయని, వాటి బరువు ఒకటిన్నర కిలోలకు మించి ఉండదని తెలిపారు. నాటుకోడి కావాలనుకునేవారు ఈ తేడాలను గమనించి, తెలిసినవారిని తీసుకెళ్లి కొనుగోలు చేయాలని వారు సూచించారు.
ఈ దసరా స్పెషల్ రాగి సంగటి..
రాగి సంగటి పేరు వింటేనే గ్రామీణ ప్రజలకు నోరూరుతుంది. రుచితో పాటు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది ఈ వంటకం. రాగి సంగటికి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరగడంతో పిల్లలకు కోడి మాంసంతో కలిపి రాగి సంగటి రుచి చూపించేందుకు పెద్దలు తాపత్రయపడుతున్నారు. సూపర్ టేస్టీగా ఉండే ఈ వంటకాన్ని పిల్లలకు పరిచయం చేయడంతో పాటు ఆరోగ్యకరమైంది కూడా కావడంతో పల్లెల్లో ఇప్పుడు రాగిసంగటి, నాటు కోడి పేరు మార్మోగుతోంది. ఇంటిల్లిపాదీ తినే వంటకం కావడంతో మామూలు బియ్యానికి బదులుగా రాగి సంగటిపై మక్కువ చూపుతున్నారు.
ఒకప్పుడు రాగిసంగటి, గుమ్మడి దబ్బ అనేది కాస్తా రాగిసంగటి, నాటుకోడిగా మారింది.