తిరువూరు, సింగనమల ఎమ్మెల్యేలు స్పెషల్

ఎమ్మెల్యేలు కొలికపూడి శ్రీనివాసరావు, బండారు శ్రావణి లు నిత్యం వార్తల ఎక్కుతున్నారు. స్థానికులకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారనే వార్తలు రావడం విశేషం.;

Update: 2025-02-10 10:43 GMT

ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లా తిరువూరు, అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గాల ఎమ్మెల్యేలు వివాదాస్పదులుగా మిగిలారు. కారణాలు ఏమైనా కిలికపూడి శ్రీనివాసరావును ఇప్పటికే రెండు సార్లు తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి వచ్చి క్రమశిక్షణ సంఘం ఎదుట విచారణను ఎదుర్కొన్నారు. పలువురిని వేధించిన వ్యవహారాల్లో పార్టీ నేతల ఆగ్రహానికి గురికావాల్సి వచ్చింది. కూటమి అధికారం చేపట్టిన ఏడు నెలల్లో పలు ఆరోపణలు కొలికపూడిపై వచ్చాయి. తిరువూరు ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం. అమరావతి రైతులకు అనుకూలంగా ఉద్యమంలో పాల్గొని తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్నారనే భావించిన చంద్రబాబు నాయుడు కొలికపూడి శ్రీనివాసరావుకు టిక్కెట్ ఇచ్చి మొదటి సారిగా గెలిపించారు. ఆ నియోజకవర్గానికి ఎటువంటి సంబంధం లేని వ్యక్తి అయినప్పటికీ జనం ఓట్లు వేసి గెలిపించారు. అంటే అక్కడ వ్యక్తికంటే పార్టీకి ఎక్కువ విలువ స్థానికులు ఇచ్చారనేది నిజం.

ఎమ్మెల్యే కాగానే కొలికపూడిపై కేసు

కొలికపూడి శ్రీనివాసరావు ఎమ్మెల్యేగా బాధ్యతలు స్వీకరించిన మూడో రోజు ఒక ప్రైవేట్ ప్రాపర్టీ భవనాన్ని ఎ కొండూరులో స్వయంగా కూల్చి వేశారు. పోలీసులు అడ్డు వచ్చినా వినలేదు. రోడ్డును ఆక్రమించి ఎ కొండూరు ఎంపీపీ భవనం నిర్మించారని కూల్చివేత కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ విషయంలో పోలీసులు కొలికపూడిపై కేసు నమోదు చేశారు. ఆ తరువాత ఒక మహిళ కొలికపూడి వ్యవహారంపై భయపడి ఆత్మహత్యకు ప్రయత్నించారు. మరో వ్యక్తి కూడా కొలికపూడి చేతిలో హింసకు గురై ఆత్మహత్యకు ప్రయత్నించారు. ఇవన్నీ పోలీస్ కేసులు అయ్యాయి. ఇటీవల డేవిడ్ అనే తెలుగుదేశం పార్టీ కార్యకర్త పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు తనను వేధిస్తున్నారని పోలీసులకు చెప్పారు. పార్టీ నేతలకు ఈ సమాచారం వెళ్లింది.

బండారు శ్రావణిపై ఆరోపణలు

సింగనమల కూడా ఎస్సీ నియోజకవర్గం. ఈ నియోజకవర్గం నుంచి శ్రావణి తెలుగుదేశం పార్టీ తరపున గెలిచారు. ఆమె కూడా పార్టీ కార్యకర్తలతో పాటు పలువురిని వేధింపులకు గురిచేస్తున్నారనే ఆరోపణలు వచ్చాయి. తెలుగుదేశం పార్టీకి చెందిన ప్రసాద్ అనే కార్యకర్త తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులకు ఎమ్మెల్యేపై ఫిర్యాదు చేశారు. తాను 35 సంవత్సరాలుగా పార్టీ కోసం పనిచేస్తున్నానని, అయితే ఎమ్మెల్యే కావాలని తనను రేప్ కేసులో ఇరికించారని ఆయన పార్టీ నేతలకు ఫిర్యాదు చేశారు. ఈ కేసు వల్ల తన జీవితనం నాశనం అయిందని ప్రసాద్ వాపోతున్నారు. నాకు ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టు ఇప్పిపంచాలని ఎమ్మెల్యేను కోరాను. అయితే ఎమ్మెల్యే తల్లి ఆ పోస్టును వేరే వారికి అమ్ముకున్నారని ఆరోపించారు. దీంతో ఈ విషయం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు వద్దకు చేరింది.

Delete Edit

తెలుగుదేశం పార్టీ ఇద్దరు వ్యక్తులతో టూమెన్ కమిటీ అంటూ వేసి వారు ఎమ్మెల్యేపై పెత్తనం చేస్తున్నారని ఎమ్మెల్యే వర్గీయులు చెబుతున్నారు. ఈ మేరకు నియోజకవర్గానికి చెందిన పలువురు ఎమ్మెల్యే అనుచరులు పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు వద్ద పంచాయతీ పెట్టారు. ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అలం నర్సానాయుడు, గార్లదిన్నెకు చెందిన మరో సీనియర్ నాయకుడు ముంటి మడుగు కేశవరెడ్డిలతో కలిసి టూ మెన్ కమిటీ ఏర్పాటు చేసింది. ఆ కమిటీ వారే ఇప్పటికీ పెత్తనం చెలాయిస్తూ ఎమ్మెల్యేను ఇబ్బందులు పెడుతున్నారని తెలుగుదేశం పార్టీలోని ఎమ్మెల్యే వర్గం ఆరోపిస్తోంది.

ఏమైనా ఎస్సీ నియోజకవర్గాల్లో ఈ సమస్యలు తలెత్తడం తెలుగుదేశం పార్టీలో పెద్ద సమస్యగా మారింది. బండారు శ్రావణి నాయకత్వాన్ని జీర్ణించుకోలేని కొందరు ఈ విధంగా చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇక కొలికపూడి శ్రీనివాసరావు పూర్తిగా పార్టీ వ్యతిరేకిగా ముద్ర వేయించుకున్నారు. ఈ రెండు నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ నేతల్లో సఖ్యత కుదుర్చేందుకు చంద్రబాబు నాయుడు రంగంగలోకి దిగితే తప్ప లేకుంటే సమస్యలు తప్పవని తెలుగుదేశం పార్టీ వారే చెబుతున్నారు.

Tags:    

Similar News