ఈ భూమిని రెవెన్యూ గద్దలు ఎత్తుకెళ్లాయి
మాయమైన భూమి కోసం రెండేళ్లుగా ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ నిరీక్షణ;
అమరావతి రాంతంలో భూముల వ్యవహారాల గోల్ మాల్ కొనసాగుతూనే ఉంది. రెవెన్యూ అధికారుల అండతో మోసాలకు కొందరు వ్యక్తులు పాల్పడుతూనే ఉన్నారు. వారికి పోలీసుల అండ కూడా తోడు కావడంతో కొనుగోలు చేసిన మోస పోతున్నారు. కొనుగోలు చేసే సమయంలో ఖాళీ స్థలం చూపించి ఇదే నా భూమి అంటూ చెప్పి మోసం చేస్తున్న ఇద్దరు వ్యక్తుల ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పెద్దల అండతో వారు తప్పించుకుంటున్నారు. బాధితుడు ఎన్నోసార్లు, కలెక్టర్, పోలీస్ కమిషనర్ లను కలిసినా ఉపయోగం లేకుండా పోయింది. భూమి లేనప్పుడు తన డబ్బులు తనకు ఇవ్వాలని కోరితే అతీ గతి లేదు.
ఎక్కడ జరిగింది?
ఈ వ్యవహారం ఎన్టీఆర్ జిల్లా ఎ కొండూరు మండలం పోలిశెట్టిపాడు గ్రామ పరిధిలో జరిగింది. ఆ గ్రామానికి చెందిన సర్వే నెంబరు 25లో 10.71 ఎకరాల భూమి ఉంది. ఈ భూమిని రెవెన్యూ వారు సబ్ డివిజన్ చేయలేదు. చల్లా గురవయ్య, ఆయన తాత బిక్షమయ్య తో పాటు మరో 6గురు రైతుల పేర్లతో జాయింట్ పట్టా ఉంది. బిక్షమయ్యకు 1.35 ఎకరాల భూమిలో సాగు చేసుకుంటున్నాడు. ఆయన కుమారుడు తాతా నాగభూషణం ఆ భూమిని 1986లో డాక్యుమెంట్ నెంబర్ 1334,1986 తో అమ్ముకున్నారు. అయితే జాయింట్ పట్టా కావడం, రెవెన్యూ రికార్డుల్లో ఇతరులు అని రాసి ఉండటంతో నాగభూషణం కొడుకు తాతా వెంకటేశ్వర్లు, ఆయన కుమారులు నరసింహారావు, విష్ణు లకు ఆ సర్వే నెంబరులో వారికి భూమి లేదని స్పష్టమైంది. అయినా తమ పూర్వీకుల భూమి ఉందని చెబుతూ వస్తున్నారు. ఇతరుల పేరుతో ఉన్న ఆ భూమిని 2020లో అన్నాతమ్ముళ్లు భాగ పంపకాలు చేసుకున్నారు. రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఈ రిజిస్ట్రేషన్ పై లక్ష్మీపురం సొసైటీ బ్యాంకులో అన్నతమ్ముళ్లు లోన్ కూడా తీసుకున్నారు.
మోసపోయిన ఓ సాఫ్టవేర్ ఇంజనీర్
రెండేళ్ల క్రితం ఎన్టీఆర్ జిల్లా తిరువూరు గ్రామానికి చెందిన ఆనం వినయ బాబు అనే ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీరు ఎ కొండూరు మండలం పోలిశెట్టిపాడు గ్రామానికి చెందిన తాతా నరసింహారావు వద్ద 50 సెంట్ల భూమిని రూ. 17 లక్షలకు కొనుగోలు చేశారు. కొనుగోలు చేసే సమయంలో ఖాళీగా ఉన్న భూమిని చూపించి ఇదే నీకు అమ్మిన స్థలం అన్నారు. రికార్డుల్లో వీరి పేరుపై సబ్ డివిజన్ లేకపోయినా ఎంజాయ్ మెంట్ ఉంది. అడంగల్, 1బిలో నరసింహారావు పేరు రాసి ఉంది. దీనిని చూసి రికార్డులు అన్నీ సరిగానే ఉన్నాయని, కొనుగోలు చేయవచ్చని రెవెన్యూ వారు సూచించడంతో తాను కొనుగోలు చేశాడు. డబ్బులు చెల్లించి 2023 జనవరి 4న తిరువూరు సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. రెవెన్యూ రికార్డుల ప్రకారం అక్కడ భూమి రేటు ఎకరా రూ. 12లక్షలుగా ఉంది. 50 సెంట్ల స్థలం రూ. 6లక్షలకు కొనుగోలు చేసినట్లు రిజిస్ట్రేషన్ లో రాసుకున్నారు.
అన్నీ పూర్తయిన తరువాత రెవెన్యూ వారిని కొలతలు వేసి ఇవ్వాల్సిందిగా కోరారు. రెవెన్యూ వారు వచ్చి భూమిని కొలిచి ఈ సర్వే నెంబరులో మీకు అమ్మినట్లు చెబుతున్న భూమి లేదని, రికార్డుల్లో మాత్రమే ఉందని అధికారులు తేల్చారు. దీంతో ఆ యువకుడు కళ్లు తేలేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. భూమి అమ్మిన రైతును తన డబ్బులు తనకు ఇవ్వాల్సిందిగా కోరాడు. అయితే లేని భూమి అమ్మిన నరసింహారావు డబ్బులు తన వద్ద లేవని, ఖర్చయి పోయాయని తప్పించుకునే మాటలు చెబుతున్నాడు. నా పేరుపై రికార్డుల్లో భూమి ఉన్నప్పుడు ఫీల్డ్ లో ఎందుకు ఉండదని వాదిస్తున్నాడు.
సమాచార హక్కు చట్టం కింద వివరాలు సేకరించిన వినయబాబు
డిజిటల్ రికార్డుల్లో ఏ అధికారులు నరసింహారావు పేరు ఎక్కించారనేది తెలుసుకునేందుకు వినయబాబు సమాచార హక్కు చట్టం కింద సమాచారం కోరారు. దీంతో అధికారులు వివరాలు తెలియజేస్తూ ఇన్ చార్జ్ తహశీల్దార్ గా ఉన్న గందం డేవిడ్ రాజు, రెవెన్యూ ఇన్స్పెక్టర్ జివిఎల్ స్రవంతి, విఆర్వో దుర్గారావులు చేసినట్లు సమాచారం ఇచ్చారు. మరికొన్ని ప్రశ్నలకు ఆఫీసులో సమాచారం అందుబాటులో లేదనే సమాచారం ఇచ్చారు. ఈ సమాచారం తీసుకుని తాను మోసపోయిన తీరును జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్ కు వివరించారు. వారినుంచి స్పందన ఉన్నా మండల స్థాయి అధికారుల నుంచి స్పందన లేదు.
ఈ భూమి నాదేనంటున్న నరసింహారావు
25 సర్వే నెంబరులో సాగు చేసుకుంటున్న భూమిలో నరసింహారావు తాత నాగభూషణం కాలం నుంచి వారసత్వంగా వస్తున్నట్లు తెలిపారు. నాగభూషణం కుమారుడు వెంకటేశ్వర్లుకు వారసత్వంగా భూమి వచ్చింది. దీంతో అదే భూమి ఆయన కుమారులైన తాతా నరసింహారావు, తాతా విష్ణుల పేర్లపై రిజిస్ట్రేషన్ జరిగింది. రికార్డుల్లో వీరికి పంపకాల్లో వచ్చిన ప్రకారం తాతా నరసింహారావుకు 1.15 సెంట్ల భూమి ఉంది. అందులో వినయ్ కు 50 సెంట్లు అమ్మాడు. ఆ భూమి ఫీల్డ్ లో కనిపించడం లేదు. కొలతలు వేసినప్పుడు నరసింహారావు పేరుపై భూమి లేదని, అది వేరేవారి పేర్లపై ఉందని అధికారులు తేల్చడంతో ఇన్నేళ్ల నుంచి సాగు చేసుకుంటున్న తన పేరుపై కాకుండా వేరే వాళ్ల పేర్లపై ఎలా ఉంటుందని నరసింహారావు ప్రశ్నిస్తున్నారు. కొనుగోలు చేసిన వినయ్ కు భూమి చూపించక పోవడం, తిరిగి డబ్బులైనా ఇవ్వకపోవడంతో నరసింహారావు, ఆయన కుమారుడు రామకృష్ణలపై కేసు పెట్టారు. రెండేళ్ల క్రితం కేసు రిజిస్టర్ చేసిన పోలీసులు విచారించి కోర్టుకు కేసు వివరాలు పంపించలేదు. దీంతో కొనుగోలు చేసిన యువకుడు అలాగే ఈ రెండేళ్ల నుంచి అధికారుల చుట్టూ తిరుగుతున్నాడు.
డిజిటల్ రికార్డుల్లోనూ అవకతవకలు
రెవెన్యూ వారు డిజిటల్ రికార్డులు తయారు చేసే సమయంలో పాత రికార్డులు కనిపించకుండా మాయం చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. తమకు డబ్బులు ఇచ్చిన వారి పేర్లు రికార్డుల్లోకి ఎక్కించి వరిజినల్ గా భూమి పై ఉన్న వారి పేర్లు రికార్డుల నుంచి తొలగిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇదంతా రాజకీయంగా జరుగుతోందని కొందరు మొత్తుకుంటుంటే.. కేవలం డబ్బుల రెవెన్యూలోని కింది స్థాయి సిబ్బంది ఇలా చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.
కలెక్టర్ ఆదేశాలకు దిక్కులేదు
ఈ విషయంలో విచారించి వెంటనే పరిష్కరించి బాధితునికి న్యాయం చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు విచారించిన అధికారి అధికారులదే తప్పని తేల్చారు. భూమి లేకుండా రికార్డుల్లో ఉన్నట్లు చూపించడం మోసం కిందకే వస్తుందనే అంశాన్ని స్పష్టం చేశారు. అయితే ఆయన రెవెన్యూ తెలివితేటలు ఉపయోగిస్తూ చివరి పేరాలో ఈ విషయం సివిల్ మేటరని, ఫిర్యాదు దారు కోర్టుకు వెళ్లి న్యాయం జరిగేలా చూసుకోవడం మంచిదని సెలవిచ్చారు. దీంతో సమస్య అలాగే ఉండి పోయింది. పోలీసులు కూడా రెవెన్యూ అధికారులకు అండగా నిలుస్తూ కోర్టుకు కేసు వివరాలు పంపించేందుకు మీన మేషాలు లెక్క వేస్తున్నారు.
ఎన్టీఆర్ జిల్లాలో భూ మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి. రాజధాని ప్రాంతం కావడంతో చాలా మంది ఈ విధమైన మోసాలకు పాల్పడుతున్నారు. ప్రస్తుత రెవెన్యూ, పోలీస్ అధికారులు ఓ కన్నేసి ఉంచకుంటే ఎంతో మంది మోసపోయే అవకాశం ఉంది.