Nagarjunasagar | 'నవభారత మానవతా మందిరం' ఈ సాగరం
70 ఏళ్ల కిందట మాజీ ప్రధాని నెహ్రూ చెప్పినట్లు ఆధునిక దేవాలయాల నిర్మాణానికి దిక్సూచిగా నిలిచింది. తెలుగు రాష్ట్రాలకు సాగర్ డ్యాం ఓ దివిటీ.;
Byline : SSV Bhaskar Rao
Update: 2024-12-11 13:44 GMT
తెలుగు రాష్ట్రాల్లో భూములు సస్యశ్యామలం చేయడమే కాదు. ప్రజల దాహం తీరుస్తోంది. విద్యుత్ ఉత్పత్తితో వెలుగులు పంచుతున్న నాగార్జునసాగర్ ప్రాజెక్టు నవభారత మానవతా మందిరం. నీటిపారుదల రంగానికి ఓ దిక్సూచిగా నిలిచింది.
1955లో డిసెంబర్ 10వ శంకుస్థాపన చేసే సమయంలో అప్పటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని 'మానవ నిర్మిత మహాసాగరం'గా అభివర్ణించారు. సరిగ్గా, 70 ఏళ్ల కిందట ఆయన ఏమన్నారంటే...
"నాగార్జునసాగర్ బహుళార్థక సాధక ప్రాజెక్టుకు పునాదిరాయి వేయడం పవిత్రకార్యంగా భావిస్తున్నాం. ఇది నవభారత మానవతా మందిరానికి పునాది వేయడమే. ఈ భాగ్యం నాకు దక్కింది. దేశంలో నిర్మించబోయే మరెన్నో ఆధునిక ప్రాజెక్టులు అనే ఆధునిక దేవాలయాలకు ఇది సంకేతం" అని ఆయన సందేశం ఇచ్చారు. ఆయన మాటల అంతరార్థాన్ని పరిశీలిస్తే, ఎన్నో ప్రాజెక్టుల రూపకల్పనకు నాగార్జునసాగర్ దిక్సూచిగా నిలిచిందనే విషయం స్పష్టం అవుతుంది.
ఈ డ్యాం నిర్మాణానికి నెహ్రూ పునాది వేస్తే, ఆయన కూతురు ఇందిరాగాంధీ ప్రధాని హోదాలో 1967 ఆగస్టు 4వ తేదీ కాలువలకు నీరు వదలడం ద్వారా జాతికి అంకితం చేశారు. దీనికి ముందు..
స్వాతంత్య్రానికి పూర్వమే ప్రతిపాదన
వాస్తవానికి 1903లోనే నాగార్జునసాగర్ వద్ద డ్యామ్ నిర్మించడానికి ప్రతిపాదన వచ్చినట్లు చెబుతారు. అయితే బ్రిటిష్, నిజాం పాలనలో అవి కార్యరూపం దాల్చలేదు. కాగా, దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏర్పడిన ప్రభుత్వం నీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇచ్చింది. దీనికోసం అధ్యయనానికి 1952లో ఖోస్లా కమిటీని నియమించారు. ఆ ప్రతిపాదనల ఆధారంగా చేసుకున్న జవహర్లాల్ నెహ్రూ సారధ్యంలోని కేంద్ర ప్రభుత్వం 1954లో నాగార్జునసాగర్ వద్ద ప్రాజెక్టు నిర్మాణానికి ఆమోదముద్ర వేసింది.
ఆ తర్వాత నెహ్రూ 1955 డిసెంబర్ 10వ తేదీన బుద్ధునికొండ వద్ద ప్రాజెక్టు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి ఆనాటి హైదరాబాద్ రాష్ట్ర సీఎం బూర్గుల రామకృష్ణారావు, ఆంధ్ర రాష్ట్రం పక్షాన గవర్నర్ సీఎం త్రివేది హాజరయ్యారు. ఈ జలాశయం నిర్మాణం కోసం సుమారు 132 కోట్ల రూపాయలు ఖర్చు చేశారనేది అధికారిక లెక్కలు చెబుతున్న విషయం. కాగా 2010లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నాటి టిడిపి ప్రభుత్వ కాలంలో ప్రపంచ బ్యాంకు అందించిన 4500 కోట్ల రూపాయలతో ఆధునీకరణ పనులు చేశారు. మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ ఆశించినట్లు..
శ్రీశైలంకు ప్రేరణ
కర్ణాటక నుంచి దిగువకు ప్రవహించే తుంగభద్ర జలాలతో పాటు, కృష్ణా జలాలను కూడా శ్రీశైలం ప్రాజెక్టు పొత్తిళ్లలో ఇముడ్చుకుంటుంది. ఈ జలాశయం నుంచి నాగార్జునసాగర్ డ్యాంలోకి పంపుతుంది. శ్రీశైలం జలాశయానికి నాంది పలకడానికి అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ఆశించినట్లు నాగార్జునసాగర్ డ్యాం నిర్మాణం ప్రేరణగా నిలిచింది. పూర్తిస్థాయి మానవకట్టడంగా చరిత్రపుటల్లో నిలిచిన నాగార్జునసాగర్ డ్యాం నిర్మాణానికి పునాదిరాయి పడిన ఏడాది తర్వాత అంటే 1956 నుంచి శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి.
ఎగువ నుంచి ఉధృతంగా వస్తున్న వరద నీటిని, నిలువరింప చేయడం ద్వారా రాయలసీమ, ప్రస్తుత విభజిత తెలంగాణకు సేద్యపునీరు, అందించే ప్రధాన లక్ష్యంగా శ్రీశైలం వద్ద కూడా బహుళార్థక సాధక ప్రాజెక్టుకు 1963లోనూ మాజీ ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ నాంది పలికారు. 1991 నాటికి 567.27 కోట్ల రూపాయలతో డ్యామ్ నిర్మాణం 1984 డిసెంబర్ నాటికి పూర్తి చేశారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఉభయ రాష్ట్రాలకు సాగునీటితో పాటు విద్యుత్ ఉత్పత్తిలో కూడా కీలకంగా మారింది. ఈ ప్రాజెక్టు విషయాన్నీ పక్కకు ఉంచితే..
నాగార్జునసాగర్ గా మారిన నందికొండ
ఈ ప్రాజెక్టును మొదట నందికొండగా పిలిచేవారు. నాగార్జున కొండకు సమీపంలో నిర్మించడం వల్ల తర్వాత కాలంలో దీనిని నాగార్జునసాగర్ గా పేరు మార్చారు. ఈ ప్రదేశం పర్యాటక కేంద్రంగా ఉంది. కృష్ణానది లోయలో బౌద్ధమత విస్తరణకు ఆచార్య నాగార్జునుడు నెలకొల్పిన యూనివర్సిటీ ప్రపంచంలో బౌద్ధమత వ్యాప్తికి ఎంతో దోహదం చేసింది. క్రీస్తు శకం రెండవ శతాబ్ధంలోని శాతవాహన కాలంనాటి జీవనశైలి, మూడవ శతాబ్ధం నాటి ఇక్ష్వాకుల రాజధానిగా విజయపురి ప్రసిద్ధి చెందింది. ప్రపంచంలోని ఏకైక ఐలాండ్ మ్యూజియంగా ఉన్న నాగార్జునకొండ, అనుపు, ఎత్తిపోతల, ప్రధాన జలవిద్యుత్కేంద్రాలను, కుడి, ఎడమ కాలువలను, మోడల్ డ్యాంను చూసేందుకు ప్రతిరోజూ వందలాది మంది దేశవిదేశీ పర్యాటకులు నాగార్జునసాగర్ రావడంతో ఇది ప్రపంచ పర్యాటక కేంద్రంగా మారింది.
వేల మంది శ్రమదానంతో..
వేల మంది కార్మికులు అహోరాత్రులు శ్రమించారు. ప్రాజెక్టు పూర్తయ్యే నాటికి దాదాపు పది వేల మంది ప్రాణత్యాగాలు చేశారు. వేలాదిమంది కూలీల శ్రమతో నిర్మించిన ప్రాజెక్టు దేశంలోనే రెండవ అతిపెద్ద జలాశయం. భారీ రాళ్లతో పూర్తిస్థాయి మానవ శ్రమతోనే 1969 నాటికి ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసినారు. అయితే ట్రస్ట్ గేట్లు ఏర్పాటు చేయడం ద్వారా పూర్తిస్థాయిలో సిద్ధమైంది.
ఉభయ తెలుగు రాష్ట్రాలకు నాగార్జునసాగర్ ప్రధాన జలవనరుగా ఆదుకుంటోంది. సేద్యపు నీటితో పాటు, తాగునీటికి కూడా ఈ ప్రాజెక్టు ఆలంబనగానే నిలిచింది. డ్యాం పూర్తిస్థాయిలో నీరు నిలిచిన తర్వాత, డెడ్ స్టోరేజీకి వచ్చేవరకు విద్యుత్ ఉత్పత్తి ద్వారా కూడా వెలుగులు ప్రసాదిస్తుంది.
22 లక్షల ఎకరాలకు సాగునీరు
రెండు ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని ఐదు జిల్లాల్లో 22 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడంలో నాగార్జునసాగర్ డ్యాం వరప్రసాదినిగా నిలిచింది. ఈ రాతి కట్టడం ప్రాజెక్టు కాలువలకు నీరు వదలడం ద్వారా 1967లో నాటి ప్రధాని ఇందిరాగాంధీ జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంలో ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలుగా మారిన ఆంధ్ర తెలంగాణ ప్రాంతాల్లోని పల్లె ప్రజల సంబరాలు చేసుకున్నారు. ఈ కాలవల నీటి విడుదలపై ఇంజినీర్లు ఏం చెబుతున్నారంటే..
"నాగార్జునసాగర్ కుడి కాలవకు జవహర్ కాలువగా పేరు పెట్టారు. ఈ కాలువ నుంచి 11 లక్షల ఎకరాలకు సేద్యపునీరు అందుతుంది. అందులో గుంటూరు జిల్లాలో 6,68,230
ప్రకాశం జిల్లాలో 4,43,180 ఎకరాలకు నీరు అందుతోంది.
ఎడమ కాలువకు లాల్ బహదూర్ పేరు పెట్టినప్పటికీ వాటి పేర్లు చాలా మందికి తెలిసే అవకాశం లేకుండా పోయింది.
ఈ కాలువ నుంచి తెలంగాణలోని 11 లక్షల ఎకరాలకు సేద్యం నీరు పారుతుంది"
నల్లగొండ జిల్లాలో 3,72,970 ఎకరాలు.
ఖమ్మం జిల్లాలో 3,46,769
ఈ కాలువ ద్వారానే
కృష్ణాజిల్లాలోని 4,04760 ఎకరాలకు సాగునీరు అందుతోంది.
వెలుగుల దివిటీ
నాగార్జునసాగర్ డ్యాం అనేది బహుళార్థక సాధక ప్రాజెక్టుగా ఉపయోగపడాలని భావించిన ఆనాటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ఆశించినట్లు నవభారత మానవతా మందిరం గానే ఉపయోగపడుతుంది. సాధారణంగా ఆలయాలకు వెళితే, దీపం వెలిగిస్తాం. అగర్బత్తీలు ముట్టిస్తాం. కర్పూర హారతి తీసుకొని కొబ్బరికాయ కొడతాం. నాగార్జునసాగర్ ను పండిట్ జవహర్లాల్ నెహ్రూ ఆధునిక దేవాలయంగా అభివర్ణించడం వెనక అంతరార్థం ప్రాజెక్టు నిర్మాణం పూర్తయిన తర్వాత దశాబ్దాలవు కానీ ఆయన మాటలు అర్థం కాలేదని చెప్పడంలో ఏ మాత్రం సంకోచించాల్సిన అవసరం లేదు.
ఎందుకంటే..
నాగార్జునసాగర్ అనే ఒక ఆధునిక దేవాలయం తుంగభద్ర, కృష్ణా నదుల నుంచి వచ్చే వరద నీటిని పొత్తిళ్లలో నింపుకుంటుంది. ఆ నీటిని మధనం చేయడం ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసి లోకానికి వెలుగులు ప్రసాదిస్తోంది. ఆ కోవలో.. నాగార్జునసాగర్ బహుళార్థక సాధక ప్రాజెక్టు వద్ద ఉత్పత్తి చేస్తున్న విద్యుత్ వల్ల కేవలం వ్యవసాయ రంగం, ఇళ్లలో దీపాలు వెలిగించుకోవడానికి కాదు. పారిశ్రామిక అభివృద్ధికి కూడా సోపానంగా నిలిచింది. దీనిపై సాగర్ డ్యాం ఇంజనీర్లు ఏం చెబుతున్నారంటే..
"సాగర్ వద్ద మెయిన్ ప్రాజెక్టులో 810 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది.
కుడి కాల్వ నుంచి నీటిని విడుదల చేసే కేంద్రం వద్ద 90 మెగా పట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది.
ఎడమ కాలువ వద్ద కు 60 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు.
రాతి కట్టడమే ప్రత్యేకత
నాగార్జునసాగర్ డ్యాం నిర్మాణంలో రాళ్లతోనే నిర్మించడం ఓ ప్రత్యేకత. ఎన్నో జయప్రయాసలకు ఓర్చి శంకుస్థాపన చేసిన సంవత్సరం తర్వాత పనులు ప్రారంభించి 11 సంవత్సరాల్లో డ్యామ్ నిర్మాణం పూర్తి చేశారు. సముద్రమట్టానికి 20040 అడుగుల ఎత్తులో ఉన్న ఈ డ్యాం కు 1.59 కిలోమీటర్ల పొడవున ఆనకట్టను 4756 అడుగుల ఎత్తు నిర్మించారు. దీనికి 26 క్రస్ట్ గేట్లు కూడా ఏర్పాటు చేశారు. 110 చదరపు మైళ్ళ క్యాచ్ మెంట్ ఏరియాగా నిర్ధారించి నిర్మించిన ఈ బహుళార్థక సాధక ప్రాజెక్టులో 590 అడుగుల వరకు గరిష్టంగా నీటి నిలువ చేసే సామర్థ్యం ఉంది. 490 అడుగులకు నీరు చేరితే డెడ్ స్టోరేజ్ గా పరిగణిస్తారు. దీని స్పెల్వే వరకు డ్యామ్ ఎత్తు 546 అడుగులు ఉంటుంది.
తెలుగు రాష్ట్రాల ప్రసాదిని
పొడవు 1. 6 కిలోమీటర్లు, ఎత్తు 590 అడుగులు , ఈ ఆనకట్టను పూర్తిగా రాతితోనే నిర్మించారు. దీనికి రెండు వైపులా మట్టితో కట్టిన కట్టలు ఉన్నాయి. కుడి ఎడమ కాలువలకు కలుపుకుంటే మొత్తం 4.8 కిలోమీటర్లు పొడవు ఉంటుంది. ఈ ప్రాజెక్టు నుంచి
ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు వైపు వెళ్లే కాలువ 203 కిలోమీటర్లు సాగుతుంది.
తెలంగాణలోని నల్లగొండ జిల్లా వైపు ప్రవహించే ఎడమ కాలువ 179 కిలోమీటర్ల పరిధిలో ప్రవహిస్తుంది.
ఎన్నో ఆటుపోట్లు
70 ఏళ్ల కిందట నాగార్జునసాగర్ డ్యామ్ నిర్మాణానికి పునాది పడిన రోజుల్లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో లేదు. కింది నుంచి ఎగువ ప్రదేశాలకు రాళ్లు ఎత్తడానికి అందుబాటులో ఉన్న యంత్రాలు వినియోగించాలన్న మానవశ్రమ అనేది అనివర్యం. ఒక ఇనుప పెట్టెలో రాయి ఉంచి, పైకి లాగాలంటే చైన్ లింకు ద్వారా మనుషులు తిప్పడం వల్లే సాధ్యమైంది. లేదంటే డీజిల్ ఇంజన్ మాత్రమే ఆ రోజుల్లో వినియోగం లో ఉండేది. ఇవన్నీ కూడా నిర్వహించాలంటే మానవ శ్రమ అనేది తప్పనిసరైంది. దీంతో నాగార్జునసాగర్ ప్రాజెక్టు నిర్మాణంలో ఎన్నో ఆటుపోట్లు ఎదురయ్యాయని చరిత్రను పరిశీలిస్తే మనకు అర్థమవుతుంది.
ఇదో లోపం..!
తెలుగు రాష్ట్రాలకు వరప్రసాదినిగా వెలగొందుతున్న నాగార్జున ప్రాజెక్టుకు కొన్ని లోపాలు కూడా ఉన్నాయి. ఏదైనా లోపం ఉన్నట్లు గుర్తించిన, మరమ్మతు చేయాలన్న డ్యామ్ లో నీళ్లు డెడ్ స్టోరేజీకి చేరినప్పుడు మాత్రమే పనులు చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఈ విషయంపై నీటిపారుదల శాఖ అధికారి ఒకరు ఏమంటున్నారంటే..
"నాగార్జునసాగర్ డ్యాం అత్యవసర ద్వారాలు లేవు. క్రస్ట్ గేట్లు లేదా ఇతర ప్రదేశాల్లో మరమ్మతులు అవసరమని గుర్తిస్తే, క్రైస్ట్ గేట్లకు కింది భాగంలో నీరు ఉన్నప్పుడు మాత్రమే పనులు చేసేందుకు ఆస్కారం ఉంటుంది. మెయింటెనెన్స్ పనులు కూడా చేయడానికి వీలుంటుంది. డ్యామ్ లో పూర్తిస్థాయి నిలువ ఉన్నప్పుడు, గేట్లు తెరిచిన మెయింటినెన్స్ కోసం లోటుపాట్లను రాసుకుంటాం. సాంకేతిక అంశాలను కూడా గుర్తిస్తాం" అంటున్నారు. సాధారణంగా ఎగువ ప్రాంతాలైన కర్ణాటక నుంచి తుంగభద్ర, మహారాష్ట్ర లో పుట్టుకగా ఉన్న కృష్ణానది ప్రవాహం పెరిగితే ప్రతి సంవత్సరం ఆగస్టు నెలలో నుంచి నాగార్జునసాగర్ డ్యాంకు వరదనీరు చేరుతుంది. ఈ ప్రవాహ ఉధృతి నవంబర్ నాటికి మరింత పెరుగుతుంది.
ఆగష్టు 15న..
ప్రతి సంవత్సరం ఆగస్టు 15వ తేదీ ఎగువన కర్ణాటకలోని తుంగభద్ర డాం, దీనికి దిగువన ఉన్న నంద్యాల జిల్లాలోని శ్రీశైలం డ్యాం, రెండు తెలుగు రాష్ట్రాలకు మధ్యలో ఉన్న నాగార్జునసాగర్ డ్యాం క్రస్ట్ గేట్లను పూర్తిగా తెరవడం ద్వారా వరద నీటిని దిగువ ప్రాంతాలకు వదిలే సందర్భంలో తుంగభద్ర, కృష్ణా జలాల సంఘంతో ప్రవహించే నీటి ఉధృతి కనువిందు చేస్తుంది.
పర్యాటకులకు ఆహ్లాదం
నాగార్జునసాగర్ జలాశయం నుంచి శ్రీశైలం డ్యాం వరకు ప్రకృతి అందాలను ఆస్వాదించడానికి వీలుగా పర్యాటకశాఖ ఓ లాంచి కూడా నడుపుతోంది. అంతేకాకుండా నాగార్జునసాగర్ ప్రధానగట్టు నుంచి నందికొండ వరకు యాత్రికులను సందర్శనకు కూడా తీసుకు వెళుతుంది. అక్కడి బౌద్ధారామాలను సందర్శించడం, ప్రకృతి రమణీయతను ఆస్వాదించడానికి కూడా నాగార్జునసాగర్ డ్యాం పరిసరాలు పర్యాటక ప్రదేశంగా కూడా మారింది.