నాడు నలుగురి కోసం.. నేడు కులం కోసం..
నాడు నలుగురి కోసం పనిచేసిన వ్యక్తి ఆయన. నేడు తన సామాజిక వర్గం కోసం పోరాటాలు నడుపుతున్న వ్యక్తి ఆయన. ఎవరో తెలుసా..;
Byline : G.P Venkateswarlu
Update: 2024-03-11 03:55 GMT
తొలితరం రాజకీయ నాయకుడు, నేడు కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభంకు ముద్రరగడ అనే మరో పేరు ఉంది. రాజకీయాల్లోకి వచ్చిన కొత్తలో ఎంత సున్నిత మనస్కుడో ఇప్పుడు అంత కఠిన మనస్తత్వం అలవరుచుకున్నారు. కొత్తలో తనను భుజానికెత్తుకున్న జనం ఎందుకో వరుసగా ఓడించారు. దాంతో రాజకీలపైనే చిరాకు తెచ్చుకున్న ముద్రగడ పద్మనాభం కొన్నేళ్ల పాటు రాజకీయ విరామం తీసుకున్నారు. స్వర్గీయ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పిలుపు మేరకు 14 ఏళ్ల తరువాత తిరిగి ఎన్నికల్లోపోటీ చేసి ఓటమి చవి చూశారు. వైఎస్సార్ ప్రత్తిపాడు నుంచి పోటీ చేయాలని సూచిస్తే పిఠాపురం నుంచి పోటీ చేసి ఓటమి చెందారు. 2014 లో స్వతంత్ర అభ్యర్థిగా ప్రత్తిపాడు నుంచి పోటీ చేశారు. మళ్ళీ ఓడిపోయారు.
కాపుల మద్దతు..
కాపు ఉద్యమాన్న చేపట్టిన తర్వాత ముద్రగడకు కాపుల్లో మంచి బలం లభించిందని చెప్పొచ్చు. జనసేన ఆవిర్భావం తరువాత ఆ పార్టీలో చేరే అవకాశాలు ఉన్నాయని అందరూ భావించారు. అలా జరగలేదు. ఎవరైనా తన వద్దకు వచ్చి మాట్లాడితేనే తప్ప తాను వెళ్లి వాళ్లతో మాట్లాడేది లేదని నిరూపించుకున్నారు. తెలుగుదేశం పార్టీ హయాంలో కాపు ఉద్యమంపై ఉక్కుపాదం మోపడం, ఆ ఉద్యమం హింసాత్మకం కావడంతో కాస్త వెనుకడుగు వేశారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత ఇటీవల కాలంలో ఆ కేసులు కొట్టివేశారు.
ఒడిదుడుకుల మధ్య వైఎస్సార్‌సీపీలోకి..
ఇటీవల మొదట వైఎస్సార్‌సీపీలో చేరాలనుకుని ఆ తరువాత జనసేన వైపు మొగ్గు చూపారు. చివరకు వైఎస్సార్‌సీపీలో చేరేందుకు నిర్ణయించుకున్నారు. ఈనెల 14న ఎటువంటి షరతులు లేకుండా వైఎస్సార్‌సీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. వైఎస్సార్‌సీపీ నుంచి పార్టీ ఎంపీ మిథున్‌రెడ్డి తన వద్దకు వచ్చి పార్టీలో చేరాలని కోరారని, అందుకు తాను అంగీకరించినట్లు ఆయన చెబుతున్నారు.
రాజకీయ ప్రవేశం..
భారత మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డికి సూచన మేరకు 1978లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో ముద్రగడ పద్మనాభం జనతాపార్టీ అభ్యర్థిగా ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు. గిరిజనులు, నిరుపేద బీసీలు పద్మనాభంలో ఆయన తండ్రిని చూసుకున్నారు. ఆవిధంగా మొదలైన తన రాజకీయ ప్రస్థానంలో ముద్రగడ పద్మనాభం మూడుసార్లు శాసనసభ్యుడిగా, ఒకసారి ఎంపీగా, రెండుసార్లు రాష్ట్ర మంత్రిగా పనిచేశారు.
అనుచరుల కోసం ఎందాకైనా..
1988లో ముద్రగడ అనుచరులైన కుర్రాళ్లను కొంతమందిని ఉత్తరకంచి పోలీసులు అరెస్టు చేశారు. వారంతా దళితులు, బీసీలు. ఆ విషయం తెలుసుకున్న పద్మనాభం స్టేషనుకు వెళ్లారు. ఆయనను పోలీసులు స్టేషనలోకి రానివ్వలేదు. దాంతో స్టేషన్ ముందు బైఠాయించారు. టెంట్లు వేశారు. 5 రోజులు గడిచినా ప్రభుత్వంలో చలనం కనబడలేదు. 5వ రోజు సాయంత్రం ‘ఆమరణ దీక్ష’ ప్రకటించారు. దీనితో జిల్లా వ్యాప్తంగా కాపులు ఆందోళనకు లోనయ్యారు. ముఖ్యంగా కోనసీమ నుంచి వందలాది కాపు సామాజిక వర్గం వారు ఉత్తరకంచి చేరుకున్నారు. దీంతో అప్పటి ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు పోలీసులు అరెస్టు చేసిన యువకులను బేషరతుగా విడుదల చేయించారు. ఆ సంఘటన తరువాత ముద్రగడకు కాపు నాయకుడిగా గుర్తింపు లభించింది. ఈ దశలో కాపుల సమస్యల పరిష్కారానికి కాపు ఉద్యమాన్ని నడుపుదామని కొందరు కాపు పెద్దలు కోరిన మీదట ఉద్యమ సారధ్యాన్ని ఆయన తీసుకున్నారు.
మంటలు రేపిన కాపు ఉద్యమం
2016 జనవరి 31న తూర్పు గోదావరి జిల్లా తునిలో ప్రారంభమైన కాపు ఐక్యగర్జన సభకు వచ్చిన ప్రజలను ఉద్యమ పంథాలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ముద్రగడ పద్మనాభం ఆధ్వర్యంలో తునిలోని వి కొత్తూరు వద్ద గల మైదానంలో సభ మొదలైన తరువాత ముద్రగడ పద్మనాభం, ఇప్పుడే ప్రత్యక్ష ఉద్యమానికి దిగుదామంటూ సభకు వచ్చినవారిని రోడ్లు–రైళ్ల రోకోలకు పిలుపునిచ్చారు. బహిరంగ సభ నుంచి రైలు పట్టాలపైకి వెళ్దాం రండి అంటూ ఆయన పిలుపునివ్వడంతో సభకు వచ్చిన వేలాది మంది హైవేలు రైల్వే ట్రాకులు దిగ్బంధించారు. దీంతో విధ్వంసం జరిగింది.
1994లో ముద్రగడ ఒకసారి కాపుల కోసం నిరాహార దీక్ష చేశారు. అప్పటి ముఖ్యమంత్రి కోట్ల విజయ భాస్కర రెడ్డి కాపు విద్యార్థులకు ఆర్థిక ప్రయోజనాలు కల్పిస్తూ జీవో (జీవో నం. 30) జారీ చేయించారు. ఆ జీవోపై హైకోర్టు సింగిల్ జడ్జి స్టే ఇచ్చారు. తరువాత డివిజన్ బెంచి సమర్థించింది.
ఒకప్పుడు అన్ని కులాల కోసం రాజకీయ నాయకునిగా, మంత్రిగా, ఎంతో సమర్థవంతంగా బాధ్యతలు నిర్వహించిన ముద్రగడ ఇప్పుడు ఒక కుల నాయకుడిగా ముద్ర వేయించుకున్నారు. ఇది ఒకింత బాధాకరమే. అయితే విధి లేని పరిస్థితుల్లో తన ఉనికిని కాపాడుకునేందుకు తమ సామాజిక వర్గ ప్రయోజనాలే ధ్యేయంగా అడుగులు వేయక తప్పింది కాదు. నాడు తిరస్కరించిన జనం తన సామాజిక వర్గం రూపంలో ప్రస్తుతం ఆహ్వానించడం విశేషం. ఆ విశేషమే ప్రస్తుత రాజకీయ పార్టీలు మా వైపు వస్తే బాగుండు అనే పరిస్థితికి వచ్చాయి. ముద్రగడ తన మనుగడ కోసం వైయస్సార్సీపిని ఆశ్రయించక తప్పలేదు. ఎంతటి మహా నాయకుడైనా కష్టాలకు ఎదురొడ్డి పోరాడడం అంత తేలికైంది కాదు. నాటి రాజకీయాలు వేరు, అప్పటి పరిస్థితులు వేరు, నేటి రాజకీయాలు వేరు, నేటి పరిస్థితులు వేరు. ఎప్పటికప్పుడు నవ్యతను ప్రదర్శించగలిగిన వారే సక్సెస్ అవుతారు. ఆ కోవలోకి ముద్రగడ వస్తారని చెప్పొచ్చు.