ప్రైవేట్‌కు పర్యాటక ఆస్తులు
రాష్ట్ర పర్యాటక శాఖ తమ ఆస్తులను పైవేట్ పరం చేసేందుకు షార్ట్ టెండరు నోటీసులు విడుదల చేసింది. దీనిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Byline : G.P Venkateswarlu
Update: 2024-01-25 04:50 GMT
ప్రభుత్వ ఆస్తులను కాపాడుకోవడం ద్వారా ప్రజలకు ఎంతో కొంత మేలు చేయాలనుకోవడం సాదారణ అంశం. అయితే ఇక్కడ ప్రభుత్వానికి ఆదాయం ఇస్తున్న ఆస్తులను ప్రైవేట్ వారికి అప్పగించే కుట్ర జరుగుతోంది. రాష్ట్ర పర్యాటక శాఖ ఇందుకు తెరలేపింది. రాష్ట్రంలో సంవత్సరానికి సుమారు రూ. 50కోట్ల వరకు ఆదాయం అందిస్తున్న పర్యాటక శాఖ హోటళ్లు, రిసార్ట్స్, బీచ్ ఫ్రంట్‌లను కేవలం రూ. సంవత్సరానికి రూ. 20 కోట్లకు ప్రైవేట్ వారికి అప్పగించేందుకు పర్యాటకశాఖ నిర్ణయించింది. ఈ మేరకు టెండర్లు పిలిచింది. మరో నెల రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ రానున్న సమయంలో ఈ వ్యవహారం చర్చనియాంశమైంది.
నష్టాల్లో లేకున్నా ప్రైవేట్‌కు ఎందుకు?
పర్యాటక శాఖకు ఏటా సుమారు రూ. 50కోట్ల ఆదాయం ఇస్తున్న ఆస్తులను కేవలం రూ. 20 కోట్లకు మూడు రోజుల వ్యవధిలో తమ అనుకూలురకు అప్పగించేందుకు షార్ట్ టెండర్ నోటీస్ పర్యాటక శాఖ ద్వారా పాలకులు ఇప్పించారు. కేవలం మూడు రోజుల్లో ఈ పర్యాటక ఆస్తులను అంచనా వేసి దక్కించుకోవడం కొత్త వారికి సాధ్యం కాదు. ముందుగా నిర్ణయించిన వ్యక్తులకు మంత్రి ఇష్ట ప్రకారం కట్టపెట్టేందుకు పర్యాటకశాఖ ప్రయత్నం చేస్తోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇందుకోసం గిరిజన చట్టాలను, కోస్తా నియంత్రణ మండలి చట్టాలను ఉల్లంఘించారనే ఆరోపణలు ఉన్నాయి.
ఉద్యోగుల పొట్టకొట్టే ఆలోచన
రాష్ట్ర పర్యాటక శాఖకు బంగారు బాతు గుడ్డు లాంటి విశాఖపట్నం యాత్రినివాస్, విశాఖ మన్యంలోని తైడా జంగిల్ ఫారెస్ట్, బుర్ర గుహలకు సమీపంలోని అనంతగిరి రిసార్ట్స్, ఆంధ్ర ఊటీ పేరుమీద అరకు వ్యాలీ రిసార్ట్, మయూరి రిసార్ట్స్, లంబసింగిలో కొత్తగా కట్టిన రిసార్ట్స్, విజయవాడలో అత్యంత ఆకర్షణీయమైన మయూరి రిసార్ట్స్, చిత్తూరు జిల్లాలోని చంద్రగిరి రిసార్ట్, కర్నూలు, నెల్లూరు, కడప అనంతపురం జిల్లాలో ఉన్న పర్యాటకశాఖ ఆస్తులు అన్నింటిని ప్రైవేట్ వారికి కట్టబెట్టనుంది. వీటిపై ఇప్పటికే రూ. 50 కోట్ల లాభం వస్తున్నట్లు సమాచారం. 1,100 మందికి పైగా ఉద్యోగులు వీటి ఆధారంగా జీవనం సాగిస్తున్నారు. వీరి పొట్ట కొట్టి ఈ ఆస్తులను వైఎస్సార్ కాంగ్రెస్ పెద్దల పరం చేసేందుకు మంత్రి రోజా ప్రయత్నిస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికారుల తీరుపై కూడా తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
ఎన్నికలకు ముందు ఎందుకీ హడావుడి
నెల రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ వెలుపడుతున్న సమయంలో ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకోకూడదు అనేది ఎన్నికల నిబంధనావళి. ఈ ఆస్తులపై ప్రభుత్వం రూ. 180 కోట్ల రుణాన్ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఇప్పటికే తీసుకొచ్చింది. ఇన్ని చేసిన తర్వాత అకస్మాత్తుగా వీటిని ప్రైవేటుపరం చేయటమంటే కచ్చితంగా ఇందులో ఏదో మతలబు ఉందనే విమర్శలు వస్తున్నాయి.
ఒక్క ఋషికొండ కోసమే సుమారు రూ. 550 కోట్లు నీళ్ల ప్రాయంగా ఖర్చు చేసిన ప్రభుత్వం ఏడాదికి కేవలం రూ. 20 కోట్ల ఆదాయం పేరిట ప్రైవేటు వ్యక్తులకు సుమారు వెయ్యి కోట్ల రూపాయలు ఆస్తులు అపపగించడాన్ని పలువురు ప్రశ్నిస్తున్నారు. రిటైర్డ్ ఐపీఎస్ అధికారి సి ఆంజనేయరెడ్డి లాంటి అధికారులు ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖను అత్యున్నతమైనదిగా తీర్చి దిద్దారని పలువురు చెబుతున్నారు.
గిరిజన చట్టాలను ఉల్లంఘిస్తున్నారు
రాష్ట్ర పర్యాటక అభివృద్ధి శాఖకు గిరిజన ప్రాంతాల్లో ఎక్కువ ఆస్తులున్నాయి. ప్రైవేట్ వ్యక్తులు ఇక్కడ హోటళ్లు, రిసార్ట్‌లు నిర్మించకూడదని నిబంధన ఉన్నందున ప్రభుత్వ సంస్థ పేరుతో రాష్ట్ర పర్యాటక శాఖ హోటళ్లను నిర్మించింది. ఇప్పుడు వీటిని ప్రైవేట్ వ్యక్తుల పరం చేయటం 1/70 చట్టానికి విరుద్ధం. ఏజెన్సీలో ఈ చట్టం ప్రకారం గిరిజనేతరులు ఎటువంటి కార్యకలాపాలు చేయరాదు. పర్యాటక శాఖకు గిరిజన ప్రాంతాల్లో ఆస్తులను నిర్వహించే సామర్థ్యం లేకపోతే గిరిజన కో ఆపరేటివ్ సొసైటీకి, సంఘాలకు లేదా ట్రై కార్‌కు వీటిని అప్పగించవచ్చు. అందుకు విరుద్ధంగా ప్రైవేట్ పెత్తందారులకు కట్టబెడితే రాష్ట్ర పర్యాటక శాఖ గిరిజన చట్టాలు ఉల్లంఘించినట్లే అవుతుంది.
సముద్ర తీర ఆస్తుల ప్రైవేటీకరణ సిఆర్‌జెడ్ నిబంధనలకు విరుద్ధం
గిరిజన ప్రాంతాల తర్వాత పర్యాటక శాఖకు సముద్ర తీరంలో ఎక్కువ ఆస్తులు ఉన్నాయి. ఇక్కడ కూడా ప్రభుత్వ సంస్థ పేరిట పర్యాటక శాఖ కోస్తా నియంత్రణ మండలి నోటిఫికేషన్ పరిధిలో కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖల నుంచి అనుమతులు పొందింది. అనుమతులకు విరుద్ధంగా ఇప్పుడు ప్రైవేటు వ్యక్తుల పరం చేయటం చెల్లదు. గ్రీన్ ట్రిబ్యునల్, సుప్రీంకోర్టు తీర్పుల మేరకు సిఆర్‌జెడ్ పరిధిలోని ప్రైవేట్ ఆస్తులను గతంలో తొలగించారు. ఈ వాస్తవాలను గ్రహించకుండా వీటిని ప్రైవేట్ పరం చేసేందుకు అధికారులు టెండర్లు పిలవడం నిబంధనలకు విరుద్ధం.
అనుయాయులకు కట్టబెట్టేందుకేనా..
ముందుగానే ఎంపిక చేసుకున్న కొందరికి పర్యాటకశాఖ ఆస్తులను ధారాదత్తం చేసేందుకు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి రోజా ఒత్తిడితో ఈ నోటీసు వెలుబడిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిజంగా ప్రభుత్వానికి పర్యాటకశాఖ ఆస్తులను ప్రైవేటుపరం చేసే ఉద్దేశం ఉంటే నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల పాటు ఎందుకు మౌనంగా వున్నారో అధికారులే చెప్పాలి.
షార్ట్ టెండరును రద్దు చేయాలి
ఎన్నికల ముందు హడావుడి నిర్ణయాలను గతంలో కోర్టులు తప్పుపట్టాయి. ఈ వాస్తవాన్ని గ్రహించి ఈ షార్ట్ టెండర్‌ను రద్దుచేసి ప్రభుత్వ పరంగానే పర్యాటకశాఖ ఆస్తులను కొనసాగించలి. లేని పక్షంలో న్యాయస్థానాలను ఆశ్రయించడం మినహా మరో మార్గం లేదు. పర్యాటకశాఖ ఆస్తుల ప్రైవేటుపరం వ్యవహారం ముఖ్యమంత్రికి తెలిసే జరిగిందా? లేదా? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఎన్నికలకు సిద్ధంగా వున్న ముఖ్యమంత్రి వెంటనే ఈ విషయంలో జోక్యం చేసుకొని రాష్ట్ర పర్యాటక ఆస్తులు ప్రైవేటుపరం చేసే టెండర్ ను ఉపసంహరించి ఉద్యోగులను ప్రభుత్వ పరంగా కొనసాగించాలి.
– పీతల మూర్తి యాదవ్, జనసేన కార్పొరేటర్, విశాఖపట్నం.