లోయలో పడిన టూరిస్టు బస్సు, 16 మంది మృతి
విషాదంగా మారిన తీర్థయాత్ర
ఆంధ్రప్రదేశ్ లోని మన్యం అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఇవాళ తెల్లవారుజామున విషాదం చోటుచేసుకుంది. ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయింది. దీంతో 16 మంది వరకు చనిపోయినట్టు అనధికార వర్గాల సమాచారం. మృతుల సంఖ్యను పోలీసులు ఇంకా నిర్ధారించలేదు. అధికారికంగా ప్రకటించలేదు. మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం.. టూరిస్టులతో వెళుతున్న ట్రావెల్స్ బస్సు ఒకటి లోయలో పడి పోయింది. దీంతో అక్కడికక్కడే 8 మంది టూరిస్టులు చనిపోయినట్టు ప్రాధమిక సమాచారం. మరో 8 మంది ఆ తర్వాత మరణించారని తెలిసింది. బస్సు లోయలో పడినపుడు బస్సులో సుమారు 35 మంది వరకు యాత్రికులు ఉన్నట్టు స్థానికుల కథనం.
ఈ బస్సు చిత్తూరు జిల్లా లో రిజిస్ట్రేషన్ అయింది. భద్రాచలం నుంచి అన్నవరం వెళుతూ ఉండగా ఈ ప్రమాదం జరిగింది. చింతూరు - మారేడుమిల్లి ఘాట్ రోడ్డులో ప్రమాదం చోటుచేసుకుంది.
భద్రాచలం దర్శనం పూర్తిచేసుకుని అన్నవరం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బస్సులోని ప్రయాణికులు చిత్తూరు జిల్లాకు చెందిన వారిగా సమాచారం.
పూర్తి సమాచారం అందాల్సి ఉంది.