CASH FOR QUERY | సంచలం సృష్టిస్తున్న గిరిజన ఎమ్మెల్యే అరెస్ట్

లంచం కేసుల్లో గిరిజన ఎమ్మెల్యేలే ఎందుకు టార్గెట్ అవుతున్నారు?;

Update: 2025-05-05 11:46 GMT
రాజస్థాన్ ఎమ్మెల్యే జైకృష్ణ
రాజస్దాన్ లో ఓ గిరిజన ఎమ్మెల్యేను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేయడం పెద్ద సంచలనం సృష్టించింది. ఓ మైనింగ్ కంపెనీ యజమాని నుంచి లంచం తీసుకుంటుండగా ఆయన అరెస్ట్ చేసినట్టు ఏసీబీ ప్రకటించినా దీని వెనుక బీజేపీ కుట్రే ఉండి ఉండవచ్చని భారత్‌ ఆదివాసీ పార్టీ (బీఏపీ) ఆరోపించింది.
ఓటుకు నోటు మాదిరే చట్టసభల్లో డబ్బులకు ప్రశ్నలు అడిగి అభాసుపాలయిన ఉదాహరణలు గతంలోనూ జరిగాయి. ఇప్పుడు ఓ ఎమ్మెల్యే నేరుగా లంచం తీసుకుంటూ అరెస్ట్ కావడం సంచలనం. చిత్రమేమిటంటే ఈ తరహా కేసుల్లో ఎక్కువ మంది నిమ్నవర్గాల వారే దొరికిపోవడం. అవిశ్వాస పరీక్ష నుంచి పీవీ నరసింహారావు ప్రభుత్వాన్ని గట్టెక్కించే వ్యవహారంలో జార్ఖండ్ ముక్తి మోర్చా నాయకుడు శిబూ సోరెన్ కూడా లంచం తీసుకున్నారనే ఆరోపణలపై అరెస్ట్ అయిన సంగతి ఇక్కడ ప్రస్తావనార్హం.
ఇప్పుడేం జరిగిందంటే...
భారత్‌ ఆదివాసీ పార్టీ (బీఏపీ) ఎమ్మెల్యే జైకృష్ణ పటేల్‌ జైపూర్‌ జ్యోతి నగర్‌లోని తన అధికార నివాసంలో ఒక మైనింగ్‌ కంపెనీ యజమాని నుంచి రూ 20 లక్షలు లంచం తీసుకుంటూ రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుబడినట్లు ఆ రాష్ట్ర ఏసీబీ ప్రకటించింది. ఏసీబీ కథనం ప్రకారం... కరౌలి జిల్లాలోని తోడభీమ్‌ బ్లాక్‌లోని కొన్ని మైనింగ్‌ లీజులకు సంబంధించిన మూడు ప్రశ్నలను గత అసెంబ్లీ సమావేశాల్లో అడిగారు. అయితే ఆ ప్రశ్నలను ఉపసంహరించుకునేందుకు మైనింగ్‌ యజమాని నుంచి ఎమ్మెల్యే రూ.10 కోట్లు డిమాండ్‌ చేశారు. చివరకు డీల్‌ రూ.2.5 కోట్లకు కుదరడం, విడతల వారీగా చెల్లించేందుకు అంగీకారం కుదిరింది. ఈ ఒప్పందం కుదిరిన సమయంలోనే ఆ మైనింగ్ కంపెనీ యజమాని ఏసీబీకి ఆయన సమాచారం అందించాడట.
ఈ క్రమంలో.. ఇప్పటికే లక్ష చెల్లించగా.. ఆదివారం మరో రూ.20 లక్షలు ఇచ్చేందుకు ఆ యజమాని ప్రయత్నించాడు. దీంతో.. ఏసీబీ ఈ విషయాన్ని ముఖ్యమంత్రి భజన్‌లాల్‌ శర్మ, స్పీకర్‌ వాసుదేవ్‌కి తెలియజేసి అరెస్ట్‌కు ముందస్తుగానే అనుమతి పొందారు. సరిగ్గా డబ్బు తీసుకుంటున్న సమయంలో ఎమ్మెల్యేను అరెస్ట్‌ చేసినట్లు ఏసీబీ డైరెక్టర్‌ జనరల్‌ రవి ప్రకాష్‌ మెహర్దా మీడియాకు తెలియజేశారు. అంతేకాదు.. ఎమ్మెల్యే కృష్ణ పటేల్‌ డబ్బు తీసుకుంటున్న టైంలో ఆడియో, వీడియో ఫుటేజీలు ఉన్నట్లు వెల్లడించారు. అయితే ఎమ్మెల్యే అనుచరుడొకరు డబ్బు సంచితో ఉడాయించినట్లు, అతని కోసం గాలిస్తున్నట్లు తెలిపారాయన.
లోక్‌ సభ ఎన్నికలతో పాటు కిందటి ఏడాది జరిగిన బగిడోరా నియోజవర్గం (బంస్వారా జిల్లా) ఉప ఎన్నికల్లో కృష్ణ పటేల్‌ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆయన ఫస్ట్‌ టైం ఎమ్మెల్యే. భారత్‌ ఆదివాసీ పార్టీకి మొత్తం నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. అరెస్టు తరువాత ఎమ్మెల్యేను ఏసీబీ ప్రధాన కార్యాలయానికి తరలించారు.
ఈ పరిణామంపై భారత్‌ ఆదివాసీ పార్టీ కన్వీనర్‌, బం‌స్వారా ఎంపీ రాజ్‌కుమార్‌ రావోత్‌ స్పందించారు. ఇది బీజేపీ కుట్ర అయ్యి ఉండొచ్చని భావిస్తున్నట్లు తెలిపారు. ఒకవేళ కృష్ణపటేల్‌ హస్తం ఉన్నట్లు తేలితే చర్యలు ఉంటాయని తెలిపారు.
మరోవైపు కాంగ్రెస్‌ ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. చట్టం ముందు అందరూ సమానమేనని, రాజకీయాల్లో అవినీతి పనికి రాదని ఆ పార్టీ కీలక నేత సచిన్‌ పైలట్‌ అన్నారు. అదే సమయంలో దర్యాప్తు సంస్థలను అడ్డుపెట్టుకుని బీజేపీ చేస్తున్న రాజకీయాలపైనా చర్చ జరగాలని కోరారాయన. ఈ ఆరోపణలపై బీజేపీ స్పందించాల్సి ఉంది.
ఇదే తరహాలో గతంలో తెలంగాణలో ఓటుకు నోటు కేసు నమోదు అయింది. పశ్చిమ బెంగాల్ కి చెందిన టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా "ప్రశ్నకు నోటు" కేసులో రాజ్యసభ సభ్యత్వాన్ని కోల్పోయారు. ఈ నేపథ్యంలో రాజస్థాన్ ఎమ్మెల్యే అరెస్ట్ చర్చనీయాంశమైంది.
పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఎంపీ మహువా మొయిత్రా పార్లమెంటులో ప్రశ్నలు అడిగేందుకు లంచం తీసుకున్నారని ఆరోపణలు ఎదుర్కొన్నారు.
‘ప్రశ్నలకు నగదు కేసు’ అంటే ఏమిటి?
పార్లమెంటులో ప్రశ్నలు అడిగేందుకు లంచాలు తీసుకుంటారన్న ఆరోపణలను “ప్రశ్నలకు నగదు” కేసుగా పిలుస్తుంటారు. “ప్రశ్నలకు నగదు” కుంభకోణం 2005లో పార్లమెంటులో ప్రశ్నలు అడగడానికి నగదు తీసుకున్నందుకు 11 మంది పార్లమెంటు సభ్యులను దోషులుగా తేల్చినట్టు రికార్డులు చూపుతున్నాయి.
ఎక్కడ తేడా ఉందో తెలియడం లేదు గాని ఈ తరహా కేసుల్లో నేరుగా అరెస్టులు, జైలు శిక్షలు పడినవారిలో ఎక్కువ మంది నిమ్నజాతి వర్గాలే కావడం గమనార్హం.
Tags:    

Similar News