తిరుమల శ్రీవారి పాదాల చెంత బలహీనుల ఆక్రందన
పట్టించుకోని మీడియా ప్రధాన ఛానళ్ళు సోషల్ మీడియా ఆలంబనగా సాగుతున్న పోరాటం. నేడు టీటీడీ పరిపాలన భవనం వద్ద రాజకీయ పక్షాల, తిరుపతి ప్రముఖుల సంఘీభావ దీక్ష
By : The Federal
Update: 2024-02-01 03:49 GMT
-కందారపు మురళి
తిరుమల శ్రీవారి పాదాల చెంత బలహీనుల ఆక్రందన
బక్క చిక్కిన శరీరాలు డస్సిపోతున్నాయి
ఆమరణ నిరాహార దీక్షలో టిటిడి అటవీ కార్మికులు
మూడు సంవత్సరాల రెండు నెలలుగా రిలే నిరాహార దీక్షలు
30 సంవత్సరాల సర్వీసు కలిగిన టీటీడీ అటవీ కార్మికులను పర్మినెంట్ చేయకుండా ... పది సంవత్సరాల బ్రేకప్ సర్వీస్ కలిగిన జూనియర్లను పర్మినెంట్ చేసిన ఘన చరిత్ర టిటిడిది. తమకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించారని... కోర్టుకు వెళ్లారన్న అక్కసుతో వీరిని లక్ష్మీ శ్రీనివాసా కార్పొరేషన్ లో బలవంతంగా టిటిడి యాజమాన్యం విలీనం చేసింది. పట్టు వీడని ఈ కార్మికులు సంఖ్య తక్కువే అయినా సమాజానికి విస్మయం కలిగించేలా మూడు సంవత్సరాల రెండు నెలలుగా సిఐటియు ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు తిరుపతి నగరంలో చేస్తున్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిపాలన చేపట్టి 56 నెలలు కాగా 38 నెలలుగా ఈ పేద కార్మికులు ఓవైపు విధులు నిర్వహిస్తూనే వంతుల వారీగా కడుపు మాడ్చుకుంటూ రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. నేటికి 1163 రోజులు కావస్తున్నది. వీరి న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి ఆధ్వర్యంలో మరో ఎనిమిది మంది కార్మికులు జనవరి 27న ఆమరణ నిరాహార దీక్షను చేపట్టారు.
29వ తేదీ అర్ధరాత్రి పోలీసులు దీక్షా శిబిరంపై పడి కార్మికులను, కందారపు మురళిని బలవంతంగా అరెస్టు చేసి దీక్షలు భగ్నం చేశారు. అదే రోజు రాత్రి 12 గంటల నుంచి మరో ఏడుగురు కార్మికులు ఆమరణ నిరాహార దీక్షలకు పూనుకున్నారు. ఈ దీక్ష నేటికీ మూడవ రోజుకు చేరుకున్నది.
తిరుమల కొండ, తిరుపతి నగర రోడ్ల మధ్యన కనపడే డివైడర్లు, రామచంద్ర పుష్కరిణి, తిరుమల శిలా తోరణం, గార్డెన్లు, పార్కులు, ఆఖరుకు టీటీడీ పెద్దలు పరిపాలనా కార్యక్రమాలు చక్కబెట్టే ఏడి బిల్డింగ్ ఎదురుగా ఉన్న పార్కులో సైతం పచ్చదనం పరుస్తున్నది వీరే. పచ్చదనానికి అంబాసిడర్లుగా ఉన్న ఈ పేద కార్మికుల జీవితాలు పచ్చగా లేకపోవడం వారి దురదృష్టం అనాలా?
తిరుమల వెంకన్న సాక్షిగా జరిగిన ఈ అన్యాయాన్ని ఏ దేవుడికి చెప్పాలి. దిక్కు తెలియని స్థితిలో ఉన్న వారికి ఆలంబన జీవించి ఉన్న మనం కాక మరెవరు? తిరుపతి నగరంలో మానవత్వం ఉన్న ప్రతి మనిషి స్పందించాల్సిన సమయం ఇది. అటవీ కార్మికులు చేపట్టిన దీక్షా శిబిరం తీర్థయాత్రలా మారాలి. పేదలు సాగిస్తున్న ఈ పోరాటానికి సంఘీభావం వెల్లువెత్తాలి.
తిరుపతి నగరంలోని విద్యాసంస్థలు విద్యార్థులను దీక్షా శిబిరానికి పంపి మద్దతును ప్రకటించాలి. తిరుపతి నగరంలోని వివిధ సంస్థలు తమ పరిధిలోని వ్యక్తులను, ఉద్యోగులను, కార్మికులను ఈ పేద కార్మికులకు అండగా నిలిచేందుకు తరలి రావాలి. తిరుపతి నగరంలోని పౌర సమాజం పేదలకు అండగా మేము ఉన్నామని ప్రకటించాల్సిన సమయం ఆసన్నమైంది. పేదవాడి ఆక్రందన అరణ్య రోదన కాకూడదు.
(కందారపు మురళి, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి, తిరుపతి)