ధార్మిక సంస్థలో అధర్మం, తిరుపతిలో ఆమరణ దీక్ష

టిటిడి అటవీ కార్మికులకు అన్యాయం. ధార్మిక సంస్థలో అధర్మం రాజ్యమేలుతోంది.ప్రజల ముందు తలవంచుకునే స్థితి తెచ్చుకోవద్దు అంటున్న కార్మిక సంఘాల నేతలు

Update: 2024-01-28 11:39 GMT
కార్మిక నేత కందారపు మురళి నేతృత్వంంలో సాగుతున్న ఆమరణ నిరాహార దీక్ష
ధార్మిక సంస్థలో అధర్మం రాజ్యమేలుతోంది: పెనుమల్లి మధు మాజీ రాజ్యసభ సభ్యులు

ప్రజల ముందు తలవంచుకునే స్థితి తెచ్చుకోవద్దు: టీటీడీ యాజమాన్యానికి విఠపు సూచన

పరిష్కరించకుంటే దీక్షలో మేము సైతం: రాయలసీమ అధ్యయనాల సంస్థ అధ్యక్షులు భూమన్
టీటీడీకి ఇది తగదు: విశ్రాంత న్యాయమూర్తి గుర్రప్ప
పరిష్కరించకుంటే ఆందోళన మరింత ఉధృతం: అఖిలపక్ష నేతలు

ధార్మిక సంస్థ తిరుమల తిరుపతి దేవస్థానంలో అధర్మం రాజ్యమేలుతుందని, కనీసమైన ప్రజాస్వామ్య విలువలు, సహజ న్యాయ సూత్రాలు పాటించబడటం లేదని మాజీ రాజ్యసభ సభ్యులు పెనుమల్లి మధు తీవ్రస్థాయిలో విమర్శించారు.

38 నెలలుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్న టిటిడి అటవీ కార్మికులకి న్యాయం జరగడంలేదని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి ఆధ్వర్యంలో 9 మంది అటవీ కార్మికులు నిరవధిక నిరాహార దీక్షలు శనివారం నాటి ఉదయం తిరుపతి నగరంలో చేపట్టారు.

ఈ దీక్షలను మాజీ రాజ్యసభ సభ్యులు పెనుమల్లి మధు, మాజీ శాసనమండలి ఛైర్మన్ విఠపు బాలసుబ్రమణ్యం, మాజీ విశ్రాంత న్యాయమూర్తి పి. గుర్రప్ప, రాయలసీమ అధ్యయనాల సంస్థ అధ్యక్షులు భూమన్, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పి. హరినాధ రెడ్డి, రిపబ్లికన్ పార్టీ నేత పి. అంజయ్య, జనసేన నేత కిరణ్ రాయల్, సిపిఐ (ఎంఎల్) నేత ఆర్. హరికృష్ణ, ఆప్ పార్టీ నేత నాగేష్, బీఎస్పీ నేత విజయ్ కుమార్ తదితరులు దీక్షలో ఉన్న నేతలకు పూలమాలలు వేసి శిబిరాన్ని ప్రారంభించారు.

దీక్షను ఉద్దేశించి మధు తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ టీటీడీ ఛైర్మన్ గా కరుణాకర్ రెడ్డి ఉండి కార్మికులకి కష్టం కలగడం ఆశ్చర్యం కలిగిస్తున్నదని, చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించి ఐదు నెలలైనా అటవీ కార్మికుల గురించి చర్చించకపోవడం న్యాయం కాదని అన్నారు. తక్షణం సమస్యల పరిష్కారానికి తోడ్పడాలని కోరారు.38 నెలల నుంచి కార్మికులు తమ న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం పోరాడుతుండటం ధార్మిక సంస్థలో మంచిది కాదని ఆయన అన్నారు.

శాసనమండలి మాజీ ఛైర్మన్ విఠపు బాలసుబ్రమణ్యం ప్రసంగిస్తూ టీటీడీ ఇటీవల కాలంలో వివాదాలకు కేంద్రంగా మారిందని, అటవీ కార్మికుల సమస్య వింటుంటే ఆశ్చర్యం కలుగుతున్నదని జూనియర్లను పర్మినెంట్ చేసి సీనియర్లను కార్పొరేషన్ లో బలవంతంగా కలపడం సమంజసమా? అని ప్రశ్నించారు. భక్తుల ముందు టీటీడీ తలవంపులు తెచ్చుకోక ముందే ఈ సమస్య పరిష్కారానికి యాజమాన్యం ముందుకు రావాలని ఆయన సూచించారు.

టీటీడీ లాంటి ప్రతిష్ట కలిగిన సంస్థ ఇలాంటి వివాదాల్లో కూరుకుపోవడం మంచిది కాదని విశ్రాంత న్యాయమూర్తి పెనుమూరు గుర్రప్ప అన్నారు. అటవీ కార్మికుల సమస్యలను, కేసులను తాను అధ్యయనం చేశానని, అటవీ కార్మికులు కోరుతున్న కోరికలు అత్యంత న్యాయమైనవని ఏ రోజైనా న్యాయస్థానాలలో గెలుపు అటవీ కార్మికులదేనని... యాజమాన్యం స్పష్టమైన వివక్ష ప్రదర్శించిందని... కొందరికి మేలు చేసినట్టుగా కనిపిస్తున్నదని... కొందరికి ఉద్దేశ్యపూర్వకంగా అన్యాయం చేసిందని ఆయన ఆరోపించారు.

అటవీ కార్మికుల పోరాటం న్యాయమైందని పలుమార్లు తాను కూడా ఉన్నతాధికారులతో మాట్లాడానని, రాయలసీమ అధ్యయనాల సంస్థ అధ్యక్షులు భూమన్ అన్నారు. పలుమార్లు సిఐటియు ఆధ్వర్యంలో పోరాడుతున్నా, విజ్ఞప్తులు చేస్తున్నా యాజమాన్యం పట్టించుకోకపోవడం అమానుషమని... సమస్య పరిష్కరించని పక్షంలో తాను కూడా దీక్షలో పాల్గొనాల్సి వస్తుందని హెచ్చరించారు.

సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పి. హరినాధ రెడ్డి ప్రసంగిస్తూ టీటీడీ ఉన్నతాధికారులకు టీటీడీ పనుల కంటే అధికార పార్టీకి సేవలు చేయడంలో తలమునకలై ఉన్నారని ఆరోపించారు. రిపబ్లికన్ పార్టీ దక్షిణ భారత అధ్యక్షులు పూతలపట్టు అంజయ్య ప్రసంగిస్తూ టీటీడీలో కార్మికుల పట్ల అమానవీయ పద్ధతులు అనుసరిస్తున్నారని, తిరుమల కొండ పచ్చదనానికి కారకులైన అటవీ కార్మికుల పట్ల అమానుషంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు.

జనసేన నాయకులు కిరణ్ రాయల్, రాజారెడ్డి, సిపిఐ ఎంఎల్ జిల్లా కార్యదర్శి ఆర్. హరికృష్ణ, ఆప్ జిల్లా అధ్యక్షులు నాగేష్, బిఎస్ పి నేత విజయ్ కుమార్, సిపిఎం జిల్లా కార్యదర్శి వి. నాగరాజు, సిపిఐ జిల్లా కార్యదర్శి పి. మురళి, సిఐటియు జిల్లా అధ్యక్షులు జి. బాలసుబ్రమణ్యంలు ప్రసంగిస్తూ సమస్య పరిష్కరించకుంటే, నిర్లక్ష్యం కొనసాగితే తగిన మూల్యం టిటిడి యాజమాన్యం చెల్లించుకోవలసి వస్తుందని హెచ్చరించారు.

నిరవధిక దీక్షలకు తిరుపతి నగరంలోని పలువురు ప్రముఖులు హాజరై మద్దతును ప్రకటించారు.
నగరంలోని వివిధ సంఘాల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ప్రదర్శనగా వచ్చి దీక్షలోని వారికి పూలమాలలు వేసి సంఘీభావం ప్రకటించారు.
ఈ కార్యక్రమానికి ఆటో, హమాలీ, బిల్డింగ్, హాకర్స్, రుయా ఆసుపత్రి కాంట్రాక్ట్ కార్మికులు, శెట్టిపల్లి భూ బాధితులు, స్విమ్స్ ఆసుపత్రి కార్మికులు, ప్రయివేట్ బస్సు కార్మికులు, అంగన్వాడి మహిళలు, మెడికల్ రెప్స్, ఆర్టీసీ, అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారులు, కళ్యాణ కట్ట క్షురకులు, టీటీడీ కాంట్రాక్ట్ కార్మికులు, విద్యార్థులు దీక్షలకు పెద్ద సంఖ్యలో పాల్గొని మద్దతును తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో మాజీ టౌన్ బ్యాంక్ చైర్మన్ టిజీ వెంకటకృష్ణ, పూర్వ విద్యార్థుల సంఘం నేతలు అర్జున్, జయచంద్ర, శ్రీనివాసులు, సిఐటియు నేతలు టిసుబ్రహ్మణ్యం, కే. వేణుగోపాల్, ఆర్ లక్ష్మీ, ప్రసాదరావు, వాణిశ్రీ, పద్మలీల, పుల్లయ్య, మునిరాజ, బుజ్జీ, శ్రీనివాసులు రమేష్, గురవయ్య, నాగరాజు, రఘు పార్థసారథి, మాధవ్, కృష్ణ, పద్మనాభం, లక్ష్మయ్య టీటీడీ నేతలు ప్రసాదరావు, వెంకటేష్, పద్మనాభం తదితరులు పాల్గొన్నారు.


ఇది కూడా చదవండ


కోరిన కోర్కెలు తీర్చే తిరుమలేశుడికి ఈ టిిటిడి చిరుద్యోగులు భారమా?

Content Area



Tags:    

Similar News