ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పండుగగా వాల్మీకి జయంతి
వాల్మీకి జయంతిని రాష్ట్ర పండుగగా ప్రభుత్వం ప్రకటించింది. తన యువగళం పాదయాత్రలో వాల్మీకీ, బోయలకు ఇచ్చిన హామీని నెరవేర్చానని లోకేష్ చెప్పారు.
Byline : Vijaykumar Garika
Update: 2024-10-13 13:20 GMT
వాల్మీకి జయంతిని రాష్ట్ర పండుగగా జరుపుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో వాల్మీకి జయంతిని రాష్ట్ర పండుగగా ప్రభుత్వం ప్రకటిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 17 న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అధికారికంగా వాల్మీకి జయంతిని నిర్వహించాలని పేర్కొంది. రాష్ట్ర స్థాయి వేడుకలను మాత్రం అనంతపురంలో జరపనున్నట్లు ప్రకటించింది. ఆ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
వాల్మీకి జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించాలని రాష్ట్రంలోని బోయ, వాల్మీకి వర్గానికి చెందిన ప్రజలు లోకేష్‌ను కోరారు. యువగళం పాదయాత్రలో లోకేష్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో లోకేష్ వారికి హామీ ఇచ్చారు. తాము అధికారంలోకి వస్తే వాల్మీకి జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటిస్తామని లోకేష్ హామీ ఇచ్చారు. ఈ మేరకు తన పాదయాత్రలో ఇచ్చిన మాట మేరకు అధికారంలోకి వచ్చిన తర్వాత వాల్మీకి, బోయలకు ఇచ్చిన హామీని నెరవేర్చిందని మంత్రి నారా లోకేష్ తెలిపారు. బీసీల ఆత్మగౌరవాన్ని పెంచే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోందన్నారు.