‘వికసిత్ ఏపీ-2047 నా లక్ష్యం’.. తేల్చి చెప్పిన చంద్రబాబు..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నాలుగోసారి అధికారం చేపట్టిన దగ్గర నుంచి అభివృద్ధి, పారిశ్రామికీకరణ, సంక్షేమాలపై సీఎం చంద్రబాబు ఫుల్ ఫోకస్ పెట్టారు.

Update: 2024-08-27 10:35 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నాలుగోసారి అధికారం చేపట్టిన దగ్గర నుంచి అభివృద్ధి, పారిశ్రామికీకరణ, సంక్షేమాలపై సీఎం చంద్రబాబు ఫుల్ ఫోకస్ పెట్టారు. ప్రతి శాఖ అధికారులతో ప్రత్యేక సమీక్షలు నిర్వహిస్తూ.. ఆయా శాఖల్లో గత ఐదేళ్లలో జరిగిన అవకతవకలపై చర్చిస్తున్నారు. మరోవైపు కేంద్ర సంస్థలతో కూడా ఎప్పటికప్పుడు చర్చలు నిర్వహిస్తూ ఏపీ అభివృద్ధిపై కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. అందులో భాగంగానే ఢిల్లీ వెళ్లిన సందర్భాల్లో కూడా ఏపీకి రావాల్సిన నిధులతో పాటు పరిశ్రమలను తీసుకొచ్చే ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈరోజు ఆయన నీతి అయోగ్ ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఇందులో తమ ప్రభుత్వం చేస్తున్న ఫ్యూచర్ ప్లాన్స్ గురించి కీలకంగా చర్చించినట్లు సమాచారం. పలు కీలక నిర్ణయాలు కూడా ఈ సమావేశంలో తీసుకున్నారు. నీతి అయోగ్ ప్రతినిధులకు చంద్రబాబు తన విజన్‌ను వివరించారు.

అదే నా టార్గెట్: బాబు

‘‘అధికారంలోకి వచ్చామంటే.. ప్రజలకు ఏదో తూతూ మంత్రంగా చేయడానికి కాదు. 2047 నాటికి ఏపీని 2 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే నా టార్గెట్. మాక్రో టు మైక్రో విధానం పాటించేలా చర్యలు తీసుకోనున్నాం. వచ్చే ఐదేళ్లకు జిల్లాల వారీగా విజన్ డాక్యుమెంట్లు సిద్ధం చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్‌ను హై వాల్యూ అగ్రీ ప్రాసెసింగ్ హబ్‌గా రూపొందిస్తాం. పారిశ్రామికంగా కూడా యువతలో నైపుణ్యం పెంచేలా కార్యాచరణ సిద్ధం చేస్తున్నాం. ఈస్ట్ ఇండియాకు ఏపీని లాజిస్టిక్ హబ్‌గా తీర్చిదిద్దుతాం’’ అని చెప్పారు.

వైద్యంపై ఫుల్ ఫోకస్..

‘‘ఏపీలోని పలు నగరాలను గ్రోత్‌సెంటర్లుగా మారుస్తాం. రాష్ట్రాన్ని అంతర్జాతీయ పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తాం. అందుకోసం ఇప్పటికే ప్రణాళికలు కూడా సిద్ధం చేస్తున్నాం. పరివ్రమలు, పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తికి ఏపీకి కేంద్రంగా తీర్చిదిద్దుతాం. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ అత్యాధునిక వైద్య సేవలు అందిస్తాం. ఇప్పటికే ఆరోగ్య శాఖ అధికారులకు ఈ మేరకు ఆదేశాలు కూడా జారీ చేశాం. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందించే వైద్యం.. ప్రైవేటు ఆసుపత్రుల తలదన్నేలా ఉండాలని దిశానిర్దేశం చేశాం. పర్యావరణ అనుకూల అభివృద్ధిపై దృష్టి పెడుతున్నాం. మన అభివృద్ధి పర్యావరణానికి కష్టం కలిగించకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నాం. ఇందుకోసం నిపుణులతో చర్చలు చేస్తున్నాం. భవిష్యత్తులో అభివృద్ధికి ఏపీ ఒక నమూనాలా ఉండాలనేది నా కల. డిజిటల్ గవర్నెన్స్, ఆర్థికాభివృద్ధితో ఇది సాధ్యం. ఆ దిశగానే అడుగులు వేస్తున్నాం’’ అని తెలిపారు.

Tags:    

Similar News