రామ్‌గోపాల్‌ వర్మపై ఏపీ పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో?

పోలీసుల విచారణకు డుమ్మా కొట్టిన ప్రముఖ సినీ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ. సోషల్‌ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెట్టారని కేసు నమోదు చేసిన ఏపీ పోలీసులు.

Update: 2024-11-25 05:40 GMT

ఆంధ్రప్రదేశ్‌ పోలీసులు ప్రముఖ సినీ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మపై ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠగా మారింది. ఏపీ పోలీసులు హైదరాబద్‌లో ఆర్జీవీ ఇంటికి వెళ్లి మరి విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు అందజేశారు. అయినా ఆర్జీవీ హాజరు కాకపోవడం ప్రస్తుతం హాట్‌ టాపిక్‌గా మారింది.

రామ్‌గోపాల్‌ వర్మపై ఏపీలో సోషల్‌ మీడియా కేసు నమోదైంది. చంద్రబాబు నాయుడు, పవన్‌ కళ్యాణ్‌లపై సోషల్‌ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెట్టారని ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. వ్యూహం సినిమా ప్రమోషన్‌ల సమయంలో చంద్రబాబు, లోకేష్, బ్రాహ్మణి, పవన్‌ కళ్యాణ్‌లపైన వారి వ్యక్తిత్వాలను కించపరిచేలా సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టారని టీడీపీ రైతు విభాగం ఉపాధ్యక్షుడు నూతలపాటి రామారావు ఫిర్యాదు చేయడంతో తుళ్లూరు పోలీసులు కూడా మరో కేసు నమోదు చేశారు.
దీనిపై తనకు రక్షణ కల్పించాలని కోరుతూ హైకోర్టుకెళ్లిన ఆర్జీవికి చుక్కెదురైంది. అరెస్టు సమయంలో ముందస్తు బెయిల్‌కు పిటీషన్‌ వేసుకోవాలని, పోలీసుల విచారణకు తప్పకుండా హాజరు కావాలని ఆర్జీవీకి సూచించింది. మరో వైపు ఈ కేసుకు సంబంధించి పోలీసుల విచారణకు హాజరు కావాలని హైదరాబాద్‌లోని రామ్‌గోపాల్‌ ఇంటికి వెళ్లి మరి మద్దిపాడు పోలీసులు నోటీసులు అందజేసి వచ్చారు. ఈ నెల 19న విచారణకు హాజరు కావలసి ఉంది. ఆ రోజు ఆర్జీవీ పోలీసుల విచారణకు హాజరు కాలేదు. సోమవారం హాజరు కావలసి ఉన్నా డుమ్మా కొట్టారు. ఈ నేపథ్యంలో ఆర్జీవీపై ఆంధ్రప్రదేశ్‌ పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠగా మారింది.
Tags:    

Similar News