వైఎస్సార్ ఫ్యామిలీలో ఏమి జరుగుతోంది?
వైఎస్సార్ కుటుంబ సభ్యులు ఎవరి దారిన వారు ఉన్నారు. వైఎస్సార్ బతికి వుండగా ఎటువంటి పొరపొచ్చాలు చోటు చేసుకోలేదు. ఇప్పుడు పరిస్థితులు మారాయి.
షర్మిల వైఎస్సార్ కూతురు కాదనే ధైర్యం వాళ్లకు ఎవరిచ్చారు?
షర్మిల, విజయమ్మను లేపెయ్యాలనే ధైర్యం షోషల్ మీడియాలో ఎవరికి, ఎందుకొచిచ్చింది?
సీఎం జగన్ మోహన్ రెడ్డి చిన్నాన కూతురు సునీత రక్షణ కావాలని సైబర్ క్రై స్టేషన్ ను ఎందుకు ఆశ్రయించారు?
స్వర్గీయ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఫ్యామిలీలో ఏమి జరుగుతోంది? ఎందుకు గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. సాక్షి పత్రికలో చంద్రబాబు కుట్రకోణం ఉందంటూ రాసిన రాతలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. తమ కుటుంబంలో చిచ్చు పెడుతున్నారని సీఎం అంటున్నారు. చెప్పుడు మాటలు వైఎస్సార్ కుటుంబ సభ్యులు వింటారా అనేది పెద్ద చర్చగా మారింది.
సైబర్ క్రైంకు సునీత
నాకు ప్రాణహాని ఉంది. ఎప్పుడు ఏమి జరుగుతుందో తెలియడం లేదు. షర్మల, విజయమ్మను కూడా లేపేద్దామంటున్నారు. నాపై సోషల్ మీడియా వేదికగా గతంలో దాడి జరిగింది. ఇప్పుడు మరింత శ్రుతి మించింది. చంపేస్తామని కూడా బెదిరిస్తున్నారు. అన్యాయంపై ఎదిరించి ప్రశ్నిస్తే ఇంత అన్యాయంగా దాడి చేస్తారా? సోషల్ మీడియాకు అసలు బాధ్యత ఉందా? నాదాకా వచ్చాక కూడా మౌనంగా ఉండాలనుకోవడం లేదు. అందుకే పోలీసులకు ఫిర్యాదు చేశానని సునీత మీడియాకు తెలిపారు. అంటే ఆమె ఎంతటి ఆవేదనకు గురై ఉంటుందో ఆలోచించాల్సి ఉంది. ఇదంతా ఎవరు చేస్తున్నారో తెలియదు, గుర్తించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. షర్మిల వాళ్ల నాన్నకు పుట్టలేదని పోస్టులు పెట్టారు. ఇది తెలిసి కూడా జగన్ ఏమి చేస్తున్నాడు. ఆయన కూడా నాయకుడే కధా.. ఇదేనా ఆయన నేర్చుకున్న సంస్కారం. షర్మిలకు, నాకే ఇలాంటి పరిస్థితి ఉంటే ఇక ఆంధ్రప్రదేశ్ లో మిగిలిన వారి పరస్థితి ఏమిటి? పులివెందుల ఎమ్మెల్యే ఎవరు? అక్కడి వారే ఈ పోస్టులు పెట్టారు. క్రైం జరిగినప్పుడు ఎవరు చేశారో కనుక్కోవాల్సిన బాధ్యత జగన్ అన్నపై లేదా అంటూ సునీత ప్రశ్నించడం విశేషం.
ఒకరిది రాజకీయ పోరాటం, మరొకరిది న్యాయపోరాటం
వైఎస్ షర్మిల రాజకీయ పోరాటం ప్రారంభించింది. వివేకానందరెడ్డి కుమార్తె సునీత న్యాయపోరాటం కొనసాగిస్తోంది. ఇవి వారికున్న హక్కులు. వారి హక్కులకు ఎవరు భంగం కలిగించినా వారిపై ఫిర్యాదుచేసే అధికారం, హక్కు వారికుంది. వివేకా హత్యకేసు ఒక సంచలనం. ఈ కేసులో వందలమందిని సీబీఐ ఇప్పటికే విచారించింది. కేసు ఎన్నెన్నో మలుపులు తిరిగింది. చివరకు కడప ఎంపీ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డిలు కేసులో నిందితులయ్యారు. వీరికి సంబంధం లేదని ముఖ్యమంత్రి జగన్ స్వయంగా చెప్పారు. అటువంటప్పుడు వీరిపై కేసు నమోదైతే సీఎం ఎందుకు పట్టించుకోలేదనేది కూడా చర్చనియాంశమైంది.
వివేకా హత్యకు, రాజకీయాలకు సంబంధం వుందా?
వివేకా హత్య వెనుక రాజకీయ కుట్ర కోణం ఉందా? లేదా? అనేది ఇప్పటికీ బయటకు రాలేదు. తన చిన్నాన హత్య వెనుక టీడీపీ హస్తం ఉందని ఇప్పటికే పలుమార్లు సీఎం వైఎస్ జగన్ చెప్పారు. అయితే తెలుగుదేశం పార్టీ వారు కానీ, చంద్రబాబు మద్దతు దారులు కానీ ఈ కేసులో లేకపోవడం విశేషం. కేసు సీబీఐ చేతికి వెళుతుంటే జగన్ చూస్తూ ఎందుకు ఉన్నారనేది కూడా చర్చకు దారి తీసింది. ప్రభుత్వం తన చేతుల్లొ పోలీసులను పెట్టుకుని పట్టీ పట్టనట్లు వ్యవహరించిందనే విమర్శ ఇప్పటికీ ఉంది. రాజకీయ హత్యా, ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన హత్యా, వివాహేతర సంబంధాలకు సంబంధించిన హత్యా అనేది న్యాయస్థానంలో కాని బయటకు రాదు. అప్పటి వరకు ఈ హత్యను ఏ కోణంలో చూడాలో చెప్పలేము. ఎవరికి వారు ఇష్టం వచ్చిన రీతిలో చెప్పుకోవడం పరిపాటిగా మారింది.
రాజకీయ పోరాటాలు మామూలే..
ఒకే కుటుంబంలోని వారు పలు పార్టీల్లో ఉంటూ రాజకీయంగా ఎవరి ఎదుగుదలను వారు కోరుకోవడంలో తప్పేముంటుంది. రాజకీయాలంటేనే రొచ్చుతో సమానమైనవని అంటుంటారు. కానీ ఇక్కడ సీఎం తల్లి విజయమ్మ, చెల్లెలు షర్మిలపై షోషల్ మీడియాలో అనూహ్యమైన దాడి కొనసాగుతున్నది. జగన్ కు అనుకూలంగా, విజయమ్మ, షర్మిలపై అనుకోని రీతిలో పోస్టులు పెడుతున్న వారిని ప్రభుత్వం ఎందుకు మందలించడం లేదనేది ప్రశ్నార్థకంగా మారింది. ఒక విధంగా ఇటువంటి వారిని ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నట్లు చెప్పాల్సి ఉంటుంది. సోషల్ మీడియాలో వల్గర్గా, భయపెట్టే పోస్టులు పెట్టడం నిశేషం. ఈ విషయాల్లో ఈ ప్రభుత్వం ఇప్పటికే పలువురు షోషల్ మీడియా నిర్వాహకులపై కేసులు పెట్టి అరెస్ట్ లు చేసింది. తల్లి, చెల్లి విషయంలో వస్తున్న పోస్టులపై సీఎం జగన్ స్పందించకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.
పోటీ ఉంటే కుట్రకోణం అవుతుందా?
వైఎస్ వివేకానందరెడ్డి భార్య సౌభాగ్యమ్మ కడప ఎంపీగా పోటీచేసిందే అనుకుందాం. ఇది ప్రతిపక్షం కుట్రకోణం ఎలా అవుతుంది. ఏ పార్టీ నుంచైనా పోటీ చేసేందుకు వారికి స్వేచ్ఛ ఉంది. వీలైతే సౌభాగ్యమ్మకు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి టిక్కెట్ ఇవ్వొచ్చు. లేదంటే ఏ పార్టీ నుంచైనా టిక్కెట్ తీసుకుని ఆమె పోటీ చేస్తుంది, దీనికి ఇంత పెద్ద రాద్దాంతం ఎందుకనే చర్చ కూడా సాగుతున్నది. సౌభాగ్యమ్మను ఇండిపెండెంట్ గా నైనా పోటీలో ఉంచేందుకు చంద్రబాబు అండ్ కో ప్రయత్నం చేస్తున్నదని సాక్షి రాసిన కథనంలో అంత పస ఉన్నట్లు కనిపించలేదు. జరుగుతున్న పరిణామాలను కౌంటర్ గా రాసినట్లు అనిపిస్తుంది తప్ప పరిణామాలు రాసినట్లు లేదు.
షర్మిల, విజయమ్మ మాటల్లో వారి మనసు కష్టపెట్టినట్లు అర్థమవుతోంది...
షర్మిల చేస్తున్న రాజకీయ విమర్శలు కానీ, విజయమ్మ అప్పుడప్పుడు మాట్లాడుతున్న మాటలు కానీ వారి మనసులను ఎంతగానో జగన్ కష్టపెట్టినట్లు ఉన్నాయని చెప్పడం అతిశయోక్తి కాదు. పైగా ఇటీవల నాకూ సాక్ష్లిలో సగ భాగం ఉందని షర్మిల అనటం వెనుక ఆస్థి తగాదాలు కూడా అన్నా, చెల్లెలు మధ్య ఉన్నాయని చెప్పొచ్చు. విజయమ్మ తన ఇద్దరు బిడ్డలను ఎంతో ముద్దుగా పెంచిన తల్లి. స్వర్గీయ వైఎస్ఆర్ కూడా తన ఇద్దరు బిడ్డలను ఎంతో ఇష్టంతో పెంచారు. కనీస తీరికలేని రాజకీయ కార్యక్రమాల్లోనూ వైఎస్సార్ తన బిడ్డల విషయంలో అప్పుడప్పుడూ సమయం కేటాయించి సరదాగా గడిపిన సందర్భాలు ఎన్నో చూశాము. ఇటువంటి పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. ఇంట్లో వారికి ఒకరంటే ఒకరికి పడటం లేదని స్పష్టమైంది. కాంగ్రెస్ రాజకీయాలు వద్దని భావించిన జగన్ తన తండ్రి చరిష్మాతో పార్టీ పెట్టి అధికారంలోకి వచ్చారు. ఇది వారసత్వం అని కూడా అనలేము. తండ్రికి ఉన్న ఇమేజ్ ను సొంతం చేసుకుని జగన్ ముందడుగు వేశారు. ఇందుకు తల్లి, చెల్లి ప్రోత్సాహం, సహకారం ఉంది. ఇప్పుడు వీరు వేరుగా వెళ్లి మాట్లాడుతున్నారంటే అందుకు ఆప్యాయత, అనురాగాలు కొరవడటమే ప్రధాన కారణం.
వివేకా హత్యతో చుట్టుముట్టిన సమస్యలు
వైఎస్ వివేకానందరెడ్డి హత్యతో వైఎస్ఆర్ కుటుంబాన్ని సమస్యలు చుట్టుముట్టాయి. సీఎం వైఎస్ జగన్, ఆయన భార్య భారతి, ఎంపీ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డిలు ఒక్కటయ్యారు. షర్మల భాగ పంపకాల విషయంలో పట్టుపట్టింది. ఈ రేస్ లో ఎవరికి ఏదైనా జరగొచ్చు. ఈ గొడవ ఎంతవరకు పోతుందో చూడాల్సిందే ఇప్పుడే ముగింపు చెప్పలేము.
వి. శంకరయ్య, విశ్రాంత పాత్రికేయులు.
చెల్లెళ్లపై జగన్ కు ప్రేమలేదు
షర్మిల, సునీతలపై ఏపీ సీఎం జగన్‌కు గౌరవం లేదు. సొంత చెల్లెళ్ళపై ప్రేమ లేని జగన్ మహిళా సాధికారత అని ముచ్చట్లు ఎలా చెబుతారు. షర్మిల రాజశేఖర్ రెడ్డి కూతురు కాదని ఆరోపణలు చేస్తూ సోషల్ మీడియాలో వస్తే జగన్ సైలెంట్ గా ఉండడం ఏంటి? జగన్ జైల్లో ఉన్నప్పుడు షర్మిల అన్నకి సపోర్ట్ చేశారు. రాజకీయాల కోసం జగన్ ఇంత దిగజారుతారా? పవర్ ఉందని జగన్ ఎగిరెగిరి పడితే ప్రజలు బుద్ధి చెబుతారు. జగన్ తన సొంత చెల్లెలిపై కక్ష సాధింపు మానుకోవాలి. సునీత న్యాయం కోసం పోరాడుతోంది. ఈరోజు చెల్లికి అవమానం జరుగుతున్నా జగన్ పట్టించుకోవడం లేదు, రేపు తల్లికి అవమానం జరిగినా పట్టించుకోడు. షర్మిల ఏపీకి వెళ్ళగానే జగన్‌కు భయం పట్టుకుంది.
వి. హనుమంతరావు, కాంగ్రెస్ సీనియర్ నేత.