తిరుపతి జూ లో పులి ఎలా చనిపోయింది?

తిరుపతి జూ పార్క్ లో పులులకు ఏమైంది? రాయల్ బెంగాల్ టైగర్ పసికూన ఎందుకు మరణించింది...

Update: 2024-03-19 03:50 GMT
జూలోని పులి

(ఎస్.ఎస్.వి.భాస్కర్ రావ్,)

తిరుపతి: జూ పార్కులో ఏమి జరుగుతోంది? పులులకు ఏమైంది?? ఎందుకిలా జరుగుతోంది. అనే ప్రశ్నలకు ఆస్కారం కల్పించే సంఘటన ఒకటి మళ్లీ జరిగింది. తిరుపతి శ్రీ వెంకటేశ్వర జూపార్క్‌లో రాయల్ బెంగాల్ టైగర్ మరణించింది. గతంలో కూడా ఓ పులి మరణించింది. గత నెలలో పులి ఎన్ క్లోజర్‌లోకి దిగిన వ్యక్తి చిరుత దాడిలో మరణించిన విషయం సంచలనం కలిగించింది.
ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి శ్రీ వేంకటేశ్వర జంతు ప్రదర్శన శాల.. ఆసియా ఖండంలో రెండో అతిపెద్ద జంతు ప్రదర్శన శాల. 2,212 హెక్టార్లలో విస్తరించి ఉన్న ఈ జంతు ప్రదర్శనశాలలో 30 సింహాలను దగ్గరగా చూడవచ్చు. తాజా.. సంఘటన పరిశీలిస్తే, తిరుపతి శ్రీవెంకటేశ్వర జూపార్క్‌లో ఏడు సంవత్సరాల వయసున్న రాయల్ బెంగాల్ సంతతికి చెందిన పులి మరణించింది. తిరుపతి జూ పార్క్‌లోనే ఈ రాయల్ బెంగాల్ మగ పులి పిల్ల 2016 లో జన్మించింది.

పుట్టుకతోనే అనారోగ్య సమస్యలతో ఆ పులి బాధపడుతోందని పశుసంవర్ధక శాఖ అధికారులు తెలిపారు. అనారోగ్య సమస్యలతో ఉన్న ఆ మగ పులి, పుట్టుకతోనే అంధత్వం కూడా ఉన్నట్లు 2017లో నిర్వహించిన వైద్య పరీక్షల్లో స్పష్టమైందని అధికారులు నిర్ధారించారు. ఆ రాయల్ బెంగాల్ టైగర్‌కు వైద్యం చేయిస్తున్నామని, ఈనెల 16వ తేదీ నుంచి పరీక్షలకు పులి శరీరం సహకరించలేదని స్పష్టం చేశారు. ఆదివారం రాత్రి 8:30 గంటలకు బెంగాల్ టైగర్ మృతి చెందినట్లు నిర్ధారించారు. సోమవారం పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం ఖననం చేసినట్లు అటవీశాఖ అధికారుల ద్వారా తెలిసింది.


గతంలో కూడా..
గత ఏడాది మే 29వ తేదీ కూడా ఓ పులి పిల్ల మృత్యువాత పడింది.. కిడ్నీలు, ఊపిరితుల సమస్యతో బాధపడుతున్న ఆ పులిపిల్ల మరణించినట్లు పశువైద్య శాఖ అధికారులు నిర్వహించిన పోస్టుమార్టంలో తేలిందని అప్పట్లో నిర్ధారించారు. అంతకు రెండు నెలల ముందు నల్లమల అటవీ ప్రాంతంలో తల్లి పులికి దూరమైన నాలుగు పిల్లలను తిరుపతి ఎస్వి జూ పార్కుకు తరలించారు. ఆ నాలుగు పులి పిల్లల్లో ఒకటి మరణించింది.
దీంతో అప్రమత్తమైన అటవీ శాఖ అధికారులు, మిగతా మూడు పులి పిల్లల రక్త నమూనాలు సేకరించి హైదరాబాద్‌కు పంపించారు. వాటి ఆరోగ్య స్థితిగతులు తెలుసుకొని వైద్యం అందించే దిశగా ఏర్పాట్లు సిద్ధమైనట్లు జూ పార్క్ అధికారులు స్పష్టం చేశారు. త్వరలోనే ఆ నమూనాల పరీక్ష ఫలితాలు వస్తాయని అధికారులు తెలిపారు. తిరుపతి శ్రీ వెంకటేశ్వర జూ పార్కులో జరుగుతున్న వరుస సంఘటనలు తరచూ వార్తల్లో నిలుస్తున్నాయి.
Tags:    

Similar News